Saturday, January 18, 2025
HomeTrending Newsకేసీఆర్‌కు ఊహించని షాక్

కేసీఆర్‌కు ఊహించని షాక్

కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్రం పెత్తనానికి కత్తెర వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం కేటాయించే నిధులను వాడుకుని, కనీసం అక్కడ కేంద్ర నిధులు, ప్రధాని, సంబంధిత మంత్రి ఫొటో కూడా పెట్టకపోవడంపై ఇప్పటికే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, వైకుంఠధామాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, పంట కళ్లాల నిర్మాణంలో ఉపాధి హామీ నిధులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ, అవన్నీ రాష్ట్రం సొంత ఖాతాలో వేసుకుంటోంది. ఇది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతోంది. దీంతో ఈ విధానానికి బ్రేక్​ వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి రాష్ట్ర ప్రమేయం లేకుండా.. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులు నేరుగా సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లనున్నాయి. దీంతో ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే పనులకు కేంద్రం నిధులను వాడుకునే అవకాశం ఉండదు.

రూల్స్ చేంజ్..​
ఉపాధి హామీలో ప్రస్తుతం 60:40 రేషియోలో పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక సీసీ రోడ్డును ఉపాధి హామీ కింద నిర్మాణం చేస్తే దానిలో 60 శాతం కూలీలకు వేతనాలు ఇవ్వాల్సి ఉండగా.. 40 శాతం మెటీరియల్ ​కాంపోనెంట్ ​కోసం వినియోగించుకోవచ్చు. అయితే, వీటికి సంబంధించిన నిధులను ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చేవారు. రాష్ట్రం ఈ నిధులను ఎంతో కొంత ఇతర పనులకు డైవర్ట్​ చేసుకుని, వీలును బట్టి కూలీలకు, సంబంధిత పనులు చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించేవారు. కేంద్రం నుంచి కూలీలకు 15 రోజుల వ్యవధిలోనే వేతనాలు విడుదలైనప్పటికీ.. వాటిని రాష్ట్రం వాడుకోవడంతో నెలల తరబడి కూలీలకు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. వాస్తవానికి దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేంద్రం నుంచే నేరుగా ఎన్ఐసీ పోర్టల్​ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటి వరకు మన రాష్ట్రానికి మాత్రం మినహాయింపు ఉంది. ఈ నెల 17 నుంచి ఇక్కడ కూడా అదే విధానం అమల్లోకి రానుంది.

హుజురాబాద్​ ఎఫెక్ట్..​
ఉపాధి నిధుల వినియోగంలో కేంద్రం నిబంధనలు మార్చడంలో హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా కీలకమేనని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతేడు హుజురాబాద్​ బై ఎలక్షన్​ సందర్భంగా ఇబ్బడిముబ్బడిగా సీసీ రోడ్లు మంజూరు చేశారు. వీటిలో 90 శాతం సీసీ రోడ్లు ఉపాధి హామీ నిధులవే. అంతేకాకుండా ఈ పనులు చేసిన కూలీలకు రూ. 40 కోట్లు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నుంచి ఈ నిధులు గతేడాది నవంబర్‌లోనే విడుదలయ్యాయి. కానీ, ఇప్పటికీ ఇంకా వాటిని కూలీలకు చెల్లించలేదు. అంతేకాకుండా ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర నిధుల ప్రస్తావనే లేదు. ఈ నేపథ్యంలో నిబంధనల మార్పునకు ఇది కూడా ప్రధాన కారణమని అధికారులు చెప్పుతున్నారు.

కేంద్రం నిధులు.. రాష్ట్రం పేరు
మరోవైపు ఉపాధి హామీ నిధుల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక విధానాలను అమల్లోకి తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత సీసీ రోడ్లను మినహాయిస్తే.. వైకుంఠధామాలు, పంట కళ్లాలు, హరితహారం, రైతు వేదికలు, డంపింగ్​ యార్డులు, పల్లె ప్రకృతివనాలకు ఉపాధి నిధులు ప్రత్యేకంగా ఇచ్చే వెసులుబాటు లేదు. కూలీలకు పని కల్పించే కారణాన్ని చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులన్నీ చేపట్టింది. అయితే, వీటికి సేకరించే నిధులను మాత్రం కేంద్రం నుంచి తీసుకుంటోంది. ఈ లెక్కన నిధులను డైవర్ట్​ చేస్తున్నట్లుగా కేంద్రం గుర్తించింది. ఇక నుంచి ఈ పనులు ఉపాధి హామీలో చేయాలంటే సెంట్రల్​ నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటోంది.

అంతేకాకుండా కేంద్ర నిధుల వినియోగంలో నిబంధనల ప్రకారం ప్రతీ పని దగ్గర సెంట్రల్ ​షేర్, ప్రధాని, సంబంధిత మంత్రిత్వ శాఖ వివరాలు, వినియోగించిన నిధులను తేటతెల్లం చేయాలి. దీంతో ఇక నుంచి ఉపాధి నిధులను వాడుకునే వెసులుబాటు రాష్ట్రానికి తగ్గిపోనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సాఫ్ట్​వేర్‌ను కేంద్రం అప్​డేట్ ​చేస్తోంది. ఇప్పటికే దీనిపై ఉపాధి హామీ విభాగంలోని అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 17 నుంచి రాష్ట్రం పెత్తనాన్ని తగ్గిస్తూ చేపట్టిన పనికి కేంద్రం నుంచే నేరుగా బిల్లులు చెల్లింపులు జరుగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్