Classical Siren: కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీ కొంచెం భిన్నంగా ఉంటారు. చాలాసార్లు మనసులో ఏముందో పైకి చెప్పేస్తూ ఉంటారు. మహారాష్ట్రలో నాగపూర్ గడ్డ ఆయన బలం. మోడీ- అమిత్ షాల ముందు గడ్కరీ చిన్నవాడు అయిపోయారో! లేక చిన్నవాడిని చేశారో! తెలియదు కానీ…అంతకు ముందు ఆయన బి జె పి జాతీయ రాజకీయ యవనిక మీద చాలా పెద్దవారు.
సామాన్యులు ఏమనుకుంటుంటారో, ఎలా మాట్లాడుతుంటారో…అలా ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇందులో మంచీ ఉంది. చెడూ ఉంది. ఇంతకంటే పోయేదేమీ లేదన్న వైరాగ్యంతోనే ఆయన అలా మాట్లాడుతున్నట్లుంది.
మెర్సిడిస్ బెంజ్ వారి ఎలెక్ట్రిక్ కారును ప్రారంభిస్తూ ఈ కారుకు కోటిన్నర రేటు పెట్టారు. నేను కూడా అందరిలా చూసి…తాకి పరవశించాల్సిందే కానీ…ఈ కారును కొనలేను అన్నారు.
పంచాయతీ వార్డు మెంబరు కూడా ఫలితాలు రావడానికి ముందే ప్రమాణస్వీకారానికి ప్రత్యేక దుస్తులు కుట్టించుకుంటున్నాడు. తీరా ప్రమాణ స్వీకారం చేశాక ఒక్క రోజు అయినా ప్రశాంతంగా సీట్లో కూర్చోలేకపోతున్నాడు అని చమత్కరిస్తారు.
నాలుగు లేన్ల జాతీయ రహదారుల్లో 130 కిలో మీటర్ల వేగంతో వెళ్లకపోతే ఎలా అని ప్రశ్నిస్తారు. టోల్ ఫీజు ఉంటుంది కానీ టోల్ గేట్లు త్వరలో ఎత్తేసి మరింత వేగం పెంచుతామంటారు.
తాజాగా వీ ఐ పి వాహనాల సైరన్ ల శబ్దం మీద గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మీద అంబులెన్సులు తప్ప మిగతా వాహనాల సైరన్లను నియత్రించనున్నట్లు తెలిపారు. ఎవరు పడితే వారు తమకు తాము వీ ఐ పి లు అనుకుని, అనధికారికంగా సైరన్లు బిగించుకుని…చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు…శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారన్నారు. వాహన చట్టాల్లో అనుమతించిన వారికి కూడా సైరన్ స్థానంలో భారతీయ సంగీత వాద్య పరికరాలయిన వీణ, వేణువు, వయోలిన్, మేళం, మృదంగం, ఘటం లాంటి శబ్దాలను ఉపయోగించనున్నట్లు చెప్పారు. హోదాను బట్టి ఒక్కో వాహనానికి ఒక్కో వాద్య సంగీతాన్ని కేటాయిస్తారట. దాంతో రోడ్డు మీద సైరన్లతో చెవుల్లో రక్తం కారే శబ్ద విధ్వంసం రోజులు పోయి…చెవుల్లో అమృతతుల్యమయిన శ్రావ్యమయిన వాద్య పరికరాల సంగీతం వినే రోజులొస్తాయట. మంచిదే.
1950లలో రేడియో పెట్టగానే నిలయ విద్వాంసుల విలయ విధ్వంసం వచ్చేదని ఇప్పటి పిల్లలు జోకులేసుకుంటున్నారు. రోడ్డు మీద “అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు”; “కెవ్వు కేక మా రోడ్డంతా కెవ్వు కేక”; “నువ్వుల్టే నవ్వుల్టే” అని సంగీత, సాహిత్య భావ రాగ లయావేశంతో హాయిగా పాడుకునే కొత్త తరానికి పాత చింతకాయ పచ్చడి శ్రుతుల పరమ పాత వాద్య పరికరాల స్వర జతుల గీత గతులు వినిపిస్తారా!
ఈ సైరన్-
సుస్వరమవుతుందో!
అపస్వరమవుతుందో!
మొన్ననే పీనల్ కోడ్ పేరు మార్చి ‘భారతీయ’ సంహిత బంధురంగా ‘భారతీయ’తను అద్దారు. ఇప్పుడు సైరన్లకు ‘భారతీయ’తను అద్దుతున్నారు. ఇదొక ‘భారతీయ’ సంగతుల సందర్భ రుతువు. ఈ రుతువు భారతీయ పంటలకు అనుకూలం. వేరే పంటలకు అననుకూలం- అంతే.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]