Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపిల్లల ప్రకటనల్లో అతిశయోక్తులు వద్దు

పిల్లల ప్రకటనల్లో అతిశయోక్తులు వద్దు

Children Ads :

అంటే…ఇక-
ఒకటి…ఒకటి…ఒకటి… అంటూ రెండు కాక ఒకటే అయిన చైతన్య అద్వైత ఆలిండియా అగ్రగామి ప్రకటనలు కనబడవా?

అంటే…ఇక-
రెండు…రెండు…రెండు… అంటూ ఒకటే అయినా రెండుగా కనిపించే నారాయణ ద్వైత ప్రకటనలు వినపడవా?

అంటే…ఇక-
బైజూస్ ఆన్ లైన్ కోచింగ్ ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో పిల్లలు సూర్యచంద్రుల్లా తారాపథంలో వెలుగుతుండగా షారుఖ్ ఖాన్ మురిసి ముప్పందుమయ్యే ప్రకటనలు కనుమరుగవుతాయా?

 Children Ads

అంటే…ఇక-
ఆకాష్ ప్రకటన ఆకాశంలో కలిసిపోతుందా?
విరాట్ కోహ్లీ పిల్లల చేత బూస్ట్ తాగించలేడా?
మన ఎర్రచందన పుష్పం అల్లు అర్జున్ ఇంటర్ పిల్లలకు తగ్గకుండా పాఠాలు చెప్పకూడదా?
క్రికెటర్ రోహిత్ శర్మ ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షల పిల్లలకు ఇన్ఫినిటీ క్లాసులు తీసుకోకూడదా?
పిల్లల మెదడు వికసించడానికి ఫలానా డ్రింకు తాగండి అని ప్రిన్సులు పిలుపునివ్వకూడదా?
పుడితే ఇంద్రధనుసులోనే పుట్టాలని…లేకపోతే పుట్టకుండా తల్లి కడుపులోనే ఉండిపోండి అని సెలెబ్రిటీ శాపనార్థాలు పెట్టకూడదా?

పిల్లలకు ఇది పెడితే బలం; ఇది తినిపిస్తే మహా బలం; అవి వేస్తే అందం; ఇవి తొడిగితే మహానందం; ఇక్కడ చేరితే స్వర్గం; అక్కడ ఉంటే పునర్జన్మే లేని మోక్షం…లాంటి ప్రకటనలు ఇక కనబడనే కనపడవా?

కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయంగా రుజువు కాని ఉత్పత్తుల ప్రకటనల్లో నటించేవారి మీద కూడా చర్యలు ఉంటాయి. అలాంటి ప్రకటనలను తయారు చేసినవారు, ఆ ప్రకటనకు మూలమయిన కంపెనీ లేదా సంస్థ వారు అందరూ అందులో ఉన్న ప్రతి అక్షరానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు-
“శ్రీ చైతన్యలో చేరడం వల్లే ఇన్ని వేల మంది మెడిసిన్లో, ఇన్ని లక్షల మంది ఇంజనీరింగ్ లో చేరగలిగారు” అని అల్లు అర్జున్ చెబుతున్న ప్రకటన ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ఎన్ని లక్షల మందికి శిక్షణ ఇస్తే…అందులో నుండి ఎన్ని వందల మంది ఎంపికయ్యారో స్పష్టంగా చెప్పాలి. అలా చెప్పనప్పుడు ఎంపికయిన వారి నంబర్లు మాత్రమే చెప్పి పిల్లలను ఆకర్షించడం తప్పు అవుతుంది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో ఉన్న అల్లు అర్జున్ కు, శ్రీ చైతన్య యాజమాన్యానికి, ఆ ప్రకటనను అచ్చేసిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలకు కూడా నోటీసులు ఇవ్వవచ్చు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆ ప్రకటనలను నిషేధించవచ్చు.

ఆచరణలో సాక్షాత్తు నారాయణుడికే విద్యా చైతన్యం ఇవ్వగలిగిన సంస్థలను మానవమాత్రులయిన ఐ అండ్ బి అధికారులు ఏమి చేయగలరు? అన్న నిర్వేదం, వైరాగ్యం ఉండనే ఉంటాయి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు కూడా ఉండి ఉంటాయి.

కొత్త నిబంధనలతో ప్రయోజనం ఉండవచ్చు. ఉండకపోవచ్చు.
కనీసం- చర్చ అయినా జరుగుతుంది. ఎక్కడో ఒక చోట ఇలాంటి ప్రకటనలకు అడ్డు కట్ట వేయకపోతే…సరస్వతికి తామే అ ఆ ఇ ఈ లు దిద్దించామని, బృహస్పతికి తామే హోమ్ ట్యూషన్ చెప్పామని, సూర్యుడికి తామే వెలుగులు పంచామని, నదికి తామే నడకలు నేర్పామని…ఇంకా అదని…ఇదని…ఏది చెప్పినా మనం గంగిరెద్దుల్లా తలలూపాల్సి ఉంటుంది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

సినిమా చైతన్యం

Also Read :

ఓడి గెలిస్తే మరింత మధురం

RELATED ARTICLES

Most Popular

న్యూస్