Wednesday, January 22, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందేవుడు చేసిన బొమ్మలు

దేవుడు చేసిన బొమ్మలు

‘హంపీ నుండీ హరప్పాదాకా’ ప్రయాణాల నెమరవేత కావ్యంలో ఒక వెన్నెల రాత్రి గుర్రబ్బండి ప్రయాణాన్ని తిరుమల రామచంద్రగారు మైమరచి వర్ణించారు . బహుభాషా పండితుడు. లోకం తిరిగినవారు. గ్రామీణ భారతంలో ప్రతిదాన్ని ప్రేమించి ఆవహింపజేసుకున్నవాడు. అన్నిటికీ మించి తిరుపతిలో విద్యార్థిగా ఉంటూ స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లినవాడు. నిగర్వి. నిరాడంబరుడు. కష్టాల సప్తసముద్రాలను చిరునవ్వుతో ఈదినవాడు కాబట్టి అయన ఏది చెప్పినా చాలా లోతుగా , అందంగా అణువణువునా భారతీయతను అద్దుకుని ఉంటుంది .

ఆయన చెప్పిన గుర్రబ్బండికి రెండు దారి దీపాలు వేలాడుతూ ఉంటాయి . ఫస్ట్ క్లాస్ ఏ సీ కూపే లాగా వెనకాల ఒక కూపే . ఇద్దరు పడుకోవడానికి కూడా వీలుగా చిన్న పరుపులు , రెండు వైపులా రెండు చిన్న కిటికీలు , ఆ కిటికీలకు తెరలు , లోపల మంచినీళ్ల మరచెంబులు , కుదుపులకు చెక్క గోడలు తగలకుండా దూది పరుపులు దిండ్లు , పెట్టెలోకి ఎక్కడానికి దిగడానికి మెట్లు , గుర్రానికి దాణా నిల్వచేయడానికి పెట్టె కింద అమరిక , పెట్టేబేడా ఎంతయినా పెట్టుకోవడానికి పెట్టె వెనకాల ప్రత్యేక ఏర్పాటు ఇలా వాల్మీకి వర్ణించిన పుష్పకవిమానానికి ఏమాత్రం తక్కువకాదు తిరుమలరామచంద్రగారి గుర్రబ్బండి .

అలాంటి గుర్రబ్బండికి ఏమాత్రం తక్కువకాదు నేను చిన్నప్పుడు లేపాక్షిలో ఎక్కి తిరిగిన ఎడ్ల బండ్లు .
ఇందులో రెండురకాలు . ఒకటి పెద్ద చెక్క చక్రాలతో ఉన్నది . రెండోది టైరు చక్రాలతో ఉన్నది . చెక్క చక్రాల బండి సాధారణం . టైరు బండి సంపన్న వ్యవసాయదారులకే పరిమితం. రోల్సు రాయిస్ లాంటిది. వోల్వో మల్టీ యాక్సిల్ బస్సులాగా కాస్త లోలెవెల్ . కానీ చెక్క చక్రాల ఎడ్ల బండి అందం , గాంభీర్యం , దాని నడక , హొయలు , ఆ బండిమీద వేరుశెనగ పంట కొండలాగా పేర్చి , ముందు తలపాగా చుట్టి , చేత చెర్నాకోల పట్టి , లేపాక్షి బసవడి అంత జోడెడ్లను చల్ . . . డుర్రుర్ . . అని నాలుకమడతపెట్టి ఇతరులుపలకలేని సంకేత భాషలో తోలే రైతును చూడని కళ్లు కళ్లేకాదు .

ఈ ఎడ్లబండ్లు వరుసగా వెళ్లే కాన్వాయ్ ని చూడగలిగితే ఇక పునర్జన్మ ఉండదు . అదికూడా ఒక చెరువు కట్టమీద దారి అయి ఒక వైపు నీళ్లు , ఒక వైపు పొలాలు మధ్యలో ఎడ్లబండ్ల వరుసను చూడగలిగితే ముక్కోటితీర్థాల్లో ముక్కోటిసార్లు మునిగినపుణ్యమని బసవోపాఖ్యానంలో ఎడ్ల బసవాచార్యులు సెలవిచ్చారు (ఈ పుస్తకమిప్పుడు అలభ్యం – ఎందుకంటే ఈ పుస్తకం లేదుకాబట్టి!).

