Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన‌ బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉప శీర్షిక. గూడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాల పై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు.  ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ వాసంతి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాట‌ల్లోనే..

నేను తెలుగమ్మాయిని కానీ.. బెంగళూరులో పెరిగాను. నాకు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఐదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చాను. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చాను. కన్నడలో ఐదు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఈ సినిమా కోసం ఆడిషన్ చేశారు. నిర్మాత ఆశ మేడమ్ కు నచ్చడంతో… నీలవేణి పాత్రకు సరిపోతానని దర్శకుడు నన్ను ఎంపిక చేశారు. బావ వెంటపడుతూ చలాకీగా తిరిగే అమ్మాయి నీలవేణి. ఈ పాత్ర నాకోసమే డిజైన్ చేసినట్టు అనిపించింది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తున్నాను. సినిమా అంతా లంగావోణిలో కనిపిస్తాను. ఈ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది.

ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నాను. నేను అసలే కొత్త. కానీ నాకు ఎలాంటి భయం లేకుండా అందరూ అన్నను ప్రోత్సహించారు. సంపూ పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. క్యాలీఫ్లవర్ కారెక్టర్‌కు మరదలు. ఆయన వెంట పడుతూనే ఉంటాను. కానీ ఆయన నన్ను పట్టించుకోరు. అలాంటి పాత్రను పోషించాను. క్యాలీఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడినే అడగాలి. కానీ ఇది చాలా యూనిక్‌గా ఉంటుంది. ఓ వెజిటబుల్ పేరు పెట్టారేంటి? అని అనుకున్నాను. సంపూ గారికి ఈ టైటిల్ సెట్ అవుతుంది. పోస్టర్ రిలీజ్ చేశాక షాక్ అయ్యాను.

మొదట్లో ఈ సినిమా చేయాలా? వద్దా? అని భయపడ్డాను. సంపూ హీరో అని తెలీదు.. టైటిల్ కూడా చెప్పలేదు. కథలో క్యాలీఫ్లవర్ అని ఉంది కానీ అదే టైటిల్‌గా పెడతారని తెలీదు. తెలుగులో మొదటి సినిమా.. యూనిక్‌‌గా ఉందని ఒప్పుకున్నాను. ఆర్కే గారు సీరియల్స్‌ లో చాలా సీనియర్ డైరెక్టర్. అంత పెద్ద డైరెక్టర్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. అందుకే ఈ చిత్రం నాకు స్పెషల్. ఇదే నా డ్రీమ్ రోల్ అని కూడా చెప్పొచ్చు.

అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్, మెసెజ్ ఓరియెంటెడ్ ఇలా సినిమాలో అన్నీ ఉంటాయి. ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. ప్రజ్వల్ గారు మంచి సంగీతాన్ని అందించారు. పోసాని, సంపూ, ముక్కు అవినాష్, రోహిణి, గెటప్ శ్రీను ఇలా అందరితో సీన్లు ఉంటాయి. వేసవిలో పాలకొల్లులో షూటింగ్ చేశాం. దాదాపు 19 రోజులు షూట్ చేశాం. ఎంతో సరదాగా గడిచింది. లాక్డౌన్‌లోనే షూటింగ్ చేశాం. అందరం వ్యాక్సిన్ వేసుకుని ఆర్ఎఫ్‌సీలో షూటింగ్ చేశాం. నేను ఇంకా సినిమా చూడలేదు. మా యూనిట్‌లో సినిమా చూసిన వారు నేను బాగానే చేశాను అని అంటున్నారు. మరి ఆడియన్స్ రియాక్షన్ చూడాలి.

ఇప్పుడు రెండు ప్రాజెక్ట్‌ లు చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను, ఆది సాయికుమార్ చిత్రంలోనూ నటిస్తున్నాను. ఏ నిర్మాణ సంస్థ అయినా పర్లేదు. నాకు నానితో సినిమా చేయాలని ఉంది. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం కన్నడ కన్నా తెలుగులోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అంటూ పలు విశేషాలు వెల్లడించింది వాసంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com