Thursday, October 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతం

ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతం

ఒక్కోసారి నాకు ఉన్నట్టుండి ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. జీవితం చాలా హడావుడి అయిన ఫీలింగ్. అప్పుడు ‘దూర్ కహీ దూర్ ముఝే లే చలో సనమ్’ అని అంటాను. మా ఆయన, అబ్బాయి కూడా అదే టైపు కావడంతో ‘చలో దిల్దార్ చలో చాంద్ కే పాస్ చలో’ అంటారు. సరే వెళ్ళాలి అనుకున్నాక ఎక్కడికి వెళ్లాలనే ప్రశ్న ఉదయిస్తుంది కదా! వెంటనే ఉదయపూర్ తట్టింది. అలా ఈ మధ్య వెళ్లిన నగరమే ఉదయపూర్.

చుట్టూ చెరువులు, కోటలతో బాగుంటుంది. ‘ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై’ అనుకుంటూ పర్యటన మొదలుపెట్టాం. మా డ్రైవర్ కమ్ గైడ్ ముందుగా ఉదయ్ పూర్లో ఫతే సాగర్ లేక్ బోటింగ్ కి తీసుకెళ్లాడు. అక్కడి మోటార్ బోటులో లాహిరి లాహిరి లాహిరిలో అనుకుంటూ విహరించాం గానీ ఎండకి కందిపోయాం. బయట అమ్ముతున్న మరమరాల మసాలా లాగించాం. అక్కడినుంచి రాణా ప్రతాప్ స్మారకానికి వెళ్లి చరిత్ర పుటల్లో నిక్షిప్తమైన వివరాలు తెలుసుకుంటూ పులకించిపోయాం. మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్ ప్రతిమ చెంత ఫోటోలు తీసుకున్నాం.

అక్కడి ఎండ దెబ్బకి ఏసీ లో సేద తీరాలంటూ వెంటనే లంచ్ కి వెళ్లి మేవార్ రుచులు లాగించాలన్నాం. చలో అంటూ డ్రైవర్ గైడ్ ట్రెడిషనల్ ఖానా దగ్గర ఆపాడు. పేరుకు తగ్గట్టే మేలిముసుగు వేసుకున్న రాజస్థానీ యువతిలా ఉందా భోజనశాల. లోపల మాత్రం సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న యువకుడు కొసరి కొసరి తినిపించాడు. అన్నదాతా సుఖీభవ అని అక్కడినుంచి ఒక సాంప్రదాయ కళాకేంద్రానికెళ్ళాం. గంట సేపు రాజస్థానీ నృత్యాలు, సంగీతంలో తేలిపోయాం. ఎరుపు లోలాకు కులికెను…కులికెను ముక్కు పుల్లాకు మెరిసెను మెరిసెను అని పాడుకుంటూ అక్కడినుంచి వస్తుంటే దారిలో తండూరీ చాయ్ తాగి తీరాలని మా గైడ్ బాబు పట్టుబట్టాడు. సరే అని ఆ టీ కాగే లోపు పక్కనే ఉన్న షాప్ లో మంచి బొమ్మలు ఓ నాలుగు కొని వచ్చి టీ తాగుతుంటే ఇద్దరు చిన్న పిల్లలు కీ చైన్స్ కొనమని వెంటబడ్డారు. జాలి వేసి పది రూపాయలు ఇచ్చాను. కీ చైన్ వద్దులే అన్నాను. దాంతో పాట పాడుతామన్నారు. సరే అనగానే ఎంత చక్కగా పాడారో ఆ ఉదయపూర్ బాయ్స్.

అక్కడినుంచి హోటల్ కి వచ్చేశాం. రాత్రి మేమున్న రాడిసన్ బ్లూ హోటల్ ఆరావళి రూఫ్ టాప్ రెస్టారెంట్ లో డిన్నర్ ఎంజాయ్ చేశాం. మొదటి రోజు అలా గడచిందన్నమాట.

అన్నట్టు మేము ఉదయం హోటల్ కి చేరుకున్నప్పటినుంచి మర్నాటివరకు ఎక్కడ చూసినా జనం. ఫైవ్ స్టార్ హోటల్ లో అంత జనం ఎప్పుడూ చూడలేదు. పెళ్లి పార్టీ అనుకుంటా. రూముల కోసం పడిగాపులు పడుతున్నారు. ఆ మర్నాటికి వాళ్లందరికీ రూములు ఇచ్చారన్నాక నాకు హాయిగా అనిపించింది. హోటల్ వాళ్ళు రోజూ కాసేపు ఆటలు, పాటలు నిర్వహిస్తారు. అక్కడ కాసేపు బొమ్మలాట కూడా చూశాం.

రెండో రోజు విశేషాలు:
రెండో రోజు ఉదయాన్నే బయలుదేరి ఉదయపూర్ సిటీ ప్యాలస్ కి వెళ్ళాం. గైడ్ లేకుండా ఈ భవనం చూడలేం. మా డ్రైవర్ చెప్పిన గైడ్ ని పెట్టుకున్నాం. అతను ఎంతో చక్కగా, ఓపికగా ప్యాలస్ అంతా తిప్పి చూపించాడు. చక్కటి ఫోటోలు తీశాడు. ఆ ప్యాలస్ లో జరిగిన సెలబ్రిటీల వివాహాలు వివరించి మేము కూడా ఓ యాభై లక్షలతో చేసుకోవచ్చని జోకేశాడు. అప్పటి రాణుల మేకప్, వైభోగం అన్నీ బాగానే ఉన్నాయిగానీ వారి జీవితం బందిఖానా అనిపించింది. అయితే ఆ కాలం లోనే ఎంతో పద్ధతిగా కట్టిన రాణివాసాలు, ఇతర ఏర్పాట్లు చూశాక రాజా ఉదయసింగ్ ని ప్రశంసించకుండా ఉండలేం. టిక్కెట్ ధర భారీగా పెట్టినా ఇప్పటికీ ప్యాలస్ చెక్కు చెదరకుండా నిర్వహిస్తున్న వారి కుటుంబీకులు పక్కనే ఉంటారంటే చూడాలనిపించింది గానీ వీలు పడలేదు. అక్కడి నుంచి బయటపడేసరికి హోరున వర్షం. చెప్పడం మర్చిపోయా. కోట కింది నుంచి పైకి వెళ్ళటానికి బస్, బ్యాటరీ వాహనాలు ఉంటాయి. టికెట్ కొనుక్కుని అందులో వెళ్ళాలి. మళ్ళీ టికెట్ కొనుక్కుని కిందికి రావాలి.

ప్యాలస్ ఆవరణలోనే అప్పట్లో రాణులు షాపింగ్ చేయడానికి దుకాణాలు ఉండేవి. ఇప్పుడూ ఉన్నాయి మనకోసం. అక్కడ అరటి, వెదురు, పైనాపిల్, సీతాఫల్ … ఇలా అన్నిటినుంచి తయారు చేసిన చీరలు, బొమ్మలు అమ్ముతారు. అలాగే ఔషధ గుణాలున్న రజాయిలు కూడా . పనిచేస్తాయా? అంటే వాపస్ తీసుకుంటాం అంటారు. ఎలాగూ తిరిగి ఇవ్వలేమని ధైర్యం కావచ్చు. వెళ్ళాం కాబట్టి కొనాలి. అంచేత అలా కొన్ని కొని బయటపడ్డాం. ఆ తర్వాత నమస్తే మేవార్ హోటల్ కెళ్ళి రోటీలు తిన్నాం. లంచ్ తర్వాత రాణుల విహారం కోసం వెలసిన ‘సహేలియోన్ కీ బరీ’ ఉద్యాన వనంలో విహరించి నీమ్చీ మాత గుడికి రోప్ వే ఎక్కి వెళ్ళాం. బాగుంది. సజ్జనఘడ్ కోట కూడా తిరిగి చూశాం . ఈ కోటలోనే జేమ్స్ బాండ్ మూవీ ఆక్టోపసి తీశారు. గైడ్ , రాంలీలా చిత్రాలు కూడా ఉదయపూర్లో తీసినవే. సాయంత్రం పాత బస్తీలో బాగా తిరిగి షాపింగ్ చేశాం. అన్నట్టు అక్కడి జగ్ మందిర్ శిల్పసౌందర్యం చూసి తీరాలి గానీ వర్ణించలేం. ఖమ్మా -గణి హోటల్ లో తిని తీరాలి అని నా ఫ్రెండ్ చెప్పింది గానీ అక్కడ ప్లేస్ దొరకలేదు. దాంతో ఇంకో చోటికి వెళ్లి రోటీలు తిన్నాం. అప్పటికే అలసిపోయాం పైగా మర్నాడు రోమాంచిత చిత్తోర్ ఘడ్ కోటకి వెళ్ళాలి కాబట్టి త్వరగా విశ్రమించాం.

చిత్తోర్ ఘడ్ కోట:
నాలుగు రోజులుగా నడకే తప్ప మరే వ్యాయామం లేదుకదా అని పొద్దున్నే లేచి హోటల్ వాళ్ళు ఏర్పాటు చేసిన యోగా సెషన్ కి వెళ్ళొచ్చా. బాగుంది. ఉదయపూర్ నుంచి కనీసం రెండు గంటలు పడుతుంది చిత్తోర్ ఘడ్ వెళ్ళడానికి. మహారాణా ప్రతాప్ గురించి తెలిసిన వారికి, కనీసం సీరియల్ చూసినవారికి ఆ కోట ప్రాముఖ్యం అర్థమవుతుంది. పద్మావతి సినిమా చూసి రాణి పద్మావతి ‘జోహర్’ తెలుసుకున్నవారికి కోటలో ఆమె మందిరం, ఈత కొలను, సొరంగమార్గం చూసినపుడు వేలమంది మహిళలతో ప్రాణత్యాగం చేసిన వైనం విన్నపుడు ఒళ్ళు జలదరిస్తుంది.

మీరాబాయి అక్కడి రాచరికాన్ని కాదని కృష్ణ భక్తిలో మమేకమైన వృత్తాంతం, అనేక దేవాలయాలు, విజయ ధ్వజ స్తంభాలు చరిత్రను కళ్లముందుంచుతాయి. ఓ పక్క సూర్యుడు పొడుస్తున్నా కోట చరిత్ర కదలనివ్వదు. రెండుగంటలు తిరిగాక షరా మామూలుగా బట్టల షాప్ దర్శనం తప్పదు. అక్కడ మూలికల దుప్పట్లు కొని బయలుదేరాం. మా స్పీడ్ కి మా డ్రైవర్ ఆశ్చర్యానందాలకు గురయ్యాడు. అంత ఫాస్ట్ గా ఎవరూ చూడరట. అంతా ఎండ మహిమ అనుకున్నాం చెమట తుడుచుకుంటూ. బోనస్ గా లంచ్ కి ఖమ్మ- గణి కి తీసుకెళ్లాడు. అక్కడ మెనూ కార్డు చూసి దాల్ భాటి తిని తీరాలి అని స్టయిల్ గా మూడు ప్లేట్లు ఆర్డర్ ఇచ్చా. సర్వర్ మా వంక జాలిగా చూసి అంత తినలేరు రెండు ప్లేట్లు తీసుకోండి అన్నాడు. సరే అన్నాం. తీరా వచ్చాక ఒక ప్లేట్ కూడా తినలేకపోయాం. ప్యాక్ చేయించి మా డ్రైవర్ కి ఇచ్చేశాం. ఇక ఆ రోజుకి చాల్లే అని హోటల్ కొచ్చేశాం. మర్నాడు దేవాలయాల సందర్శన.

ఏక్ లింగ్ జీ- నాథ్ ద్వారా నాలుగురోజుల పర్యటనలో చివరిరోజు దేవాలయాలు చూద్దాం అనుకున్నాం. ఉదయపూర్ నుంచి గంట ప్రయాణం తర్వాత ఏక్ లింగ్ జీ దేవాలయం చేరుకున్నాం. డ్రైవర్ చెప్పిన మనిషి వచ్చి దగ్గరుండి గుడి అంతా చూపించి దర్శనం చేయించాడు. చిన్నా పెద్దా కలిపి 108 గుళ్ళు ఉన్నాయి. డబ్బులిస్తే దర్శనాలు ఇక్కడ కూడా బాగా జరుగుతాయని అర్థమైంది. అక్కడినుంచి వస్తూ దారిలో ఒక కృష్ణుడి గుడికి వెళ్ళాం. చాలా బాగుంది. దర్శనం కూడా హాయిగా జరిగింది. ప్రసాదం చాలా బాగుంది. అక్కడినుంచి ప్రముఖ దేవాలయమైన  నాథ్ -ద్వారా బయలుదేరాం. కొంచెం రష్ ఉంటుంది గానీ మనిషికి మూడువందలు ఇస్తే దర్శనం అయిపోతుందని డ్రైవర్ చెప్పాడు. అతను మమ్మల్ని ఎవరికో అప్పగిస్తే అతను మనిషికి పదిహేనువందలిస్తే తొందరగా దర్శనం అవుతుంది అన్నాడు. అక్కడ కోరమీసాలు పెంచుకున్న లారెన్స్ బిష్ణోయ్ లాంటి యువకులు అందరినీ నియంత్రించడం కనిపించింది. ఇంతవరకూ వచ్చాం కదా అని వాళ్ళడిగిన మొత్తం ఇచ్చి మొత్తానికి దర్శనం చేసుకుని ప్రసాదం కొనుక్కుని బయటపడ్డాం. అయితే బాల కృష్ణుడి విగ్రహం (శ్రీనాథ్ జీ )చూడ ముచ్చటగా ఉంది. అక్కడా ఎండ దంచేస్తోంది. దాంతో గబ గబా కార్ ఎక్కేసాం. దారిలో తినేసి హోటల్ కొచ్చేశాం. ఉదయపూర్ వెళ్తున్నానని చెప్పగానే నా ఫ్రెండ్ అక్కడ వెళ్లాల్సిన కొన్ని హోటల్స్ చెప్పింది గానీ కొన్నిటికి కుదరలేదు. చివరగా 1559 ఏ డీ అనే రెస్టారంట్ కి వెళ్లాలనుకున్నాం. అనుకున్నట్టే చాలా బాగుంది ఆ హోటల్. హాయిగా ఆరుబయట ప్రకృతిలో వేణుగానం ఆస్వాదిస్తూ డిన్నర్ పూర్తిచేసి మా యాత్ర ముగించాం. మర్నాడు ఉదయం విమానమెక్కేసి ‘పల్ పల్ దిల్ కే సాథ్ తుమ్ రహతే హో’ అనుకుంటూ ఉదయపూర్ కి బై చెప్పేశాం. ఈ వివరాలు చదివినవారికి, బాగుందన్నవారికి ఉదయపూర్ చూసిన ఆనందం సమకూరుగాక!

(దీనితో మేవాడ్ కథల ధారావాహిక సమాప్తం)

-కె . శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్