Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహిందూపురం కథలు-2

హిందూపురం కథలు-2

మహాత్మా గాంధీ పిలుపునందుకుని హిందూపురంలో మద్యనిషేధ ఉద్యమాన్ని ఉధృతం చేసిన కల్లూరు సుబ్బరావును 1921లో తొలిసారి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. సుబ్బారావు కేసును విచారిస్తున్న పెనుకొండ కోర్టుకు జనసంద్రం కట్టలు తెంచుకోవడంతో జడ్జికి దిక్కుతోచలేదు. తరువాత విచారణను హిందూపురానికి మార్చారు. 1921 నుంచి 47 లోపు ఆయన జైలు గోడల మధ్య గడిపిన కాలం అక్షరాలా ఏడేళ్ళు. ఒకసారి హిందూపురంలో ఆయన్ను అరెస్టు చేసి బళ్లారికి రైల్లో తీసుకెళుతుంటే రెండు వేలమంది కాంగ్రెస్ కార్యకర్తలు పట్టాలమీద రైలుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. కల్లూరులో గుర్రబ్బండిలో బయలుదేరిన ఆయన భార్య హిందూపురం వచ్చేవరకు ఎవరూ కదల్లేదు. చివరకు నాలుగు గంటల తరువాత ఆమె వచ్చి భర్తకు వీరతిలకం దిద్ది…ఆమె కోరితే అప్పుడు జనం పక్కకు తప్పుకున్నారు. రైలు కదిలింది. బేడీలు వేసిన చేతులతోనే సుబ్బారావు జనానికి అభివాదం చేస్తూ జైలుకెళ్లారు.

క్విట్ ఇండియా ఉద్యమానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా భావించి అరెస్టు చేసిన 40 మందిలో సుబ్బరావు ఒకరు. అప్పుడు మహారాష్ట్రలోని అమరావతి జైల్లో ఆంధ్రకేసరి ప్రకాశం, కామరాజ్ నాడార్, వి.వి. గిరి, తెన్నేటి, నీలం సంజీవరెడ్డి తదితరులు ఆయన సహచరులు. స్వాతంత్య్రం సిద్ధించేదాకా సుబ్బరావుకు జైలు-ఉద్యమం; ఉద్యమం-జైలు తప్ప మరోమాట తెలీదు. అందుకే కాలేజీ చదువులకు కూడా వెళ్లని ఆయన్ను చక్రవర్తి రాజగోపాలాచారి ముద్దుగా “జైలు పట్టభద్రుడు” అన్నారు.

అనంతపురం(ప్రస్తుతం సత్యసాయి)జిల్లా లేపాక్షి మండల పరిధిలోని కల్లూరు కుగ్రామంలో 1897 మే 25న సూరప్ప-పుట్టమ్మ దంపతులకు సుబ్బారావు జన్మించారు. కల్లూరులో ప్రాథమిక విద్య హిందూపురం, మదనపల్లె, బెంగుళూరుల్లో ఆ తరువాత చదువులు. స్వాతంత్య్రం కోసం ఆసేతుహిమాచలం ఊగిపోతుంటే కల్లూరు ఆగలేకపోయారు. చదువుకు చరమ గీతం పాడి ఉద్యమంలోకి దూకారు. అంతే ఇక ఇల్లు లేదు – వాకిలీ లేదు. సంపాదన అంతకన్నా లేదు. అలా కల్లూరు తెల్లవాడి గుండెల్లో మరఫింగులను మోగించారు.

ఎక్కడ మెదలుపెట్టి ఎక్కడ ఆపితే కల్లూరు(1897-1973)చరిత్ర పూర్తవుతుందో తెలియనంత సముద్రం ఆ వ్యక్తిత్వం. అన్ని విషయాలు చెబితే మహాగ్రంథమవుతుంది. పైపైన కొన్ని ప్రధానమైన విషయాలు:-

  • అనంతపురం ఊరు నడిబొడ్డున పక్క పక్కన ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయం; లలితకళా పరిషత్ భవనాలు కల్లూరు దానమిచ్చిన స్థలంలో కట్టినవి. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వం ఆయనకు అధికారికంగా ఇచ్చిన స్థలాన్ని ఆయన తిరిగీ పార్టీకి, ప్రభుత్వానికి సగం సగం దానమిచ్చారు. ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం ఆ రెండిటి స్థలం విలువ వంద కోట్లు దాటి ఉండాలి. “పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లలితకళా పరిషత్” అని ఈ భవనానికి ఆయన పేరే పెట్టారు.
  • కల్లూరు తెలుగు మాట్లాడితే తెలుగువాడు. కన్నడ మాట్లాడితే కన్నడవాడు. ఇంగ్లిష్ మాట్లాడితే ఇంగ్లిష్ వాడు. సంస్కృతం మాట్లాడితే పండితుడు. స్వతహాగా రచయిత. కవి. ఆశువుగా పద్యాలు చెప్పేవారు. చిత్రకారుడు. ఆయన వాగ్ధాటికి గాంధీజీ, రాజాజీలాంటివారు అభిమానులు. వేలమందిని మంత్రముగ్ధులను చేసే ఆ ఉపన్యాసంలో మునిగి తేలాల్సిందే కానీ మాటలతో వర్ణించలేను అని పొంగిపోయాడు రాజాజీ.

