Saturday, November 23, 2024
HomeTrending Newsమొత్తం ఖర్చు మాదే: షెకావత్

మొత్తం ఖర్చు మాదే: షెకావత్

We will complete: పోలవరం ప్రాజెక్టు కయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు.  1970ల్లో ఈ ప్రాజెక్టును తొలుత మొదలు పెట్టారని, ఆ తరువాత వైఎస్ రాజ శేఖర్ రెడ్డి హయంలో ప్రాజెక్టుపై కదలిక వచ్చిందన్నారు. అయితే యాభై ఏళ్ళయినా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పోలవరం ప్రాజెక్టు, పునరావాస కాలనీల్లో పర్యటిస్తున్న కేంద్రమంత్రి తొలుత తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం ఇందుకూరు -1 కాలనీలోని  నిర్వాసితులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు.  అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయిలో నిర్వాసితులకు నిర్మిస్తున్న కాలనీని పరిశీలించారు, అనంతరం అక్కడ కూడా నిర్వాసితు లను కలుసుకొని వారి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా షెకావత్ మాట్లాడుతూ  ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఈ ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని పూర్తి చేస్తామని, ప్రధాన మంత్రి మోడీ కూడా ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.  ప్రాజెక్టును నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలవరం నిర్వాసితులు కు అన్ని రకాలుగా మేలు చేసేందుకు, వారు అన్ని సౌకర్యాలతో సంతోషంగా జీవించేందుకు అవసరమైన అన్నిచర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తాయని చెప్పారు.

తాడువాయిలో 3905 ఇళ్ళ నిర్మాణం జరుగుతోందని, మౌలిక సదుపాయాల కల్పన కూడా జరుగుతోందని, , ఇది పూర్తయితే నిర్వాసితులకు ఎంతో మేలు జరుతుగుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  నిర్వాసితుల జీవనోపాధికి సంబంధించి ఎక్కువ  విజ్ఞాపనలు వస్తున్నాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఓ  ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు.  నిర్వాసితులకు గతంలో తాను  ఇచ్చిన హామీలను కూడా త్వరితగతిన నెరవేరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్