Trs Protest :తెలంగాణ ఏర్పాటు పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. నియోజకవర్గం లోని రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్వయంగా బైక్ ర్యాలీల లో పాల్గొన్నారు. ధర్నా నిర్వహించారు.
ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లోని శ్రీనివాస కాలనీ నుండి తెలంగాణ చౌరస్తా (వయా. క్లాక్ టవర్) వరకు సుమారు 5 వేల బైక్ లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు నిరసనగా భారీ ర్యాలీ నీ నిర్వహించారు.
నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ వైఖరిని నిరసిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వినూత్న రీతిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు. TRS శ్రేణులతో పాటు వ్యాపార వాణిజ్య రంగాలు స్వచ్చందంగా నల్ల బ్యాడ్జీలతో, జెండాలతో నిరసనలు తెలుపుతున్నారు.
తెలంగాణ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల నిరసన సెగ నింగిని తాకింది. పెల్లుబికిన ప్రజల ఆగ్రహ జ్వాలల మధ్య ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వంలో వేలాదిమంది మానస స్కూల్ నుంచి బైక్ ర్యాలీతో నిరసన గళం వినిపిస్తూ ఆర్మూర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రధాని మోడీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలంగాణ పట్ల ప్రధాని మోడీ ఉదేశ్యం ఏంటో ఆయన వ్యాఖ్యలతో బయట పడిందని విమర్శించారు.
తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవాన్నీ దెబ్బతీసేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో మండిపడ్డారు.
ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఢిల్లీలోని గాంధీ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపిన తెరాస పార్లమెంటు సభ్యులు. ఎంపీలు కే కేశవరావు, నామ నాగేశ్వరరావు, కవిత, వెంకటేష్, బిబి పాటిల్, ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పి. రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, జోగినిపల్లీ సంతోష్ తదితరులు ఉన్నారు.
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని MG రోడ్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బైక్ ర్యాలీగా బోట్స్ క్లబ్, ట్యాంక్ బండ్, BRK భవన్, AG ఆఫీస్ మీదుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వరకు చేరుకొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటు పై పార్లమెంటులో చేసిన అనుచిత వ్యాఖ్యల పై జగిత్యాల జిల్లా కలెక్టర్ ఎదుట ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన., ధర్నా, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు.
మోడీ పై సామాజిక మాధ్యమాలు వెల్లువెత్తిన తెలంగాణ ప్రజలు నిరసన
పార్లమెంట్లో ప్రధాన మంత్రి మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకి మోడీ శత్రువు అంటూ #ModiEnemyOfTelangana హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికగా తమ ఆగ్రహాన్ని తెలియపరిచారు.
కేవలం ఒక గంటలోనే 25వేలకు పైగా తెలంగాణ ప్రజలు ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా తమ నిరసనను తెలియజేశారు. దీంతో #ModiEnemyOfTelangana ట్విట్టర్ ట్రెండింగ్ లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది.
ఇవి కూడా చదవండి: ఏపి పునర్విభజనపై ప్రధాని కీలక వ్యాఖ్యలు