Sunday, September 8, 2024
HomeTrending Newsజూన్ 15 నుంచి రైతు బంధు : కేసీయార్

జూన్ 15 నుంచి రైతు బంధు : కేసీయార్

జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబించాలని సూచించారు. జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్ గా పెట్టుకొని ఈ తేదీ వరకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప చేయాలన్నారు. ప్రగతి భవన్ లో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నమని సిఎం తెలిపారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్.సీ.ఐ. తెలంగాణలో సేకరించకపోవడం పై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఈ రకంగా వివక్ష చూపడం సరికాదని, ఈ విషయమై ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు.

వానాకాలం సీజన్ ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ ను అందుబాటులోకి తేవాలని సిఎం అధికారులను ఆదేశించారు. కల్తీవిత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉక్కుపాదం మోపాలని వ్యవసాయ శాఖ , పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయమై డిజిపి మహేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు.

ధాన్యాన్ని కొనడం ఎంత శ్రమో ధాన్యాన్ని సేకరించి స్టాకు చేయడం కూడా అంతే శ్రమతో కూడుకున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కేవలం 4 లక్షల టన్నుల ధాన్యాన్ని స్టాకు చేయడానికి మాత్రమే గోడౌన్ల లభ్యత వుండేదని, కానీ నేడు 25 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు గోడౌన్ల నిర్మాణం జరిగిందన్నారు. భవిఫ్యత్తులో మొత్తం 40 లక్షల టన్నుల సామర్థ్యనికి గోడౌన్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసిందన్నారు.

నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్దాంతంతో, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ముఖ్యమంత్రి సమావేశంలో వివరించారు. కరోనా సమయంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలితే వ్యవసాయ రంగం 17 శాతం ఆదాయన్ని రాష్ట్ర జిఎస్డీపికి అందజేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్