Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ముఖ్యమంతి కేసిఆర్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏడేళ్ళ తర్వాత, హఠాత్తుగా జరిగిన ఈ కలయిక వెనుక మర్మం ఏమిటి? కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, టిపిసిసి ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం ముఖ్యమంత్రిని కలిసి మరియమ్మ లాకప్ డెత్ పై ఫిర్యాదు చేయటం, వారి విన్నపంపై సిఎం అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. సిఎల్పి నేతలు ప్రగతి భవన్ వెళ్ళే సమయానికి హోం మంత్రి మహమూద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డి అక్కడే ఉండటం కాకతాళీయమేనా?

కరోనా రెండో దశ నెమ్మదిస్తున్న ఈ దశలో సిఎం కేసిఆర్ జిల్లాల్లో పర్యటనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలు వేగంగా జరుగుతున్నాయి. వీటన్నింటి వెనుక హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రభావం ఉందా? ఈటెల రాజేందర్ తెరాసకు రాజీనామా చేసి ఏకంగా కేసిఆర్ పైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకున్నారు. హుజురాబాద్ ఫైట్ కొంత టఫ్ గా కనిపిస్తున్నా అంతిమంగా గులాబీయే గుబాళిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి కొంత సమయం ఉంది. మరి కేసిఆర్- కాంగ్రెస్ నేతల సమావేశం దేనికోసం జరిగింది.?

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేల్లో నలుగురూ ప్రభుత్వంపై ఏదో ఒక రీతిలో నిత్యం దుమ్మెత్తి పోసేవాళ్లే. తెరాసలోకి రమ్మన్నా రాకుండా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా ప్రశ్నించే ప్రజాప్రతినిధులు వారు. అయితే కాంగ్రెస్ కు శాసనమండలిలో ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎందుకు తీసుకెళ్ళలేదు.? ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పోలిస్తే జీవన్ రెడ్డి – కేసిఆర్ విధానాలపై ఒంటికాలుపై విరుచుకు పడుతుంటారు.

కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ఇటీవల తెలంగాణలో బిజెపి ప్రజలకు దగ్గర అవుతోంది. హిందుత్వం, మోడీ- అమిత్ షాల విధానాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. బిజెపి బలపడితే కేసిఆర్ కు పక్కలో బల్లెం అవుతుంది. బిజెపితో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండటమే కేసిఆర్ కు మేలు.

ప్రభుత్వ మనుగడకు మరో రెండేళ్ళ వరకు డోకా లేదు. అయితే ఈ దఫా కూడా కేసిఆర్ ఏడాది ముందే ఎన్నికలకు వెళ్తాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో అబివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారని వినికిడి. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సిఎం – కాంగ్రెస్ నేతల భేటీపై వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు – ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలవటంలో మతలబు ఏమీలేదని కేవలం ప్రజాసమస్యల ప్రస్తావనకేనని అంటున్నారు.

రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేసిఆర్ ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శ ఉంది. ఫాంహౌస్ నుంచే పాలన చేస్తున్నారని, ప్రజలకు, అధికారులకు చివరకు అధికార పార్టీ నేతలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదనే ఆరోపణ ఉంది. ఇలాంటి ఆరోపణలు, అపోహలు పోగొట్టేందుకే కేసిఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పది రోజులుగా కెసిఆర్ పర్యటనలు అందులో భాగమే. ప్రగతి భవన్ లో ఆదివారం ‘దళిత్ ఎంపవర్ మెంట్ పథకం’ పై చర్చించేందుకు అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీలను ఆహ్వానించారు. ఈ సమావేశం కోసం రావాలని అన్ని పార్టీల నేతలను సిఎం కేసిఆర్ స్వయంగా పలకరిస్తున్నారు.

కేసిఆర్ చాణక్యం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అంచనా వేయటం కష్టం. తనను నిత్యం ఆడిపోసుకునే వాళ్ళను హఠాత్తుగా కలిసి అందరిని ఆశ్చర్యపరుస్తారు. అయన మాటలకు రెండు వైపులా పదును ఉంటుంది. ప్రతిపక్ష నేతలు పనికిమాలిన వాళ్ళని, ప్రభుత్వాన్ని విమర్శించే విధానం కూడా తెలియని గరీబోల్లని ఎద్దేవా చేస్తారు. మరో సందర్భంలో ప్రతిపక్ష నేతల విలువైన సలహాలు రాష్ట్రాభివృద్దికి కీలకమైనవని వారిని ఆకాశానికి ఎత్తుతారు. సమయానుకూలంగా మాట్లాడటం, ప్రజలను, ప్రతిపక్షాలను తన మాటలు, చేతలతో మెప్పించటం కేసిఆర్ కే చెల్లింది. మాటల మంత్రంలో తెలంగాణలో నేడు కేసిఆర్ కు సరితూగే నాయకుడు లేరనే చెప్పవచ్చు.

– దేశవేని భాస్కర్

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com