చాలామంది మహిళలకు మగవారితో పనిబడేది కొన్ని చోట్లే. వాటిలో టైలర్ షాప్ ముఖ్యమైంది. మిగిలిన ఏ విషయమైనా ఒప్పుకుంటారు గానీ ఒంటి కొలతలు పట్టుకుని సరిగ్గా కుట్టడం మగ దర్జీలకే సాధ్యం అనుకునేవారు చాలామందే ఉన్నారు. కొన్నిచోట్ల మహిళలు బోతిక్ లు నిర్వహిస్తున్నా…అక్కడా కుట్టుపని ఎక్కువగా మగవారిదే. అయితే పరపురుషులు తమ శరీరాన్ని తాకడం ఇష్టంలేనివారు వెతుక్కుని మరీ ఆడ టైలర్స్ దగ్గరికి వెళ్తారు. కొందరికి ఇళ్లల్లో ఆంక్షల వల్ల మగ దర్జీల దగ్గరికి వెళ్ళలేరు. కొంతమంది మగానుభావులు తమ సమక్షంలోనే కొలతలు తీసుకోవాలనీ అంటారు. ఇవన్నీ మహిళలకు ఇబ్బంది కలిగించే విషయాలే. ఇటువంటి ఇబ్బందే జిమ్ విషయంలో కూడా. వ్యాయామం చెయ్యాలని ఉన్నా చాలామంది మహిళలు జిమ్ కెళ్ళలేరు. కారణం అక్కడ మగ శిక్షకులు ఉంటారు. వారు తాకితేనో! ఆ ఊహే భరించలేనివారు చాలామంది. పోనీ మహిళల కోసమే వెలసిన జిమ్ కి వెళ్తే సరైన పరికరాలు ఉండవు. ట్రైనర్లు ఉండరు. దాంతో చాలామంది నడకకే పరిమితం అవుతున్నారు. యోగా నేర్పే నిర్వాహకులు కూడా ఎక్కువగా మగవారే ఉంటారు. కొన్ని జిమ్ లలో మాత్రం ట్రైనర్ తాకచ్చా లేదా అని అడిగి వ్యాయామ భంగిమలు సరిచేస్తారు. ఇటువంటి కారణాలపై అనేక గొడవలు.
అలాగే ఈ మధ్య ఆడా మగా ఇద్దరికీ సేవలందించే బ్యూటీ పార్లర్లు వెలిశాయి. అక్కడ కొన్ని సేవలు మగవారే చేస్తారు. ఇదీ చాలామంది మహిళలకు(వారి భర్తలకు) అభ్యంతరకరమే. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేలా మహిళలకు ఉద్యోగావకాశాలు పెరిగేలా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ ఒక ఆలోచన చేసింది. పైన పేర్కొన్న ప్రదేశాల్లో మగవారు మహిళలని అసభ్యంగా తాకి వేధించకుండా ఆ పనులు మహిళలే చేపట్టాలని ప్రతిపాదించింది. అంటే టైలర్ షాప్ లో కొలతలు ఆడవారే తీసుకోవాలి. బ్యూటీ పార్లర్ లో అమ్మాయిలు మాత్రమే సేవలందించాలని, జిమ్ ట్రైనర్లు, యోగా సెంటర్లలో మహిళా ట్రైనర్లే ఉండాలి. ఫలితంగా అనేక సమస్యలు తగ్గి మహిళలకి ఉపాధి పెరుగుతుందని మహిళా కమిషన్ అభిప్రాయం. కానీ ఇవన్నీ పాతకాలం సమస్యలు. అవన్నీ దాటి ముందుకొచ్చారు మహిళలు. ఈ కాలం అమ్మాయిలైతే అసలే పట్టించుకోరు. ఏదన్నా సమస్య ఎదురైతే ఆత్మరక్షణ విద్యలు నేర్చి బుద్ధి చెప్పమనాలి గానీ ఇదేం లాజిక్ అని యూపీలో ఆడా మగా సణుక్కుంటున్నారట.
-కె. శోభ