ఉదయాన్నే ఎడ్లకు మేత పెట్టడం రాకెట్ సైన్సుకంటే పెద్దవిద్య . బండి కాడెను కింద దించి వెనుకభాగంలో ఒద్దికగా కూర్చోవాలి . మేతను రెండుఎడ్లకు వాటంగా అమర్చుకోవాలి . ఎడ్ల నోటి దగ్గర పెట్టాక అవితింటుంటే కొద్దికొద్దిగా లోపలికి అందివ్వాలి . గట్టిగా తోయకూడదు , అలాగని గట్టిగా పట్టుకోకూడదు . మేత అయిపోయేలోపు నిరంతరాయంగా అందివ్వాలి . తరువాత కాసేపు విశ్రాంతి ఇవ్వాలి . ఎడ్లు హాయిగా నాలుగు కాళ్ళు మడిచి అచ్చం లేపాక్షి బసవడిలానే కూర్చుంటాయి . అప్పుడవి నెమరువేసుకుంటాయి . అర్ధ నిమీలిత నేత్రాలతో తమలోతాము బ్రహ్మానందమనుభవించే మునుల్లా ఎడ్లు నెమరువేస్తూ అలౌకిక స్థితిలో ఉన్నప్పుడు చూస్తే గోహత్యా పాతకం కూడా మరుక్షణంలో మాయమవుతుందని ఎప్పటికీ ఎవరికీ దొరకని బసవోపాఖ్యానంలోనే చివర ఫలశ్రుతిలో ఉంది! తరువాత నాలుగు బిందెల కుడితి తాగి ఎడ్లు నిలుచుని సకల భువన భారాన్ని ఇప్పుడుపెట్టండి నామూపుమీద అని సవాలు విసురుతాయి .

ఎతిహాద్ డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ విమానాన్ని తలదన్నే ఇలాంటి ఎడ్ల బండిని నడపాలని నాకు చిన్నప్పుడు బలమయిన కోరిక . భూమికి జానెడు ఉండేవాడిని. వ్యవసాయం కులవృత్తి కాదు . లేపాక్షి ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య , చెరువు కట్ట పక్కన మా హై స్కూలు . వేసవిలో మధ్యాహ్నం దాకానే స్కూలు . ఎర్రటి ఎండలో స్కూలు ప్రాంగణం దాటగానే , మానాన్న స్టూడెంటు శరభయ్య కనిపించాడు . వాళ్ళపొలాలు మా స్కూలు పక్కనే . పండితుడయిన మా నాన్నను ఎంతగా గౌరవిస్తాడో వయసులో చాలా చిన్నవాడినయినా , పండిత పుత్రః . . . అయిన నన్ను కూడా శరభయ్య అంతే గౌరవిస్తాడు . అతను వేరుశెనగ పంట మోపులుకట్టి ఎడ్లబండికి ఎక్కిస్తున్నాడు . కాసేపు అక్కడే నిలుచుంటే బండిలో వెళ్లవచ్చని అనుకున్నా . కానీ ఆ మాట అడగలేకపోయా . ఈలోపు రెండో ఎడ్లబండి కూడా వచ్చింది . వెతకబోయిన తీర్థం ఎదురయినట్లు శరభయ్య ఏమీ ఆలోచించకుండా నాతో ఒకమాటన్నాడు .
స్వామీ ! నిన్ను ఈ బండిలో కూర్చోబెడతా . ఎడ్లు మా ఇంటిదాకా తీసుకెళ్తాయి . మీ ఇల్లు మా ఇంటి పక్కనే కదా , నువ్వక్కడ దిగిపో – అని . నేను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యా . నేను సమాధానం చెప్పేలోపే చేతిలో పుస్తకాలసంచి బండి కొయ్యకు తగిలించి , నన్ను ఎత్తి రథసారథి స్థానంలో కూర్చోబెట్టి , చేతికి చెర్నాకోలా ఇచ్చి డుర్రుర్ .. . అని ఇంకేదో ఒక రకమయిన ధ్వని చేశాడు శరభయ్య . ఎయిర్ బస్ విమానం కాక్ పిట్ లో కూర్చోబెట్టి ఇక వెళ్లు అన్నట్లుంది నా పరిస్థితి . బండిమీద కొండంత వేరుశెనగ పచ్చి పంట . ఎప్పుడూ తోలని ఎడ్ల బండి . నా భయాలు , అనుమానాలు , ఆందోళనలు , ఉక్కిరి బిక్కిరి…ఏమీ పట్టని ఎడ్లు మౌనంగా , గంభీరంగా మూడు కిలోమీటర్లు వాటికవిగా ప్రయాణించి సరిగ్గా శరభయ్య ఇంటి ముందు ఆగాయి . దిగరా నాయనా ! మా యజమానికి మీ నాయన తెలుగు వ్యాకరణం చెప్పినందుకు నిన్ను మోశాము , ఇక చాలు దిగి మీ ఇల్లు పక్కనే ఉంది పో ! అన్నట్లు చూశాయి ఎడ్లు . నన్నెవరో దించారు .

