Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమూర్తీభవించిన వచనం

మూర్తీభవించిన వచనం

Writing Skills: జర్నలిజంలో నిర్వచనాలకు అందనంత వచన సౌందర్యానికి ఆస్కారముందని నాకు మొదట చూపించినవారు వేంకటేశ మూర్తి.  మా హిందూపురం పక్కన సేవామందిర్ ఆయన సొంతూరు. ఎం ఏ తెలుగు చేసి జర్నలిజంలోకి వచ్చారు. నేను హిందూపురంలో ఆంధ్రప్రభ విలేఖరి. ఆయన బెంగళూరు ఆంధ్రప్రభ డెస్క్ లో ఉప సంపాదకుడు. బెంగళూరు క్వీన్స్ రోడ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్యాలయంలో గోడ కిటికీ పక్కన డెస్క్ లో ఆయన ఎదురు సీట్లో కూర్చుని…ఎక్స్ ప్రెస్ ఎదురుగా ఉడిపి హోటల్లో సాంబారులో బోండాలు అద్దుకుని తింటూ…కూర్గ్ కాఫీ తాగుతూ…మీలాగా ఎప్పటికైనా తెలుగులో రాస్తాను సార్! అని మూర్తి సార్ తో అనేక సార్లు శపథం చేశాను.

మా నాన్నంటే ఆయనకు అపారమైన గౌరవం. దాంతో దొరికిన చనువు వల్ల చాలాసార్లు ఆయనకు పాఠాలు చెప్పడానికి కూడా సాహసించేవాడిని. “మీ నాయనే పండితుడు. నువ్ కాదు. నువ్ పండిత పుత్రుడివి… అంతే!” అని నా తోక మొదట్లోనే కత్తిరించారు.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ అత్యధిక వికెట్లు తీసుకుని రికార్డు సృష్టించినరోజు…డ్రెస్సింగ్ రూములో సహచర క్రీడాకారులు కేరింతలు కొడుతుండగా కపిల్ దేవ్ జాతీయ జెండాను గౌరవంగా, పులకింతగా భుజాన మోస్తున్న ఫొటోతో “మువ్వన్నెల జెండా మకుటమైనవాడా!” అని మూర్తి సార్ మొదటి పేజీలో ఒక క్రీడా వార్త రాశారు. ఒకసారి చదివితే తనివి తీరక…పదిసార్లు చదివాను. నోటికొచ్చేసింది. కపిల్ దేవ్ తీసిన వికెట్లకంటే పదును. వేగం. గర్వం. ఆనందం. పులకింత. పదాలతో ఆడుకోవడమంటే ఇది కదా! అని వెంటనే మూర్తి సార్ కాళ్లు పట్టుకున్నా. అక్షరాలను బంతులను చేసి పాఠకుల మీదికి స్పిన్ వేసినట్లు…ఇలా రాయడం నాక్కూడా నేర్పండి సార్! అని వేడుకున్నా.

నువ్ చానా పెద్దోడివప్పా! నాకే పాఠాలు చెప్తున్నావు. నీకు చెప్పేంత ధైర్యం నాకెక్కడిది? అని సార్ నా అజ్ఞానాన్ని అలాగే పరిరక్షించారు. ట్యూషన్ చెప్పకపోతే పోనీ…ఆయన్ను కాపీ కొడితే ఆ విద్య వచ్చేస్తుంది కదా! అనుకుని కొన్నేళ్లు ప్రయత్నించి…విఫలమయ్యా.

కర్ణాటకలో ప్రఖ్యాత జోగ్ జలపాతానికి రంగు రంగుల విద్యుత్ దీపాలు తొలిసారి అమరిస్తే-
“అసలే అది జోగ్ జలపాత ధవళిమ. దానికి కాంతిపుంజాల స్పర్ధా సముజ్వల సన్నివేశం తోడయ్యింది”
అని మూర్తి సార్ ఫోటో క్యాప్షన్ రాశారు.

