Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆమె మనుషులను బతికించింది - ఈమె పులిని రక్షించింది

ఆమె మనుషులను బతికించింది – ఈమె పులిని రక్షించింది

The Saviors: కొందరుంటారు. మిగిలిన వారిలా వృత్తి ఉద్యోగాలను యాంత్రికంగా చెయ్యరు. మనసు పెడతారు. మనసులు గెలుచుకుంటారు. ప్రాణాలు కాపాడేందుకు ఎంతదూరమైనా వెళ్తారు. ఎటువంటి సాహసానికైనా సై అంటారు. అటువంటి అరుదైన ఇద్దరు మహిళలు…

బాధను మరిపించే ‘దోస్త్’
ఇటీవల తుర్కియేలో సంభవించిన భూకంపం అక్కడి జీవితాలను అతలాకుతలం చేసింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. మరెందరో గాయపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ సహాయం అందిస్తున్నాయి. మనదేశం కూడా ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట ఒక బృందాన్ని పంపింది. ఈ బృందంలోనే డాక్టర్ బీనా తివారీ ఉన్నారు. గతంలో నేపాల్ భూకంపం సందర్భంగా వెళ్లిన ‘ఆపరేషన్ మైత్రి’ బృందంలోనూ ఈమె సేవలందించారు. తాత, తండ్రి, మామ, అంతా సైన్యంలో పని చేసిన వారే. భర్త కూడా ఆర్మీలో డాక్టర్.

Lady Doctors

పూణే లోని ఆర్మీ వైద్య కళాశాలలో చదువుకున్న బీనా ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా తుర్కియే లో బాధితులకు సేవ లందిస్తున్నారు. గాయపడి , ఆప్తులను కోల్పోయి మానసికంగా దెబ్బతిన్నవారికి వైద్యంతో పాటు మానసికంగానూ తోడ్పాటు నందిస్తున్నారు బీనా.  ఈమె సేవలు పొందిన మహిళ బీనా చేతిని ముద్దాడుతున్న ఫోటో భారత సైన్యం విడుదల చేయడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘ గ్లోబల్ ఇమేజ్ అఫ్ ఇండియా’ అని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు. మనకీ ఉన్నారు ఫ్లోరెన్స్ నైటింగేల్స్ అని సంబర పడుతున్నారు భారతీయులు.

Lady Doctors

సాహసానికి ‘సై’

‘లైఫ్ ఆఫ్ పై ‘- ఈ సినిమా గురించి తెలియని వారుండరు. నడిసముద్రంలో నావలో చిరుతపులి తోడుగా ఓ యువకుడు సాగించిన జీవన సమరం ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పీటర్ పార్కర్, పై పాత్రలు ఒకరి గురించి మరొకరు భయపడుతూ అంతలోనే వారిగురించి ఆదుర్దా పడే తీరు కట్టి పడేస్తుంది. అటువంటి సంఘటనలు నిజ జీవితంలోనూ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. తాజాగా మంగుళూరు దగ్గర జరిగిన ఓ ఘటన రోమాంచితమనే చెప్పాలి. ఇక్కడ పులిని రక్షించడానికి ప్రాణాలకు తెగించిందొక వెటర్నరీ డాక్టర్.

ఏడాదిన్నర వయసున్న చిరుత మంగుళూరు సమీపంలో కటీల్ దగ్గర ఒక ఇంట్లో బావిలో పడిపోయింది. అక్కడినుంచి బయటకు రాలేక అలాగే ఉంది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు బయటకి తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్నీ విఫలమై తల పట్టుకుని కూర్చున్నారు. మంగుళూరులోని వన్యప్రాణి రక్షణ – పరిశోధన సంస్థ చిట్టి పిల్లే కి చెప్పారు. అక్కడి బృందంలో ఒక వెటర్నరీ డాక్టర్ల జంట ఉంది. వారిలో డాక్టర్ మేఘన పెమ్మయ్య  పులిని రక్షించడానికి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఒక బోనులో బావిలోకి దిగి పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులోకి లాగి పైకి తీసుకురావాలి. పులికి రెండురోజులుగా ఆహారం లేదు. ఏమైనా జరగచ్చు. అయినా మేఘ వెనకడుగు వేయలేదు. తాళ్లతో కట్టిన బోనులో బావిలోకి దింపారు. మేఘన  తుపాకీతో మత్తుమందు ప్రయోగించింది. 15 నిమిషాల్లో పులి మత్తులోకి జారుకున్నాక బోనులోకి లాగడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో ఆమెకి మరో యువకుడు తాళ్లతో కిందికి దిగి సహాయపడ్డాడు.

మొత్తానికి మేఘ తన ప్రయత్నంలో విజయం సాధించి యావద్దేశాన్ని తన వైపు తిప్పుకొంది. ఆ సమయంలో ఉరకలెత్తిన ఉత్సాహమే తనచేత అలా చేయించిందంటుందీ పశు వైద్యురాలు. ఏమైనా పులితో ఒకే బోనులో ఉన్న దృశ్యాలు బాగా వైరల్ అవుతున్నాయి. శభాష్ మేఘన!

కె. శోభ

Also Read :

ఎలుకతోలు తెచ్చి…

RELATED ARTICLES

Most Popular

న్యూస్