Tribal youth marries his two lovers
సినిమాల్లో వినోదం కోసం చూపించే విచిత్రాలు నిజ జీవితంలో ప్రదర్శించాడు ఓ యువకుడు. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఆ యువకుడి అతి తెలివి తేటలు చివరకు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఘనపూర్ కు చెందిన అర్జున్ ఉపాధ్యాయ వృత్తి విద్య (Bed) శిక్షణ పూర్తి చేసుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు.
కరోన నేపథ్యంలో కొద్ది రోజులుగా గ్రామంలోనే ఉంటున్న అర్జున్ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడుగా సాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో మరదలు వరసయ్యే ఇద్దరు అమ్మాయిలతో(చంద్రకళ, శారద- పేర్లు మార్చాము) చనువుగా ఉండటం, కబుర్లు, కాలక్షేపాలు చాలా సరదాగా గడిచిపోతున్నాయి రోజులు. ఒక మరదలుది అదే గ్రామం కాగా మరొక మరదలుది శంబుగుడెం. మనవాడు ఎంతో జాగ్రత్తగా ఒకరికి తెలియకుండా మరొకరితో గోప్యంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు.
ఈ తరుణంలో ఇంట్లో పెద్దవాళ్ళు మనవాడికి పెళ్లి సంబంధాలు చూడటం, ఆ విషయం ఇద్దరు మరదళ్లకు తెలియటంతో డామిట్ కథ అడ్డం తిరిగింది. ప్రేమ వ్యవహారం తెలిసి ఇరు కుటుంబాల వారు, గ్రామ పెద్దలు షాక్ కు గురయ్యారు. యువతుల తల్లితండ్రి ఆగ్రహంతో గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టారు. రెండు గ్రామాల పెద్దలు పెళ్లికి నిరాకరించినా తాము అర్జున్ ను తప్ప మరొకరిని మనువాడేది లేదని యువతులు మొండికేశారు.
చేసేది లేక ఇరు కుటుంబాల పెద్దలు పెళ్ళికి సమ్మతించారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి జరుగుతున్న తతంగం చూసి మరదళ్ల మాటే నామాట అన్నాడు అర్జునుడు. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక ఇద్దరితో పెళ్లికి మాత్రం ఓకే చెప్పాడు.
ఆదివాసి సంప్రదాయంలో ఇలాంటి పెళ్లి ఎన్నడు చూడలేదని పెళ్ళికి వచ్చినవారు విస్తుపోయారు. వారం రోజుల కిందటే పెళ్లి జరిగినా లాక్ డౌన్ నేపథ్యంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతులు ఇద్దరు డిగ్రీ పూర్తి చేసిన వారు కావటం కొసమెరుపు.
-దేశవేని భాస్కర్