Victory Venkatesh:
తెలుగు సినిమా చరిత్రను గురించి చెప్పుకోవాలంటే .. అందులో తప్పకుండా రామానాయుడు గురించిన కొన్ని పేజీలు ఉంటాయి. నిర్మాత అంటే కేవలం డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు చూసేవారు మాత్రమే అనుకోకుండా, ప్రతి విషయాన్ని ఆయన దగ్గరే ఉండి చూసుకునేవారు. సినిమా కోసం ఖర్చు చేసిన ప్రతి పైసా తెరపై కనిపించేలా .. ప్రతి పైసాను అవసరానికి మాత్రమే ఖర్చు చేసేలా ఒక ప్రణాళిక బద్ధంగా ఆయన తన కెరియర్ ను కొనసాగించారు. తన తరువాత ఇండస్ట్రీకి వచ్చిన నిర్మాతలకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు.

సురేశ్ బాబును నిర్మాతగా మార్చిన ఆయన, వెంకటేశ్ ను హీరోగా ప్రోత్సహించారు. విదేశాల్లో చదువు పూర్తయ్యేవరకూ వెంకటేశ్ ను ఆయన సినిమాల వైపు రానీయలేదు. అందువల్లనే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం ఒక్క ‘ప్రేమ్ నగర్’ సినిమాలో మాత్రమే వెంకటేశ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. ఆ తరువాత ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చింది హీరోగానే.నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్న రామానాయుడికి, అప్పటి హీరోల డేట్స్ కోసం వెయిట్ చేయవలసిన సందర్భాలు వచ్చాయి. దాంతో తన ఫ్యామిలీ నుంచి ఒక హీరో ఉండాలనే ఆలోచనతో ఆయన వెంకటేశ్ ను రంగంలోకి దింపారు.

అలా విదేశాల నుంచి రాగానే వెంకటేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ, తన సొంత బ్యానర్లో ఆయన ‘కలియుగ పాండవులు’ సినిమాను నిర్మించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1986లో వచ్చిన ఈ సినిమా, సూపర్ హిట్ అయింది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా ఈ సినిమా యూత్ లోకి దూసుకుపోయింది. ఆ తరువాత వచ్చిన ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాతో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యారు. ఇక నటుడిగా ఎవరైనా తమని తాము నిరూపించు కోవాలనుకునేవారు, కె విశ్వనాథ్ దర్శకత్వంలో చేయడానికి ఉత్సాహపడుతుంటారు.

అలాంటి అవకాశం కెరియర్ తొలినాళ్లలోనే వెంకటేశ్ కి దక్కింది. విశ్వనాథ్ తో కలిసి చేసిన ‘స్వర్ణకమలం’ సినిమా, క్లాస్ ఆడియన్స్ నుంచి వెంకటేశ్ కి మంచి మార్కులు దక్కేలా చేసింది. ఇక ‘ప్రేమ’ సినిమాలో ఆయన మరింత పరిణతిని కనబరిచారు. 90వ దశకం వెంకటేశ్ కెరియర్లో స్వర్ణయుగం వంటిదని చెప్పుకోవాలి. ఈ దశకంలో ‘బొబ్బిలి రాజా’ నుంచి ఆయన జోరు మొదలైంది. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో, దివ్యభారతితో కలిసి ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాను మ్యూజికల్  హిట్ గా నిలబెట్టింది. ఈ సినిమాతో వెంకటేశ్ మాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పట్లో ఇది బ్లాక్ బస్టర్ కేటగిరీలోకి వస్తుందనే చెప్పుకోవాలి.

ఇక ఆ తరువాత వెంకటేశ్ ఒక వైపున రీమేకులను .. మరో వైపున స్ట్రైట్ కథలను చేస్తూ దూసుకుపోయారు. తనకంటూ ఒక స్టైల్ .. తనదైన మేనరిజంతో చెలరేగిపోయారు. శత్రువు .. కూలీ నెం.1 .. చంటి .. సుందరకాండ .. అబ్బాయిగారు .. ఇలా ఘనవిజయాలను అందుకుంటూ, తన తోటి హీరోలకు గట్టిపోటీనే ఇచ్చారు. లవ్ .. యాక్షన్ ..  ఎమోషన్ .. కామెడీ .. ఇలా వెంకటేశ్ ఏదైనా అద్భుతంగా పండించగలడనడానికి నిదర్శనంగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ..  క్షణక్షణం .. మల్లీశ్వరి .. తులసి .. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలు కనిపిస్తాయి.

తను ఏ కథను ఎంచుకున్నప్పటికీ, ఆ కథలో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండేలా వెంకటేశ్ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అందువల్లనే అందరూ కూడా వెంకటేశ్ ను తమ హీరోగా భావించారు .. విక్టరీనే ఆయన ఇంటిపేరుగా మార్చారు. వెంకటేశ్ సినిమాల ద్వారా చాలా మంది కొత్త కథానాయికలు తెలుగు తెరకి పరిచయమయ్యారు.  ఆ జాబితాలో టబు .. దివ్యభారతి .. గౌతమి .. ప్రేమ .. ఆర్తి అగర్వాల్ .. ప్రీతీ జింతా .. కత్రినా కైఫ్ .. అంజలా జవేరి .. తదితరుల పేర్లు కనిపిస్తాయి.

వెంకటేశ్ తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా సౌందర్య కనిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు వరుస విజయాలను అందుకున్నాయి. హిట్ పెయిర్ గా ఈ అందాల జంట మంచి మార్కులను అందుకుంది. ఆ తరువాత స్థానంలో ఆయన జోడీగా మెప్పించిన నాయిక మీనా అనే చెప్పాలి. వీరి కాంబినేషన్లోను మంచి హిట్లు ఉన్నాయి. దశాబ్దాలుగా తన స్థానాన్ని కాపాడుకుంటూ వెంకటేశ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. యువ కథానాయకులతో సమానంగా వరుస సినిమాలను వదులుతున్నారు.

ఇప్పటికీ ఆయనను అభిమానించేవారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎప్పుడు చూసినా వెంకటేశ్ చాలా కూల్ గా కనిపిస్తారు. అనవసరసమైన విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోరు. సాధ్యమైనంత వరకూ ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా ఆయన ఎంత మాత్రం వెనుకాడరు. తెలుగు తెరపై .. తెలుగు ప్రేక్షకుల హృదయాలపై ఆయన తనదైన ముద్రవేశారు. అలాంటి వెంకటేశ్ పుట్టిన రోజు నేడు .. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో విజయాలను అందుకోవాలని మనసారా కోరుకుందాం.

వెంకటేష్  (జన్మదిన ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : నేనెప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించను : వెంకటేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *