Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏడుపు స్వామ్యం

ఏడుపు స్వామ్యం

Venkaiah Naidu Gets Emotional As The Upper House is Being Disrupted:

“ఏడ్పు జీవలక్షణమట, ఏడ్వకున్న
కొట్టి ఏడ్పింతురట బిడ్డ పుట్టగానె,
ఎంత ఇష్టమొ నరజాతి కేడుపన్న,
అతని ఏడ్పున కసలైన యర్థమేమొ?”
-ఆత్రేయ పద్యం

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పుట్టిన ఆత్రేయ తెలుగునాట మనసున్న ప్రతివారినీ ఏడిపిస్తూనే ఉంటాడు. గుండె పగిలిపోవువరకు మనచేత ఏడిపిస్తాడు. గుండె ముక్కలయినా…ఆ ముక్కలు కూడా విడివిడిగా లెక్కలేని రూపాలుగా ఏడవాలంటాడు. గుండె ఏడ్చి ఏడ్చి కన్నీరు మున్నీరై పొంగిపోవాలంటాడు. తలచుకుని తలచుకుని ఏడవాలంటాడు. ఏమీ తోచక ఏడవాలంటాడు. ఉన్నది పోయినందుకు ఏడవాలంటాడు. లేనిది కోరి, దొరకక ఏడవాలంటాడు. మనసిచ్చి ఏడవాలంటాడు. మనసు శూన్యమై ఏడవాలంటాడు. మనసున్న మనిషికి సుఖముండదు కాబట్టి ఏడుస్తూనే ఉండాలని తీర్మానించాడు. ఏడుపులో ఆనందాన్ని వెతుక్కుని ఏడ్చి ఏడ్చి మొహం కడుక్కోమన్నాడు. ఆత్రేయ రచనలు అర్థమై రెండు తరాలు ఏడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఆత్రేయను చంపి పుట్టినవారే కాబట్టి అర్థం కాక…లేక ఎక్కడ అర్థమవుతుందోనని భయపడి ఏడుస్తూ ఉంటాం. అది వేరే విషయం.

ఏడుపు జీవ లక్షణమని ఆత్రేయ సిద్ధాంతీకరించాడు. బిడ్డ పుట్టగానే ఏడవకపోతే కొట్టి ఏడిపిస్తారని చెప్పాడు. అక్కడి నుండి అడుగడుగునా బతుకంతా ఏడుపే. మనుషులకు ఏడుపు అంటే చాలా ఇష్టమని ఆత్రేయ తేల్చేశాడు.

Venkaiah Naidu Gets Emotional :

అదే నెల్లూరు జిల్లానుండి ఎదిగి ఉపరాష్ట్రపతి అయిన ముప్పవవరపు వెంకయ్య నాయుడు రాజ్యసభ పేరోలగం మీద కూర్చుని ప్రత్యక్షప్రసారంలో వల వల ఏడ్చేశారు. ఒకేసారి అనేకభాషల్లో అంత్యప్రాసలు, ఆది ప్రాసలు, ముక్తపదగ్రస్తాలతో ధారాళంగా మాట్లాడగలిగిన, పంచులు విసరగలిగిన, మీడియాలో నిత్యం సంపాదకీయ వ్యాసాలు రాయగలిగిన…అంతటి వెంకయ్య నాయుడు గొంతు మూగబోయింది. భాషరాక ఏడుపు వచ్చింది. భావం గొంతులో సుడులు తిరిగి…కళ్లల్లో నీళ్లుగా ఉబికి వచ్చింది.

రాజ్యసభలో జరిగిన గొడవలకు ఆయన మనసు గాయపడినట్లుంది. అయితే అంతటి స్థానంలో ఉన్న వ్యక్తి ఏడిస్తే…దాన్ని ఎలా అనువదించుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అన్నదే పెద్ద ప్రశ్న. ఆయన బాధలో అర్థముంది. కానీ సమాజంలో కొత్త తరం చట్ట సభలను ఎలా చూస్తోంది? ఎంతవరకు పట్టించుకుంటోంది? ఇలాంటి ఉదంతాలకు ఎలా స్పందిస్తోంది? అన్నది కూడా లోతుగా చూడాల్సిన విషయం.

“ఏ కన్నీళ్ల యెనకాల
ఏముందో తెలుసుకో!”
అని కూడా ఆత్రేయే అన్నాడు.

ఒక ఉపరాష్ట్రపతి రాజ్య సభ చైర్మన్ హోదాలో నిండు సభలో కంట తడి పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో ఆ కన్నీళ్ల మీద జరగాల్సినంత చర్చ జరగకపోతే…ఎవరి ఏడుపు వారిదిగా మిగిలిపోతుంది. ఆ ఏడుపు అరణ్య రోదనగా మిగిలిపోతుంది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : తల ఎత్తి నిలిచిన ఒలింపిక్స్ హెడ్డింగులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్