field visit: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించి, పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం పునరావాస కాలనీలలో పర్యటన వివరాలు
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు-1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న కేంద్రమంత్రి షెకావత్, సిఎం జగన్ ను తాడేపల్లిలోని అయన నివాసంలో కలుసుకున్నారు. కేంద్ర మంత్రి గౌరవార్థం సిఎం జగన్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, లోకసభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఈ విందు భేటీలో పాల్గొన్నారు.