Thursday, November 21, 2024
HomeTrending Newsజాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ సవరణ బిల్లు

జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ సవరణ బిల్లు

మోడీ ప్రభుత్వం మరో కీలక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను కేంద్ర మైనార్టీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో ప్రవేశ పెట్టారు. వక్ఫ్‌ బోర్డు అధికారాలను పరిమితి చేయడంతో పాటు, ముస్లిం మహిళలను సెంట్రల్ వక్ర్ఫ్ బోర్డులో సభ్యులుగా చేర్చేలా సవరణలు ప్రతిపాదించారు. విపక్షాలు ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారి డిమాండ్ మేరకు ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు కేంద్రం అంగీకరించింది.

అంతకుముందు ఈ బిల్లు ప్రతిపాదనపై స్పీకర్ ఓం బిర్లా వివిధ పార్టీల అభిప్రాయాలు స్వీకరించారు.  కాంగ్రెస్, సమాజ్ వాదీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం, వైఎస్సార్సీపీ, డిఎంకె పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఇది రాజ్యంగంపై, ముస్లిం సామాజికవర్గంపై చేస్తున్న దాడిగా అభివర్ణించాయి. ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టం తీసుకు వచ్చిన మోడీ ప్రభుత్వం రాబోయే కాలంలో క్రైస్తవులు, జైన్ లు, సిక్కులు ఇతర మతాలకు సంబంధించిన బిల్లులు కూడా తీసుకువస్తుందని, దేశ రాజ్యంగ మౌలిక సూత్రం, లౌకిక వాదానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్షంగా దీన్ని తీసుకువస్తున్నారని, ఫెడరల్ వ్యవస్థను కూడా దెబ్బతీస్తున్నారని విపక్ష సభ్యులు విమర్శించారు.

ముస్లింలకు న్యాయం చేయడానికే ఈ బిల్లును తీసుకు వస్తున్నామని, దీని ద్వారా ముస్లిం మహిళలు,  విద్యార్ధులకు న్యాయం జరుగుతుందని కిరణ్ రిజుజు వెల్లడించారు. కేవలం రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇది ఏకపక్షంగా తీసుకు వచ్చిన బిల్లు కాదని… పలు రాష్ట్రాలకు చెందిన ముస్లిం సంఘాలు, మత పెద్దలతో విస్తృత సంప్రదింపులు, చర్చల తరువాతే దీన్ని రూపొందించామని వివరించారు. వక్ఫ్ బోర్డుల నుంచి సరైన ఆదాయం రావడం లేదని సచార్ కమిటీ కూడా చెప్పిందని గుర్తు చేస్తూ…. కాంగ్రెస్ చేయాల్సిన పని తాము చేస్తున్నామన్నారు.  ఈ బిల్లు ద్వారా మతపరమైన స్వేఛ్చకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, ఇతరుల హక్కులను హరిస్తుందన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని, ఇప్పటివరకూ హక్కులు పొందలేని వారికి హక్కులు లభిస్తాయని తేల్చి చెప్పారు. చాలా మంది ఎంపిలు తనను కలిసి చాలా రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులను మాఫియాలు నడిపిస్తున్నాయని తన దృష్టికి తీసుకువచ్చారని… ఎంపిలు వ్యక్తిగతంగా బిల్లును సమర్ధించారని, రాజకీయంగా మద్దతు ఇవ్వలేమని చెప్పారని రిజుజు వెల్లడించారు.

తీవ్ర వాదోపవాదాలు, చర్చల అనంతరం బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడిన తరువాత కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇవ్వడంతో విపక్ష సభ్యులు తమ ఆందోళన విరమించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్