  • ఆయన హిందూపురం నానెప్పనగర్ ఇల్లు ఒక భువనవిజయం. అక్కడ సంస్కృతాంధ్ర పండితుడు, సంగీతజ్ఞుడు రాళ్ళపల్లి- ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వీ వీ గిరి సంగీత సాహిత్యాల గురించి మాట్లాడుకుంటారు. పుట్టపర్తి నారాయణాచార్యులు అక్కడ శివతాండవం పాడారు. విద్వాన్ విశ్వం పెన్నేటి పాట పాడారు. తెలుగు చిత్రకళను అంతర్జాతీయ యవనికమీద రెపరెపలాడించిన కొండపల్లి శేషగిరిరావు అక్కడ కుంచె పట్టి లేపాక్షి చిత్రాలను ఆవిష్కరించారు. అనంతపురంలో విద్వాన్ విశ్వం ప్రతిభను గుర్తించి…సానబెట్టి చిలుకూరు నారాయణరావు దగ్గరికి తీసుకెళ్ళి లోకానికి పరిచయం చేసింది కల్లూరు సుబ్బారావే.
  • రెండొందల ఏళ్ళపాటు మరుగునపడి మట్టిదిబ్బగా ఉనికి కోల్పోయిన లేపాక్షి ఆలయాన్ని వెలికి తీసుకురావడానికి కల్లూరు తుదిశ్వాసదాకా శ్రమించారు. సాధికారికంగా లేపాక్షి ఆలయ చరిత్రను ఇంగ్లిష్, తెలుగు, కన్నడ భాషల్లో చరిత్రకారులచేత తొలిసారి రాయించింది కల్లూరు సుబ్బారావే.
  • 1934లో అనంతపురానికి వచ్చిన మహాత్మా గాంధీ ఉపన్యాసాలకు అనువాదకుడు, ఆయనకు సహాయకుడు కల్లూరు సుబ్బారావు. గాంధీ హరిజనోద్ధరణకు దాతలనుండి విరాళాలు సేకరిస్తున్నారు. ఆ సమావేశంలో గాంధీ ముందు కూర్చుని ఒక అట్టముక్క మీద కల్లూరు అప్పటికప్పుడు గాంధీ బొమ్మ వేసి…కింద-
    “ఇంటికొక పుష్పము-
    ఈశ్వరునికొక మాల;
    మనిషికొక రూపాయి-
    మహాత్మునికొక భిక్ష”
    అని ఆశువుగా రాసి అందరిముందుకు వెళ్ళారు. అక్కడున్న బ్రిటిష్ ఉన్నతాధికారి గెలిటీ దంపతులు కూడా విరాళాలిస్తుంటే గాంధీ బోసినవ్వు నవ్వారని కల్లూరు మహామనీషి పుస్తకంలో రావినూతల శ్రీరాములు పులకింతగా పేర్కొన్నారు.

  • గాంధీజీనే మరచిపోతున్న కొత్తతరం వారికి కల్లూరు సుబ్బారావు గురించి ఎవరో ఒకరు కల్పించుకుని చెప్పాలన్నారు విద్వాన్ విశ్వం.
  • సమరయోధుడిగా కల్లూరు దేశసేవ; ప్రజాప్రతినిధిగా సమాజసేవ, భాషాప్రేమికుడిగా సాహిత్యసేవ, రాయలసీమ కళల పోషకుడిగా సాంస్కృతిక సేవ…ఇలా ఎన్నెన్ని కోణాల్లో చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఎంతో మిగిలిపోయే చరిత్ర కల్లూరువారిది అన్నారు సర్దేశాయి తిరుమలరావు.
  • గుత్తి, గుంతకల్లు, వజ్రకరూరుల్లో అప్పుడప్పుడు వజ్రాలు దొరుకుతాయని విన్నాను. నాకిక్కడ అంతకంటే పెద్దదైన నడిచే వజ్రం దొరికిందని సాక్షాత్తు గాంధీ కల్లూరును చూపిస్తూ ప్రశంసగా చెప్పారు.

అది 1934. ప్రస్తుతంలోకి వస్తే…ఇది 2024. అన్నట్లు- ఇంతకూ కల్లూరు ఎవరు?

(హిందూపురం ఆణిముత్యం కల్లూరు అన్న శీర్షిక బహుశా ఆయన్ను హిందూపురానికి కుచించినట్లు అవుతుంది. ఆయన భరతమాత ముద్దు బిడ్డ. హిందూపురం గురించి చెప్పాల్సివచ్చినప్పుడు ఆయనదొక్కటే ఒక చరిత్ర. మిగతావారందరిది ఒక చరిత్ర)

రేపు:-
హిందూపురం కథలు-3
“మరికొన్ని ఆణిముత్యాలు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్