ఎట్టకేలకు బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్య వివాదం కొలిక్కి వచ్చింది. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారి పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికి పీఠం దక్కింది. రెండు కుటుంబాల వారితో చర్చించాక ప్రత్యేకాధికారి చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటన చేశారు. కలిసికట్టుగా ఉంటామని రెండు కుటుంబాలవారు రాతపూర్వక హామీనిచ్చారని ఆజాద్ తెలిపారు. త్వరలోనే ఘనంగా పీఠాధిపతి ప్రమాణస్వీకారం ఉంటుందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెల్లడించారు.
ఉత్తరాదికారిగా మొదటి భార్య రెండవ కుమారుడు వీరభద్ర స్వామి వ్యవహరిస్తారు. రెండో భార్య కుమారుడు గోవింద స్వామికి భవిష్యత్తులో పీఠం బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దీనితో వారు వెనక్కు తగ్గారు.
మఠాధిపతి ఎంపికపై గత రెండునెలలుగా కుటుంబ సభ్యుల మధ్య వివాదం చెలరేగుతోంది. ఇటీవల మరణించిన మఠాధిపతి వెంకటేశ్వర స్వామి మొదటి భార్య, రెండవ భార్య సంతానం తమకే బాధ్యతలు దక్కాలని పట్టుబడుతున్నారు. దీనిపై పలువురు పీఠాధిపతులు వచ్చి సయోధ్యకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆఖరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగి కుటుంబ సభ్యులతో విడివిడిగా చర్చలు జరిపారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యెక అధికారిగా చంద్ర శేఖర్ ఆజాద్ ను నియమించారు.
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తో పాటు ఆజాద్ నేటి ఉదయం నుంచి ఈ సమస్య పరిష్కారానికి పలు దఫాలుగా కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు.