ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల బెయిల్ కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరు వాదనలు విన్న కోర్టు నిందితులకు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న… సమీర్‌మహేంద్రు, విజయ్‌నాయర్, బినోయ్‌బాబు, అభిషేక్ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్లను సీబీఐ కోర్టు తిరస్కరించింది. లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది. వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌ నాయర్‌ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది.

సమీర్‌ మహేంద్రుకు చెందిన రూ.35 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్‌ చేశారు. అలాగే అమిత్‌అరోరాకు చెందిన రూ.7.68 కోట్లు, విజయ్‌నాయర్‌కు చెందిన రూ.1.77 కోట్లు, దినేష్‌ అరోరాకు చెందిన రూ.3.18 కోట్లు, అరుణ్ పిళ్లైకి చెందిన రూ.2.25 కోట్లు, ఇండో స్పిరిట్‌కు చెందిన రూ.14.39 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో రూ.2,873 కోట్ల స్కామ్‌ జరిగిందని, ఇప్పటి వరకు రూ. 76.54 కోట్ల నగదును పట్టుకున్నామని ఈడీ అధికారులు వెల్లడించారు.

ఇటీవల పంజాబ్‌కు సంబంధించి ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సైతం అరెస్ట్ చేశారు. బుచ్చిబాబు అరెస్ట్‌తో ఎమ్మెల్సీ కవిత పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌పై గతంలో చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీలోని మాగుంట నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సౌత్‌ గ్రూపు, అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డి దాదాపు రూ. 600 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది.

Also Read : Delhi Liquor Scam: ఇది వారి కుట్రే: మాగుంట అనుమానం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *