Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమాతృభాష తెలుగు రాణించింది తమిళంలో

మాతృభాష తెలుగు రాణించింది తమిళంలో

Udumalai Narayana Kavi :

మాతృభాష తెలుగే అయినా ఆయన తమిళ సినిమాలలో ఎన్నో పాటలు రాసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న కవి ఆయన. ఆయన పేరు ఉడుమలై నారాయణ కవి(Udumalai Narayana Kavi). 1899 సెప్టెంబర్ 25న కోయంబత్తూరు జిల్లాలోని ఉడుమలై తాలూకాలో గల పూవిలైవాడి అనే పల్లెలో తెలుగు చెట్టియార్ తెగలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మత్తమ్మాళ్. కృష్ణస్వామి.

ఆయన అసలు పేరు నారాయణస్వామి. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన ఈయన పేదరికంతో ఎన్నో కష్టాలు పడ్డారు. సోదరుడి కనుసన్నలలో పెరిగిన ఈయన నాలుగో తరగతి వరకే చదువుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశభక్తితో అనేక పాటలు రాసిన ఈయన వేదకలెక్కి తన స్వరం వినిపించారు.

తొలి రోజుల్లో నాటకాలకు పాటలు రాస్తూ వచ్చిన ఈయన 1933లో మొదటిసారిగా సినిమాలకు పాటలు రాయడం మొదలుపెట్టారు. అప్పుడే ఆయన నారాయణ కవి అని పేరు మార్చుకుని తానొక కవినని గుర్తింపు పొందారు.

ప్రారంభంలో భక్తి పాటలు రాస్తూ వచ్చిన ఈయన జాతీయకవి సుబ్రహ్మణ్య భారతియార్ తో ఏర్పడిన స్నేహపరిచయం తర్వాత జనాన్ని చైతన్యపరిచే రీతిలో పాటలు రాశారు. అలనాటి ప్రముఖ తమిళనటుడు కళైవానర్ ఎన్.ఎస్. కృష్ణన్ కోసం హరికథ రాసి ఆయనకు గురువనిపించుకున్నారు. అణ్ణాదురై రాసిన వేలైక్కారి, ఓర్ ఇరవు, నల్లత్తంబి వంటి సినిమాలకు, కరుణానిధి కథ,.మాటలు రాసిన పరాశక్తి, మనోహరా సినిమాలకు పాటలు రాసి విశేష ఆదరణ పొందిన నారాయణ కవి దైవప్పిరవి, తూక్కితూక్కి, ప్రభావతి, కావేరీ, మాంగల్య భాగ్యం, రత్తకన్నీర్ తదితర సినిమాలకూ పాటలు రాసి ప్రసిద్ధులయ్యారు.

తన జీవితకాలంలో దాదాపు పది వేల పాటలు రాసిన నారాయణ సున్నిత మృదుస్వభావి.నిజాయితీకి మారుపేరు. మాట తప్పని మనిషి. ఎదుటివారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తిగా అనిపించుకున్న ఈయన ఒకానొకప్పుడు ఖద్దర్ వస్త్ర దుకాణం నడిపారు. కానీ ఈ వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులపాలయ్యారు. ఈ అప్పులు తీర్చేంత డబ్బు గడించే వరకూ సొంత ఊరుకి రానని చెప్పి చేతిలో ఉన్న రెండు వందల రూపాయలతో మదురై శంకరదాస్ స్వామి దగ్గరకు వెళ్ళారు. ఆయన వద్ద వ్యాకరణం చదువుకున్నారు.

మదురైలో నాటకాలు నిర్వహించే సంస్థలు ఎక్కువ ఉండటంతో ఆయన రచనలకు అవకాశం దొరికింది. దీంతో ఆయన కష్టాలు తీరాయి. 1967లో సంగీత నాటక సంఘం ఆయనను ఉత్తమ గేయ రచయితగా సన్మానించింది. కవి, నాటక రచయిత, నటుడు‌, సంఘసంస్కర్తగా వినుతికెక్కిన నారాయణ కవి తన ఎనభై రెండో ఏట 1981లో అస్తమించారు.

2008లో ఆయన స్మృత్యర్థం పోస్టల్ స్టాంపుని ఆవిష్కరించింది.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్