హాకీ ప్రపంచ కప్ -2023 ట్రోఫీ టూర్ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. మేజర్ ధ్యాన చంద్ నేషనల్ స్టేడియంలో కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘనంగా స్వాగతం పలికి ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ ఉన్నతాధికారులు, హాకీ క్రీడాకారులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.
ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జనవరి 13 నుంచి 29 వరకూ జరగనున్న పురుషుల హాకీ ప్రపంచ కప్-2023కి మనదేశం ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంతో పాటు…. రూర్కెలాలో కొత్తగా నిర్మించిన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలలో ఈ మ్యాచ్ లన్నీ నిర్వహించనున్నారు.
విజేతకు అందించే ట్రోఫీని ఈనెల 5న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేందుకు, ప్రపంచ కప్ పై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈ ట్రోఫీని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రదర్శించి డిసెంబర్ 25నాటికి తిరిగి ఒడిశా తీసుకురానున్నారు.
ఇప్పటికే ఒడిశా, వెస్ట్ బెంగాల్, మణిపూర్, అసోం, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ట్రోపీ ర్యాలీ పూర్తి చేసుకోగా నేడు ఢిల్లీ చేరుకుంది. తర్వాత మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళ్ నాడు, కేరళ, కర్నాటక, ఛత్తీస్ ఘడ్ మీదుగా పయనించనుంది.
టోర్నమెంట్ ఆరంభం రోజునే ఇండియా తన తొలి మ్యాచ్ ను స్పెయిన్ తో ఆడనుంది. పూల్ ‘డి’లో ఇండియా, స్పెయిన్, ఇంగ్లాండ్, వేల్స్ జట్లు ఉన్నాయి.