Cooker for Sugarless rice: పాత పేపర్లు తిరగేస్తుంటే….అప్పుడెప్పుడో బాగా పేరున్న ఓ రైస్ కుక్కర్ తయారీ సంస్థ వారం రోజులపాటు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఇచ్చిన ప్రకటనలు కనపడ్డాయి… దానిపై గతంలో రాసిన వ్యాసాన్ని మరోసారి ప్రేక్షకులతో పంచుకోవాలని అనిపించింది….
ముందుగా ఒక విన్నపం. కడుపుకు అన్నం తినేవారెవరయినా ఈ ప్రకటన చదివి భయపడకండి. అనవసరంగా ఆందోళన పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ప్రకటన భాషలో, భావంలో ఉన్న వైరుధ్యాలు, తమాషా, చమత్కారాల మీద సరదాగా కాసేపు మాట్లాడుకోవడానికే ఈ చర్చ. ఈ ప్రకటన చూసి ఇన్నేళ్లుగా మీరు తింటున్నది అన్నం కానే కాదని- కాలకూట విషమయిన సున్నమని దయచేసి కంక్లూజన్ కు రాకండి. ఇప్పుడు విషయంలోకి వెళదాం.
మిగతా భాషల్లో ఇదే ప్రకటన ఎలా వండి వార్చి అఘోరించారో కానీ- తెలుగులో మాత్రం అన్నం చేయబోయి షరా మామూలుగా అనువాదాధ్వాన్నం చేసి మనకు వడ్డించారు.
భాషలో ఉడకని మెతుకులు
“ఇండియాలో మొట్టమొదటి రైస్ కుక్కర్ స్టార్చ్ రెసిడ్యుర్ తో “
అన్న హెడ్డింగ్ నాలాంటి తెలుగు అక్షరాలు వెతికి వెతికి; కష్టం మీద కలిపి కలిపి చదువుకునేవారికి అర్థం కాకపోవచ్చు కానీ- సాధారణ పాఠకులకు సులభంగానే అర్థమై ఉంటుంది. ఇంగ్లీషు భాషను తెలుగు లిపిలో లిప్యంతరీకరణ చేసిన ఈ ప్రకటనను పది సార్లు చదవగా-
ఈ కుక్కర్ తో పాటు-
వేరుచేయదగిన పవర్ కార్డు;
క్లోజ్ ఫిట్ లిడ్;
కూల్ టచ్ హ్యాండిల్స్;
అదనపు కుకింగ్ ప్యాన్;
విశిష్టమయిన స్టార్చ్ రిడ్యూసర్ అటాచ్ మెంట్ – ఉన్నాయట.
ఇంత సాంకేతికత, సంక్లిష్ట ఆంగ్ల పారిభాషిక పదాలను అర్థం చేసుకోదగ్గ భాషా జ్ఞానం భగవంతుడు నాకు ఇవ్వకపోవడం వల్ల అనేక మందిని సంప్రదించాను. చివరకు అన్నం వండడం రాకెట్ సైన్సు కంటే కఠినతరం, కఠినతమం అని తేలింది. సాంకేతిక, భాషా శాస్త్రవేత్తలే కాకుండా డాక్టర్లు, న్యుట్రిషన్లతో కూడా మాట్లాడాల్సి వచ్చింది.
పిండి పదార్థమే పిండితార్థం
అనేక రంగాల నిపుణులు ఈ ప్రకటనను అనేక కోణాల్లో పరిశీలించి, అధ్యయనం చేశాక తేలిందేమిటంటే-
అన్నం ఉడికేప్పుడు పిండి పదార్థాన్ని ఈ రైస్ కుక్కర్ వీలయినంత తగ్గిస్తుందట. దాంతో బ్లడ్ షుగర్ పెరగదట. మనం బరువు పెరగమట.
“అన్నంను ఆరోగ్యముగా మార్చుటకు ఈ డిలైట్ రైస్ కుక్కర్” తప్పనిసరి అట.
అన్నమే అన్నాన్ని తిని;
అన్నమే అనారోగ్యాన్ని దూరం పెట్టి;
అన్నమే షుగర్ పరీక్ష చేసి;
అన్నమే కాలపరీక్షలో గెలిచి;
అన్నమే పరబ్రహ్మ తత్వమని తెలిపే-
అన్నాన్ని తనకు తాను తయారుచేసుకుని తానే తిని జీర్ణం చేసుకునే ఈ స్టార్చ్ రెసిడ్యుసర్ లేని వంటిల్లు వంటిల్లే కాదు!
పిండితార్థం ఏమిటంటే పిండి పదార్థాల్లో పిండిపదార్థం లేకుండా మనచేత తినిపించేదే స్టార్చ్ రెసిడ్యుసర్ సిద్ధాంతం.
ఇప్పుడు మీ హృదయం కుతకుత ఉడికితే దానికి ఈ కుక్కర్ బాధ్యత తీసుకోదు. ఈ ప్రకటనాన్నంలో ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. వికటాన్నం వంట ఎలా తయారయ్యిందో తెలియడానికి!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :