Friday, April 4, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగు సంగమం పండుగ

తెలుగు సంగమం పండుగ

“ఏ దేశమేగినా…ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని;
నిలుపురా నీ జాతి నిండు గౌరవమును…”
అన్న స్ఫూర్తితో బయట రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు తమ ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్ లో స్థిరపడ్డ తెలుగువారు మొన్న విశ్వావసు ఉగాది ఉత్సవాలను భోపాల్లో ఘనంగా నిర్వహించారు. “తెలుగు సంగమం” గొడుగు కింద అక్కడున్న తెలుగువారు దాదాపు ఏడెనిమిదేళ్ళుగా తెలుగువారికి ప్రత్యేకమైన ఉగాది, సంక్రాంతి ఉత్సవాలను సందడి సందడిగా నిర్వహిస్తున్నారు.

జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమంలో తొలుత స్థానిక శారదా దేవి ఆలయం పురోహితుడు శ్రీనివాస్ పంచాంగ శ్రవణం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి అయిన తెలుగు వ్యక్తి పరికిపండ్ల నరహరి, సి పి ఐ నాయకుడు నారాయణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ, మాజీ ఐ పి ఎస్ అధికారి లక్ష్మీనారాయణ, బీ జె పి నాయకుడు యడ్లపాటి రఘునాథబాబు, జర్నలిస్ట్, రచయిత పమిడికాల్వ మధుసూదన్ లను ఈ సందర్భంగా తెలుగు సంగమం ఘనంగా సన్మానించి…వారి సేవలను కొనియాడింది.

భోపాల్లో తెలుగు భాష, సంస్కృతి వ్యాప్తికి, తెలుగువారి ఐక్యతకు కృషి చేస్తున్న తెలుగు సంగమం ప్రతినిధి చిరుమామిళ్ల కిషొర్ నాయుడు సేవలను ఈ సందర్భంగా నరహరి ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక భాషలు, సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని సోదాహరణంగా సి పి ఐ నాయకుడు నారాయణ వివరించారు. తెలుగువారు ఎక్కడున్నా కష్టపడి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారని…అలాగే మధ్యప్రదేశ్ లో కూడా అనేకమంది తెలుగువారు రాణిస్తుండడం ఆనందదాయకమని దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ అన్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ…తెలుగువారు అన్ని రంగాల్లో రాణిస్తుండడం గర్వకారణం అన్నారు ఐ పి ఎస్ మాజీ అధికారి లక్ష్మీనారాయణ. పౌరులందరూ రాజకీయ చైతన్యంతో ముందుకు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడ్డ తెలుగువారు భోపాల్లో ఒక కుటుంబంగా కలిసి మెలసి పండుగలు చేసుకోవడం ఆనందదాయకమన్నారు బీ జె పి నాయకుడు యడ్లపాటి రఘునాథబాబు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన పమిడికాల్వ మధుసూదన్ పద్యాలు, పాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. తణుకు అంబికా బృందం వారి నృత్యాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఐ ఏ ఎస్ అధికారిగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి కె. వి. ఎస్. చౌదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని అనుకున్నా…అనివార్య కార్యక్రమం వల్ల రాలేకపోయిన బీ జె పి జాతీయ నాయకుడు మురళీధర రావు వీడియో కాల్ ద్వారా సభికులనుద్దేశించి ప్రసంగించారు. తెలుగువారి తొలి పర్వదినాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా అభినందనలు తెలిపారు.

తెలుగు సంగమం అధ్యక్షుడు చెన్నంశెట్టి సతీష్ కుటుంబంతో పాటు శ్రీరాములు నాయుడు, జె పి ఎన్ సురేంద్ర, మోహన్, విద్య మరికొందరు ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలమీద దిగ్విజయంగా నిర్వహించారు. అతిథుల సన్మానపత్రాలను కుమారి చిరుమామిళ్ల చంద్రిక నాయుడు చక్కని తెలుగులో చదివి వినిపించింది. ఉగాది పచ్చడితో మొదలైన కార్యక్రమం తెలుగు రుచులతో మధ్యాహ్నభోజనంతో ముగిసింది.

భోపాల్లో తెలుగు సంగమం కార్యక్రమాలకు కర్త-కర్మ-క్రియ అయిన చిరుమామిళ్ళ కిషోర్ నాయుడి చొరవను, శ్రమను, సేవలను సభ వేనోళ్ళ కొనియాడింది.

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్