గతానికి భిన్నంగా ఉత్తరప్రదేశ్ లో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల వివరాలు వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ యోగి ప్రభుత్వం ఇచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్, పీపీఎస్, పీసీఎస్ ఆఫీసర్ల తరహాలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ప్రాపర్టీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలు వెల్లడించని సుమారు 2.5 లక్షల ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. ఆన్‌లైన్‌లో ఆస్తుల వివరాలు ఇవ్వాలని యూపీ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొందరు ఉద్యోగులు మాత్రమే ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వివరాలు వెల్లడించని 2,44,565 మంది ఉద్యోగులు ఆగస్టు నెల జీతాలను నిలిపివేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆగస్టు నెల జీతాన్నిఆపినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు మానవ్ సంపద పోర్టల్(Manav Sampada)ను యూపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆగస్టు 31వ తేదీ వరకు ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ఆ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 71 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలతో సమాచారాన్ని పొందుపరిచారు. టీచర్లు, కార్పొరేషన్ ఉద్యోగులు, అటానమస్ సంస్థల ఉద్యోగులను ఈ నిబంధన నుంచి మినహాయించారు.
సిఎం యోగి నిర్ణయంతో రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల్లో అలజడి నెలకొంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులను దీనికి కిందకు తీసుకురావాలని యుపి ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో రెండేళ్లలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ప్రసంశలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే ఏసిబి దాడుల అవసరాలు తగ్గుతాయని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
-దేశవేని భాస్కర్