Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవైద్యో నారాయణో హరీ!

వైద్యో నారాయణో హరీ!

Corporate Treatment: ప్రాణం ఎవరిదయినా ప్రాణమే. డబ్బు ఎవరిదయినా డబ్బే. అయితే డబ్బు ప్రాణాలను నిలబెడుతుందా? ప్రాణాలను నిలబెట్టగలనని డబ్బు కాణిపాకంలో ప్రమాణం చేయగలదా? కానీ- డబ్బు లేకపోతే ప్రాణవాయువు ఆక్సిజన్ అందదు. డబ్బు లేక, ఉన్నా ఖర్చు పెట్టక మనవారిని మనమే చంపేసుకుంటున్నామన్న అపరాధభావం కలిగించడంలో కార్పొరేట్ పెద్దాసుపత్రులు నిర్దయగా, వింతగా, చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. విషయాన్ని జనరలైజ్ చేయకుండా…జరిగిన అనుభవాలకే పరిమితమవుదాం.

అసందర్భం-1
Corporate Hospitals
హైదరాబాద్. పేరుమోసిన ఒక ఆసుపత్రి. నా కిడ్నీలో ఏదో ఇన్ఫెక్షన్. అప్పుడు నా వయసు 40 లోపు. వీల్ చెయిర్లో ఆ ఆసుపత్రిలో చేరడం వరకే గుర్తు. తరువాత గుర్తు పెట్టుకోకూడనివి ఏవేవి జరగకూడదో అవన్నీ జరిగాయి. నన్ను బాగా నిశితంగా పరీక్షించడానికి రోజూ లోటాడు రక్తం లాక్కునేవారు. పగటికి- రాత్రికి తేడా తెలియని ఆసుపత్రి ఫాల్కన్ లైట్లలో నాకంతా చీకటిగానే ఉండేది. కోలుకుని టీ వీ లు చూస్తూ…పేపర్లు చదువుతున్నా…డిస్ ఛార్జ్ ఎప్పుడు చేస్తారో తెలియక…మనిషన్న ప్రతివాడిని అడుక్కుంటుంటే నామీద నాకే జాలేసేది. ఆ ముహూర్తం రానే వచ్చింది. తీరా బిల్లులో ఆ ఆసుపత్రిలో నాకు అత్యంత ఆప్తులయిన డాక్టర్లు గాజు తలుపు బయటనుండి స్నేహధర్మంతో హౌ ఆర్ యు? అని విష్ చేసిన సందర్భాలు కూడా డాక్టర్ విజిటింగ్ చార్జిలుగా రూపాంతరం చెంది ఉన్నాయి. నిజమే. దాన్ని డాక్టర్ విజిట్ కాదనే అధికారం నాకు లేదు. భవిష్యత్తులో ఖర్మకాలితే ముక్కూ మొహం తెలియని ఆసుపత్రిలోనే వైద్యానికి చేరాలన్న జ్ఞానం కలిగించిన అసందర్భ సందర్భమది.

అసందర్భం-2

తిరుపతి. మా నాన్నకు ఒంట్లో నలతగా ఉండి…అనుమాన నివృత్తికోసం కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. పరీక్షలో నెగటివ్ వచ్చినా కొంచెం జలుబు, దగ్గు ఉన్నాయి కాబట్టి పల్మనాలజిస్ట్ ను దర్శించారు. అంతే…ఇక వెంటనే ఆసుపత్రి పరుపును దర్శించాలన్నారు. కోవిడ్ కాకపోయినా కోవిడ్ గానే పరిగణించాలని అర్థమయ్యి…అర్థం కానట్లుండే భాషలో చక్కగా పదే పదే వివరించారు. ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు ఎట్టి పరిస్థితుల్లో రెమిడీసివర్ వద్దని పట్టుపట్టాము. అవును అవసరం లేదు…రెండ్రోజులు మామూలు మందులిస్తామన్నారు. రెండో రోజు రెమిడీసీవర్ రెండో ఇంజక్షన్ ఇస్తున్నామని చెప్తే మా నాన్న మొదట భయపడ్డారు. తరువాత బాధ పడ్డారు. ఆపై ఆయన చదివిన వేదాంత పాఠం నెమరువేసుకుని నన్ను ఓదార్చారు. నేను భూమి ఆకాశం ఒకటి చేసినట్లు పోరాడాను. భూమి భూమిగానే ఉంది. ఆకాశం ఆకాశంగానే ఉంది. పూట పూటకు మా నాన్న వైద్యం, మందుల గురించి ఆ డాక్టర్ నాకు చెప్పిన అబద్దాలు నా చేతగానితనాన్ని ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉన్నాయి. మా నాన్న డిస్ ఛార్జ్ అయ్యాక…ఒక్కొక్క అబద్దానికి నిజమేమిటో ఆ డాక్టరుకు అర్థమయ్యే భాషలోనే చెప్పా. మౌనమే ఆయన సమాధానం. ఒకసారి ఆసుపత్రిలో చేరిన తరువాత లక్షల్లో బిల్లు కట్టడం తప్ప-మనం చేయగలిగింది ఏమీ ఉండదని రెండోసారి నాకు స్పష్టత వచ్చింది.

అసందర్భం-3

మంగళగిరి హై వే. మా కెమెరా మ్యాన్ తెల్లవారుజామున రోడ్డుమీద లారీని గుద్దుకున్నాడు. స్పృహదప్పి పడిపోయాడు. పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాకు పరిచయమున్న అందరి తక్షణ సహాయం కోరాను. మెదడులో గాయమన్నారు. కళ్లు పోయాయన్నారు. ఆ అబ్బాయి బంధువులు పట్టుపట్టి విజయవాడలో ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స ఇలా చేయగానే అలా కన్ను వచ్చేస్తుందన్నారట. నాలుగురోజుల తరువాత మెదడులో గాయాల్లేవు. ఒక కన్ను శాశ్వతంగా పోయిందన్నారు. షరా మామూలు. భరించలేనంత పెద్ద బిల్లు. డిస్ ఛార్జ్ అయి ఇంటికెళ్లాడు. ఆ అబ్బాయితో మాట్లాడుతుంటే ఆసుపత్రుల గురించి వినకూడని ఎన్నో విషయాలు వినాల్సి వచ్చింది. పోయిన కన్ను వస్తుందని ఆ అబ్బాయిలో ఇంకా ఆశ కల్పించి తిప్పుకుంటున్నారు. రెండు కళ్లున్న మనకే కార్పొరేట్ ఆసుపత్రుల మోసాలు కనిపించవు. పాపం…ఒక కంటితో ఆ అబ్బాయి ఏమి పసిగట్టగలడు?

అసందర్భం-4

హైదరాబాద్. మా బంధువు ఒకరు మొదట ఆసుపత్రి రూములో, తరువాత ఐ సి యూ లో, ఆపై వెంటిలేటర్ మీద ఉండగా తెగ తిరిగాను. రోజూ సాయంత్రం బిల్లింగ్ డిపార్ట్ మెంట్ నుండి ఫోన్ వస్తుంది. ఏ రోజుకారోజు వేలు, లక్షల్లో డబ్బులు కట్టించుకుంటారు. ఐ సి యు వార్డ్ ముందు రోగుల బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చే గది. సెల్ ఫోన్లను అక్కడున్న సెక్యూరిటీ దగ్గర పెట్టాలన్నారు. ఎందుకంటే డాక్టర్లు చెప్పేవేవీ రికార్డు చేయకుండా అట. మేమిద్దరం. మాకు ఎదురుగా ముగ్గురు డాక్టర్లు కూర్చున్నారు. ఎన్నో నేరాలు, ఘోరాలు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దోషుల్లా ఉంది వారి ముందు మా పరిస్థితి. వారు జడ్జిల్లా మా కళ్లల్లోకి సూటిగా చూస్తూ…పేషంట్ విషయాన్ని మాత్రం సూటిగా చెప్పకుండా దాటవేసినట్లు నాకు అనిపించింది. మావాడు ఇంగ్లీషులో, తెలుగులో వినయంగా, అకెడెమిక్ గా, ఫైనాన్షియల్ గా, లాజికల్ గా ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఇంకా ఎన్నో ప్రశ్నలు వేసేవాడే. పరిస్థితి గంభీరంగా ఉంది…టెస్ట్ రిపోర్ట్ రానివ్వండి. రేపు చూద్దాం అంటూ మా కౌన్సిలింగ్ ముగిసినట్లు లేచి వెళ్లిపోయారు. ‘ట్రీట్మెంట్’ అనే మాటకు వాడుకలో ఎన్నెన్నో అర్థాలు ఎందుకొచ్చాయో నాకు తెలిసింది. ముందే బిల్లులు ప్రింట్ చేసి తరువాత ట్రీట్మెంట్ చేస్తున్నారా? అని మా ఆవిడ నన్ను నిలదీసింది. నేనెవరిని నిలదీయాలో తెలియడం లేదు.

ఇలాంటివే ఎన్నెన్నో అసందర్భాలు. కొన్ని మానిపోయే గాయాలు. కొన్ని మానని గాయాలు. శరీరానికి తగిలిన గాయాలు కాలగతిలో దానికవిగా మాసిపోతాయి. మనసుకు తగిలిన గాయాలు సందర్భం వచ్చిన ప్రతిసారీ గుచ్చుకుంటూనే ఉంటాయి.

సందర్భం

ఆరోగ్యమే మహా భాగ్యం.
నిజమే- ఆ మహా భాగ్యం భాగ్యవంతులకే. అభాగ్యులకు కాదు.
చేతగాని నాకు జరిగిన ఈ అనుభవాలే లోకానికంతా జరిగి ఉంటాయని నేననుకోవడం లేదు. జరగాలని కోరుకోవడం లేదు కూడా.

“లోకాస్సమస్తా సుఖినో భవంతు”
“ఆయురారాగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు”
“దీర్ఘమాయుః”
అన్న ఆశీర్వచనాలే నలుదిక్కుల్లో ప్రతిధ్వనిస్తూ లోకాన్ని కాపాడాలి!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : ప్రకటనలు- వికటనలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్