Saturday, January 18, 2025
HomeTrending Newsబీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వరాల జల్లు

బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వరాల జల్లు

కేంద్ర బడ్జెట్ 2024లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వరాల జల్లు కురిసింది. బిహార్ కు 26 వేల కోట్ల రూపాయల నిధులు, ఏపికి 15 వేల కోట్ల రూపాయల నుధులను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై.. 12.30 వరకు కొనసాగింది. వికసిత్‌ భారత్‌ లక్ష్యమంటున్న NDA సర్కార్‌.. యూనియన్‌ బడ్జెట్‌లో కీలక నిర్ణయాల దిశగా అడుగులేసింది.

వికసిత్ భారత్ సాధనకు ప్రభుత్వం దృష్టి సారించే తొమ్మిది కీలక రంగాలను సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ఈ ప్రాధాన్యతల్లో వ్యవసాయం, ఎంప్లాయ్‌మెంట్‌ – స్కిల్లింగ్‌, మెరుగైన మానవ వనరులు, సామాజిక న్యాయం, మ్యానుఫ్యాక్చరింగ్‌ అండ్‌ సర్వీసెస్‌, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఉన్నాయి.

కేంద్ర బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు గా ప్రకటించింది.. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా వేసింది. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. పేదలకు ఆహార భద్రతను అందిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఇది ఏపీకి లైఫ్‌ లైన్‌ అని, దేశానికి ఆహార భద్రత కల్పించే ప్రాజెక్టని కీర్తించారు. పునర్ విభజన చట్టం ప్రకారం ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్నారు. విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కు అండగా ఉంటామని పేర్కొన్నారు. కొప్పర్తి – ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ కారిడార్ కు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బిహార్‌లో రూ.21,400 కోట్లతో 2400 మెగావాట్ల పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు, ఎయిర్‌పోర్టులు, మెడికల్‌ కాలేజీలు, స్పోర్ట్స్‌ సదుపాయాలపై కేంద్రం సహకరించనుంది. బిహార్‌కు నిధుల కల్పనకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించే దిశగా భరోసా ఇచ్చింది.

జమ్మూ, కశ్మీర్‌ రాష్ట్రం కోసం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పించారు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను తక్కువ ధరకు అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. చేపలు తక్కువ ధరకే లభిస్తాయన్నారు. తోలుతో చేసిన సామాగ్రి ధరలు తగ్గుతాయని, బంగారం, వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గనున్నట్లు బడ్జెట్‌లో తెలిపారు.

ఆదాయ పన్నులు మార్పులు తీసుకువచ్చారు. కొత్త ట్యాక్స్‌ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పులు చేశారు. కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్‌ పెంపు జరిగింది.

రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం

రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం

రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం

రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం

రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను

కొలేటరల్/ థర్డ్ పార్టీ హామీ లేకుండా టర్మ్ లోన్‌లను సులభతరం చేసేందుకు ప్రభుత్వం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (MSME)ల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని తీసుకువస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పట్టణ గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్ల కేంద్ర సహాయాన్ని నిర్మల ప్రతిపాదించారు.

భారతదేశ సర్వతోముఖాభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు మోడీ ప్రభుత్వానికి ప్రజలు మహత్తరమైన అవకాశం ఇచ్చారని ఆర్థిక మంత్రి అన్నారు.

-దేశవేని భాస్కర్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్