నా శక్తియుక్తుల మీద శరభయ్యకు ఇంతటి అతులిత అపార నమ్మకం ఉన్నందుకు శరభ శతకం రాసి ఋణం తీర్చుకుందామని ప్లాను వేశాను . బండితోలడానికి మనుషుల్లేనప్పుడు , పనిలో పొలాల్లోనే ఉండిపోవాల్సినప్పుడు శరభయ్య ఎడ్లకు సంకేతమిచ్చి సారథి లేకుండానే పంపిస్తే , అవి మనిషికంటే బుద్ధిగా దారి తప్పకుండా , అవసరమయితే నాలాంటివారికి దారిచూపుతూ ఇంటికి వస్తాయని తెలిసి శరభ శతకరచన ప్లాను అనివార్యంగా విరమించుకోవాల్సివచ్చింది . అయినా అదో మధురస్మృతి . ఇప్పటిలా సెల్ ఫోన్ చేతిలో ఉంటే ఒక పిక్కో వీడియో తిక్కో తీసేవాడిని – ఎద్దుమీద శుద్ధబుద్ధావతారం అన్న క్యాప్షన్ తో . ఎద్దు మెదడులో ఎన్ని జి పి ఎస్ లు ఉన్నాయో , ఎన్ని సెల్ఫ్ కంట్రోల్డ్ డైనమిక్ మెకానిక్స్ ఉన్నాయో నాకు తెలియదు . అందరూ హార్స్ పవర్ అంటూ గుర్రాన్ని ఆకాశానికెత్తారు కానీ , ఎద్దుపవర్ అని ఈ శక్తి సాంకేతిక టెర్మినాలజీని తిరగరాయాలని నా డిమాండు . హరప్పా మొహంజదారో లిపిలో ఉన్నది కూడా ముద్దులొలికే పెద్ద కొమ్ముల ఎద్దే .

ఒకానొక కార్తిక మాసంలో రెండు వారాల పాటు విజయవాడలో ఉన్నాను. ఒక్కరే ఉన్నట్లున్నారు…రేపు కార్తిక సోమవారం సాయంత్రం మా ఇంటికి రండి. పుట్టపర్తి వారి శివతాండవం పద్యాలు చెబుదురు కానీ...అలాగే మా ఇంట్లో భోంచేసి వెళ్లాలి అని నా శ్రేయోభిలాషి అయిన ఒక పెద్దాయన మొహమాట పెట్టారు. పద్యాలు వింటామని ఎవరయినా చెబితే…ఎంతదూరమయినా వెళుతుంటా. సాయంత్రం వెళ్లగానే ఇల్లంతా చూపించి ఆయన లైబ్రరీ రూములో నన్ను కూర్చోబెట్టి నా ముందు స్వీట్లు, కారప్పూస పెట్టారు. పద్యాలు పాడుతూ ఉన్నాను. ఆయన మైమరచి వింటున్నారు. కానీ నా మనసంతా ఆయన లైబ్రరీ రూము ముందు హాల్లో సోఫా ముందు ఉన్న ఎడ్ల బండి టీ పాయ్ మీదే ఉంది. ఇక భోజనానికి వెళదాం అనగానే…ఆ ఎడ్ల బండి టేబుల్ ఫోటో తీసుకుని…ఎక్కడ కొన్నారు? అని అడిగా.

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో చేయించి ఒక మిత్రుడి ద్వారా తెప్పించినది అని చెప్పారు. ఆ మిత్రుడు కూడా నాకు బాగా పరిచయమే. నేను కూడా తెప్పించుకుంటాను అని వివరాలు తీసుకున్నాను. బయటికి రాగానే ఆయనకు ఫోన్ చేసి ఎడ్ల బండి టీ పాయ్ కావాలని చెప్పాను. అలాగే అని అడ్వాన్స్ డబ్బు కూడా ఆయన జేబు నుండే చెల్లించారు. ఏడు నెలల నిరీక్షణ తరువాత ఒక రోజు మిత్రుడు ఫోన్ చేశారు. మీ ఎడ్లబండి విజయవాడ చేరింది. హైదరాబాద్ పంపలేకపోయాను. వచ్చి తీసుకెళ్లండి- అని. భద్రంగా ప్యాక్ అయి వచ్చిన ఎడ్ల బండి టేబుల్ ను అంతే భద్రంగా విజయవాడ నుండి హైదరాబాద్ లో ఇంటికి కారులో తెచ్చుకున్నా. ఇంటి ఎంట్రన్స్ సోఫా ముందు ఈ ఎడ్ల బండి టేబుల్ తో ఇంటికి ఏదో కొత్త అందం వచ్చినట్లు పులకింతగా ఉంది. కింద లేపాక్షి నందిలా జీవకళ ఉట్టిపడే బండి లాగే వీరవాసరం ఎడ్లు.

పెద్ద బండిలో ఉన్న ప్రతి అంశాన్ని పొదివి పట్టుకుని ఈ కళాకృతిని చేసిన వీరవాసరం కళాకారుడికి కృతఙ్ఞతలు చెప్పాను. రేటెంతో నాకు తెలియదు. దీన్ని తెప్పించిన నా మిత్రుడు ఎన్నాళ్లయినా డబ్బు తీసుకోకపోతే…నేనే ఇంతవుతుందేమో అనుకుని కొంత బలవంతంగా ఇచ్చాను. ఆయన చెల్లించిన దానితో పోలిస్తే నేనిచ్చింది ఖచ్చితంగా తక్కువే అయి ఉంటుంది.

ఆ మధ్య హంపీ వెళ్లాము. విరూపాక్ష గుడి ముందు తుంగభద్ర నదిలో తొట్టెలో తిరిగి పైకి రాగానే…రాతిగుహలో హంపీ ఏకశిలా రథం రాతి బొమ్మలు అమ్ముతున్న అబ్బాయి కనిపించాడు. ఉన్నవాటిల్లో పెద్ద రాతి రథం బొమ్మ కొని, తెచ్చి ఇంట్లో హాల్లో టీ పాయ్ మీద పెట్టి…హంపీ రాతి రథాన్ని లాక్కొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నట్లు మురిసిపోతోంది నా భార్య. ఇప్పుడు హంపీ ఏకశిలా రథం వైపు పరుగులు తీసే వీరవాసరం ఎడ్లు కూడా తోడయ్యాయి.

“బొమ్మను చేసి…
ప్రాణము పోసి…”
అని అన్నట్లు అన్నీ బొమ్మలే.
కొన్ని ప్రాణమున్నవి.
కొన్ని ప్రాణం లేనివి.

ప్రాణం లేని బొమ్మలకు ప్రాణం పెట్టి…ప్రాణం పోసే కళాకారుల సృష్టి కూడా బ్రహ్మ సృష్టికి తక్కువ కాదు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్