“ఎప్పటికైనా ఈ నాగావళీ తీరంలోనే నాన్నతో చిన్నప్పుడు తిరిగిన పొలం గట్లు చూస్తూ ఈ గాలిలోనే , ఈనేలలోనే కలసిపోవాల్రా…” సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో వీలైనపుడు సంక్రాంతికి అట్లాంటా నుండి వచ్చే చిన్ననాటి స్నేహితుడు మహేష్ మాట ఇది.
తనొచ్చినప్పుడల్లా ఓ రోజు తప్పనిసరిగా కలిసే క్లాస్ మేట్లలో కొంత మంది ఓ గంటా రెండు గంటలు గ్లాసు మేట్లుగా మారే ఉత్సాహమైన కార్యక్రమానికి తన వంతు దక్షిణగా తెచ్చే ఆ ఫారిన్ వైనో , విస్కీయో మూత తీయగానే పొంగే ఎడతెరిపిలేని కబుర్లు మళ్ళీ తానొచ్చినంత వరకూ వాడికి ఆనంద జ్ఞాపికలు. వాడు మళ్ళీ వేగంగా రావాలని కోరుకునే మా మనసులకు మమకార మల్లికలు.
ఏభైకి రెండడుగుల దూరంలో ఉన్న వయసులో సగకాలం పైగా భూమికి అవతల వైపే ఉంటున్న ఆ మది తలుపులు తీస్తే ఎన్నెన్ని మాటలో…
చేరే ఉద్యోగాలు , మారే ఊర్ల విశేషాలతో పాటు-
ఎప్పుడో , ఏదో ఓ బలమైన భావం గుండెను తాకితే ఆ మాటల సాంద్రత చూడాలి…
మంచి ఉద్యోగం.
చక్కని కుటుంబం.
అక్కడే పుట్టి బాగా చదువుకుంటున్న పిల్లలు.
ఇంకేం రా! అంటే…ఓ నవ్వు.
నిజమేరా… అమెరికాలో నాకు ఏ సమస్యలూ లేవు.. చాలా మంది దృష్టిలో సౌకర్యవంతమైన జీవితం…
అప్పట్లో సరదాగా చదువుకుంటూ అందరిలానే తల్లిదండ్రుల ఆశలతో ,
అప్పటికే అక్కడకు వెళ్ళిన స్నేహితులను చూసిన ఉత్సాహంతో చేరిన ఆ నేల నిజంగానే భూతల స్వర్గం…
మనసులో కన్న కలలు నిజం చేసుకోగలిగే నిజమైన దేశం.
కానీ ఎంత కాలం…?
మనది కానిది ఏదైనా ఎంత కాలం ..?
ఇష్టమని ఏదైనా ఎంతని తింటాం..?
మనదైన సొంతానికి , మనసంతా లాగే వారి దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుందిరా..
నిజమే-ప్రపంచాన్ని చూడడమూ, ఆర్థికంగా అభివృద్ధి చెందడమూ కచ్చితంగా ఉండాలి…కానీ కడుపు నిండాక , కనులు నిండాక వెనక్కి వెళ్ళిపోవాలేమో …
కానీ ఇవి ఎవరికీ చెప్పుకునే విషయాలే కావు.. పచ్చ కార్డు వచ్చేసిన పిల్లలకు ఇదే పుట్టిన నేల…
నేను పుట్టిన ఊరు వారికి చుట్టపు చూపు…వీళ్ళను వదిలి నేను వెళ్ళలేను…వీళ్ళను నాతో శాశ్వతంగా రమ్మనలేను…
నా బంధువులంతా వీరికీ బంధువులే కానీ ఏ ఆనందమూ పంచుకోని భవబంధాలు వారితో… అన్న వాడి మాటలు తలచుకుంటూ, మొన్న ట్రంప్ మార్చాలనుకుంటున్న H1B లు, అమెరికా ప్రవాసుల పౌరసత్వపు రూల్స్ ని చదువుతుంటే… ఏవో తెలియని వింతైన ఆలోచనలు…
ఈ చట్టాలు చేసే వారి తాత ముత్తాతలూ ఓనాటి వలస జీవులే…ఏవేవో ఆశలతో అక్కడ అడుగుపెట్టిన వారే..
అయినా అది మరిచి…నచ్చినట్టు ఎవరూ అక్కడకు రావొద్దంటున్నారు వీరు.
ఈ భూమంతా ఒకటే…
మనుషులంతా ఒకటే…
అందరం ఏదోరోజు వెళ్ళిపోయే అతిధులమే లాంటి విశ్వజనీన భావాలకు ఏ మాత్రం విలువే లేదు కదా అనిపించింది.
