Wednesday, January 22, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంయురేకా! దొరికింది రెండో డోస్!

యురేకా! దొరికింది రెండో డోస్!

“కర్మంబున ద్వితీయ యగు”
చిన్నయసూరి బాలవ్యాకరణంలో ఒక సూత్రమిది. 

ఇది తెలుగు వ్యాకరణ పాఠం కాదు కాబట్టి సూత్ర విశ్లేషణ అనవసరం. అయినా ఇంగ్లీషు ప్రథమలోకి వచ్చి, ఖర్మ కొద్దీ ఉండక తప్పని పరిస్థితుల్లో కర్మంబున ద్వితీయయగు- అనుకుని నిట్టూర్చవచ్చు. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకునే సరికి-నాకెందుకో “కర్మంబున ద్వితీయయగు” సూత్రమే గుర్తొస్తోంది. నా ఖర్మ వ్యాక్సిన్ రెండో డోస్ ఉత్తర పద కర్మధారయ విశేషణంగా ఎలా మారిందో చెబుతాను.

మా అపార్ట్ మెంట్లో ఒక డాక్టర్ రెఫర్ చేస్తే మొదటి డోస్ వేయించుకున్నాను.  రెండో డోస్ కు కాలపరిమితి అయ్యే లోపు వ్యాక్సిన్ అందుబాటులో లేదని డాక్టర్ చాలా గిల్టీగా ఫీలవుతూ చెప్పారు.

ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? అని డాక్టర్ ను ఓదార్చి నా ప్రయత్నాల్లో నేను పడ్డాను.

ప్రభుత్వ ఆసుపత్రులు, నిమ్స్ ఇలా ఎక్కడెక్కడో వెతికాను. కర్ఫ్యూ ఇనుప కంచెలను దాటి విజయవాడ వెళ్లి పొడిపించుకుని వద్దామనుకున్నాను. ఈలోపు ఒక జర్నలిస్ట్ మిత్రుడు సామాజిగూడ ప్రెస్ క్లబ్ లో రెండో డోస్ వేస్తున్నారన్నాడు.

తీరా అక్కడికి వెళితే ప్రెస్ క్లబ్ సౌజన్యంతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో వేస్తున్నారన్నారు.

నేను, మా ఆవిడ పేర్లు ఎన్రోల్ చేయించుకున్నాం. ఫలానా వేళకు రండి అని మెసేజ్ కూడా ఇచ్చారు. ఆ ఫలానా వేళకు అక్కడికి వెళితే చెట్టుకొకరు పుట్టకొకరు నిరీక్షిస్తున్నారు. నిజానికి కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, పచ్చని చెట్లతో అది అందమయిన ప్రదేశమే.

ఐక్యరాజ్యసమితి ఆహార పొట్లాలకు సోమాలియా శరణార్థులు దీనంగా, నిరాశగా, దిగులుగా ఉన్నట్లు వందలమంది భౌతిక దూరాన్ని ధిక్కరించి అక్కడ పడిగాపులు పడుతున్నారు. మొదట వారి మీద జాలి వేసింది. తరువాత నా మీద నాకే జాలి వేసింది. వసుదేవుడంతటివాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు కదా అని ఒక గాడిద సామెత గుర్తు తెచ్చుకుని అక్కడే కూలబడ్డాం.

ఈలోపు అక్కడి సిబ్బంది కాకులను తోలినట్లు..ష్ ..బయటకు వెళ్లండి…మేం భోంచేయాలి అని నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా మా మొహాల మీదే తలుపులు మూసేశారు. ఆత్మాభిమానం దెబ్బతిని అక్కడ ఉండలేక మళ్లీ మా డాక్టర్ కే ఫోన్ చేశా.

సార్! ఇక్కడ ఘోరమయిన అవమానం జరిగింది…మూడు లోకాల్లో ఇంకెక్కడయినా ఖర్మ ఫలమయిన ద్వితీయ డోస్ దొరుకుతుందా? అని. అయిదు నిముషాలు గడువు కావాలని, మళ్లీ డాక్టరే ఫోన్ చేశారు. అక్కడికి వెళితే డోస్ ఉంది కానీ – ఆ డోస్ నా భుజానికి గుచ్చుకునే లోపు- నా ఆత్మాభిమానానికి ఎన్నెన్నో గుచ్చుకున్నాయి.

మనిషికి విలువ లేదు. క్యూలో ఉన్నవారికి గౌరవం లేదు. మాటలో మర్యాద లేదు. ఒక పద్ధతి పాడు లేదు. చేపల మార్కెట్ నయమేమో! అలా అలా నిరీక్షించి ద్వితీయ డోస్ వేయించుకుని బయటపడ్డాం.

మొదటి డోస్ 250 రూపాయలు. అదే రెండో డోస్ 1250 రూపాయలు ఎందుకయ్యిందో నాకు తెలిసినా- నేను చెప్పదలుచుకోలేదు.

ఒకరి మీద ఒకరు పడి, క్యూలను ఛేదించి అడ్డంగా వెళ్లి, పైరవీలతో నేరుగా వెళ్లి రెండో డోస్ వేయించుకుంటున్నవారి కళ్లల్లో వెలుగుల ముందు కోటి సూర్యుల కాంతి కూడా దిగదుడుపే.

దేశంలో కరోనా వ్యాక్సిన్ ఒక ప్రహసనం. ఒక పైరవీ. ఒక ఆబ్లిగేషన్. ఒక రికమెండేషన్. ఒక భయం. ఒక బాధ. ఒక నైరాశ్యం. ఒక తొక్కిసలాట. ఒక ఉక్కిరి బిక్కిరి.

“కర్మంబున ద్వితీయయగు” సూత్రానికి అర్థం చెప్పేంత వ్యాకరణ పాండిత్యం కానీ; వ్యవహార జ్ఞానం కానీ నాకు లేవు. నేనేనంటే చేతగాని సగటు భారతీయుడిని. మీరందరూ చేతనయిన సగర్వ భారతీయులు కాబట్టి- మీకు ఇలాంటి అనుభవాలు ఎదురై ఉండవు. ఎదురు కావాలని నేను కోరుకోవడం లేదు కూడా.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్