Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంVaccine: వివాదంగా మారిన వ్యాక్సిన్ ప్యాకేజీ

Vaccine: వివాదంగా మారిన వ్యాక్సిన్ ప్యాకేజీ

ప్రపంచీకరణలో పర్యాటక రంగం ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కాస్త తీరిక దొరికిందంటే చాలు… కుటుంబాలతో కలిసి హాలీడే టూర్లకు వెళ్తుంటారు. వేసవిలో అయితే లక్షలాది కుటుంబాలు హాలిడే ప్యాకేజీ పేరుతో దేశ విదేశాలు చుట్టి వస్తుంటాయి. దీనితో ఓవైపు ప్రభుత్వాలకు ఆదాయం, మరోవైపు హోటళ్ళు, ట్రావెల్స్ రంగంపై ఆధారపడిన లక్షలాది మందికి ఉపాధి దొరికేది.

ఇవికాక పెళ్ళైన కొత్త జంటలకు హనీమూన్ ప్యాకేజీలు, పెద్దవాళ్ళకు కాశీ, బద్రీనాథ్, కేదారినాథ్ యాత్రలు ఎప్పుడూ ఉండేవే…. కరోనా మహామ్మరితో ఏడాది కాలంగా పర్యాటక రంగం కుదేలైంది. వేలాది మంది రోడ్డున పడ్డారు. కోట్లాది రూపాయలతో మూడు నుంచి ఏడు నక్షత్రాల హోటల్లు కట్టినవారు, వాటిని నడుపుతున్నవారు ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నారు.

వీరిలో కొందరు హోటళ్ళు పూర్తిగా మూసేసుకోగా మరికొందరు సూక్ష్మంలో మోక్షానికి మార్గం వెతికి కరోనా బాధితులకు క్వారంటైన్ వసతి కల్పించి బతుకు పోరాటం చేస్తున్నారు.

సంక్షోభాన్ని అవకాశంగా మలచుకునే తెలివి తేటలు ఉన్న మరికొందరు వినూత్నమైన ఆలోచనలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

హైదరాబాద్ లో ఓ కార్పొరేట్ హోటల్ యాజమాన్యం ఇలాంటి ఓ పదునైన ఆలోచన చేసింది. కస్టమర్ దేవుళ్ళను ఆకట్టుకునేందుకు కరోనా వ్యాక్సిన్ పేరిట ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీ ధర 2999 రూపాయలు. ఇందులో భాగంగా తమ దగ్గర అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ఇచ్చి పసందైన విందు భోజనం పెట్టి ఖరీదైన సూట్లో నాలుగు గంటలు రెస్ట్ తీసుకోవచ్చని ప్రకటన విడుదల చేసింది. రాత్రి కుడా ఉంటాం అనేవాళ్ళకు ఐదు వేల రూపాయలతో మరో ప్యాకేజీ కుడా సిద్దం చేశారని సమాచారం. ఈ వార్తకు సోషల్ మీడియాలో విశేష ప్రాచుర్యం లభించింది.

 

సామాన్యులకు దొరకని వ్యాక్సిన్ బడా బాబులకు ఎలా అందుబాటులో ఉందో చూడండి అంటూ అదే సోషల్ మీడియా వేదికలో కొందరు విమర్శించారు.

ఆ నోట ఈ నోట ఈ వార్త ఢిల్లీ వరకు చేరింది. అవాక్కవటం కేంద్ర ప్రభుత్వం వంతైంది. ప్రభుత్వం పేర్కొన్న నాలుగు చోట్ల తప్పితే మరెక్కడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. ఇలాంటి చర్యల వాళ్ళ వ్యాక్సిన్ లక్ష్యమే దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో ఆ హోటల్ యాజమాన్యంతో వ్యాక్సిన్ పొత్తు కుదుర్చుకున్న ఆస్పత్రులు వెనకడుగు వేశాయి. తమ ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోయారని హోటల్ వారు వ్యాక్సిన్ ప్యాకజీ నిలుపుదల చేశారు.

 

మరో కోణంలో చూస్తే హోటల్ వారి ప్రకటనలో తప్పు ఏముందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ భూమి మీద ప్రాణం ఉన్నంత వరకు కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా మనుగడ కోసం పోరాటం తప్పదు. ఎంతో పెట్టుబడి పెట్టి మొదలు పెట్టిన వ్యాపారాన్ని కాపాడుకోవటం, దానిపై ఆధారపడ్డ కుటుంబాలు మరెన్నో ఉంటాయి. లోతుగా ఆలోచిస్తే ఈ వాదన కూడా సబబే.

ఆస్పత్రుల్లో ఇప్పుడు జరుగుతున్న చోద్యాలు అంతా ఇంత కాదు. ఈ విషయం ప్రస్తుత పరిస్థుతుల్లో అందరికి తెలుసు. వ్యాక్సిన్ పంపిణి కూడా ఎవరికి ఎలా అందుబాటులో ఉందో జగమెరిగిన సత్యం. హోటల్ వాళ్ళు చేసిన ప్రకటనను భూతద్దంలో చూపెట్టి రాద్దాంతం చేసినట్టుగా అనిపిస్తుంది.

ఏదైతేనేం రాడిసన్ బ్లూ హోటల్ కు భలే ప్రచారం లభించింది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల వాళ్లకు ఇప్పుడు రాడిసన్ బ్లూ హోటల్ సుపరిచితమైంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్