అయినా…
ఇంత ఆంక్షాపూరిత వాతావరణంలో ఇక నుండైనా ఆ దూర దేశాల కలలు యువతలో ఆగుతాయా అనుకుంటూ ఉంటే…
మొన్ననే చూసిన విశాఖపట్నం కైలాసగిరి వెనుకున్న విశాలాక్షినగర్లో మొదలైన మూడో ఖరీదైన వృధ్దాశ్రమం కళ్ళముందు మెదిలింది.
అక్కడ ఎన్ని కళ్ళల్లో కలలు ఆవిరైపోయి…
ఎన్ని గుండెల్లో వృధ్దాప్యాన్ని పిల్లా జెల్లలతో నవ్వుతూ గడపాలన్న కోరికలు బూడిదైపోయి…అన్నీ ఉన్నా ఎవరూ లేక…కాలం గడుస్తోందో…అసలు దీనికి కారణమేంటి?
బాగా బతకడమంటే… బంధుమిత్రుల దగ్గర గొప్పకు పిల్లలను అమెరికాలు ఆస్ట్రేలియాలు పంపేయాలన్న కోరికను పిల్లల మనసుల్లో నాటిన అందులో కొందరి పెద్దవాళ్ళ భేషజమా..?
లేక దూరంగా ఉంటూ కొన్ని సార్లు ఆ వెలుగులు కావాలనే వీడక , కొన్ని సార్లు నిజంగానే వీడలేక, చేయి పట్టుకొని నడిపించిన చిన్ననాటి చేతుల్ని , పదపదమూ పలికించిన తల్లిదండ్రుల మనసుల్ని పట్టించుకోలేని ఆ పిల్లల పరిస్థితులా…?
మా మహేష్ కి ఆ బెంగ లేదు.. నాన్న ఆ మధ్యే కాలం చేసినా , తమ్ముడి కుటుంబంతో పల్లెలో పొలాలు చూసుకుంటూ , ఒంటరితనం లేకుండా అమ్మ బాగానే ఉంటోందనిపిస్తోంది.
లేదా దూరంగా ఉన్న కొడుకు ఊసులూ మనవలపై ఆశలూ గుండెను కుదిపేస్తున్నా…బయటకు మాత్రం సంతోషంగా కనిపిస్తుందేమో ఆమెకు మాత్రమే తెలిసుండాలి.
నిజమే…
ఏ తల్లి మాత్రం కన్న కొడుకుని సంవత్సరంలో ఒక్కసారి చూస్తే చాలనుకుంటుంది..?
ఏ తల్లి తన మనవలు మనవరాళ్ళతో కేవలం ఫోన్ వీడియోలోనే మాట్లాడాలనుకుంటుంది..?
ఏ అన్నాదమ్ములు అక్కాచెల్లెల్లు మాత్రం తమ సోదరుడు ఓ పది రోజులుంటే చాలనుకుంటారు…?
అందరూ దగ్గరతనాన్నే కోరుకుంటారు కదా!
అవునూ…
అసలు తెలివైన వారు, బాగా చదువుకున్న వారు ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోవడమెందుకు..?
వాళ్ళ తెలివికి తగ్గ పరిస్థితులను ఈ సమాజం సృష్టించదెందుకు?
ఓ నాటి అత్యంత విజ్ఞాన సారస్వతాన్ని మళ్ళీ తెద్దామనే స్పృహతో- వదిలి వెళ్ళిన వారిని తిరిగి వెనక్కి పిలవమెందుకు ..?
గత ఐదారు దశాబ్దాల బ్రెయిన్ డ్రెయిన్ రివర్స్ అవ్వదెందుకు..?
బుర్రలో జవాబులు సరిగా తెలియని ఇన్ని ప్రశ్నలమధ్య…
ఎప్పటిలాగే రోజూ ఆఫీసు కొలీగ్స్ కబుర్లలో…
బంధువుల శుభకార్యాల్లో…
పిల్లల చదువుల గురించి ఎన్నెన్ని మాటలో…
వారి పాస్ పోర్ట్ లకై ఎన్నెన్ని పాట్లో…
దూరంగా వెళితేనే అభివృధ్దనుకునే ఎన్నెన్ని ఆశలో…
మా స్నేహితుడి కోసం మేం చూసినట్లు , రాబోయే రోజుల్లో వీళ్ళందరి ఇళ్లళ్లో సంక్రాంతి పండగకు ఇకపై ఎన్నెన్ని ఎదురుచూపులో…
అలాకాక…
ఇక నుండైనా పిల్లలు తమ విజ్ఞానం, విద్వత్తు ఈ దేశానికే ఉపయోగించి మన పాత వైభవాన్ని తిరిగి తెస్తే ఎంత బాగుణ్ణో అనే ఎన్నెన్ని ఆశ నిండిన అందమైన ఊహలో…
-కిలపర్తి త్రినాథ్
9440886844