ఎండిన ఒక చెరువులో ఒక మూల చెలమలో నీళ్లు తోడుకుంటున్న దృశ్యానికి-
“ఆవిరైన ఆశల చెలమలో కన్నీటి వేట”
అని క్యాప్షన్ రాశారు.
ఫోటో కంటే ఆయన రాసే క్యాప్షన్ నన్ను వెంటాడేది. వార్త రాస్తే తెలుగు వాక్యంలో ఇంత అందం ఉందా! అనిపించేట్టు రాస్తారు. వ్యాసం రాస్తే ఎదురుగా మనిషితో మాట్లాడుతున్నట్లు రాస్తారు.

ఆయన రాసిన చాలా వార్తలు నాకు ఇప్పటికీ నోటికి వచ్చు. అంత అందమైన, ఆర్ద్రమైన, హొయలుపోయే శైలి. ఆస్ట్రేలియా క్రికెటర్ బోర్డర్ మీద ఆయన రాసిన క్రీడా వార్త నా దృష్టిలో కృష్ణశాస్త్రి కవితకు ఏమాత్రం తక్కువ కాదు. చాలా తేలికైన పదాలతో పాఠకుడిని పదహారణాల తెలుగులో ముంచి తేలుస్తారు.

తరువాత ఇంగ్లీషు మీడియాలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసి పదవీ విరమణ చేసి…బెంగళూరులో స్థిరపడ్డారు.

జర్నలిస్టుగా నేను ఎందరి దగ్గరో పనిచేశాను. నా దగ్గర ఎందరో పనిచేశారు. కానీ మూర్తి సార్ లా నా రాతలను ఇంకెవరూ ప్రభావితం చేయలేకపోయారు. ముప్పయ్యేళ్లుగా మూర్తిసార్ మూర్తీభవించిన వచనం నాకు పాఠం చెబుతూనే ఉంది.

మూర్తీభవించిన సంస్కారంతో మూర్తి సార్ నన్ను విమర్శించినంతగా బహుశా ఇంకెవరూ విమర్శించి ఉండరు.

ఒక రాత్రి వేళ అర్జెంట్ న్యూస్ ఐటెం అని బెంగళూరు వెళ్లాను. మరో అరగంటలో ఎడిషన్ ప్రింటింగ్ మొదలు కావాలి. ప్రయాణంలో బస్సులో రాశాను సార్ ఇదిగోండి ఐటెం అని సార్ చేతికి ఇచ్చాను. చదివి చిరునవ్వుతో “అరెరె! తెలుగులో రాసి ఉంటే ఎడిషన్ క్లోజ్ అయ్యేలోపు పెడతా ఉంటిమే!” అన్నారు. (నా తెలుగు అలా అఘోరించిందని అర్థం)

ఒకసారి నాలుగు పేజీల స్క్రిప్ట్ చేతికిచ్చాను. “కత్తిపట్టిన ప్రతివాడూ యోధుడే! కలం పట్టిన ప్రతివాడూ జర్నలిస్టే! ఏమన్నా అంటే ఆత్మాభిమానాలు పొడుచుకుని వస్తాయి. ఈ నాలుగు పేజీలను అయిదు లైన్లలోకి నువ్వే కుదించి ఇయ్యి” అన్నారు. ఇది అలా కుదిరేది కాదు…బాగా ఎడిట్ చేస్తేనే ఇంతయ్యింది అన్నాను. ఎలా కుదురుతుందో వెంటనే నోటికి చెప్పారు. నోరుమూసుకుని ఆయన చెప్పినట్లు రాసి…ఇచ్చి వచ్చాను.

ఒకే మాటలతో సంపాదకీయానికి ఒక భాష. వార్తకు ఒక భాష. ఫోటో క్యాప్షన్ కు ఒక భాష. ఆటల వార్తకు ఒక భాష. ఏ సందర్భానికి తగినట్లు ఆ భాష- ఇంత అందంగా, సరళంగా, వేగంగా ఎలా రాస్తారు సార్? అని కొన్నివేల సార్లు అడిగాను.

“ఏముందప్పా!
కామన్ సెన్స్”
అన్నదే ప్రతిసారీ సమాధానం.

అదీ సంగతి!
“అదొక్కటే కదా నాకు లేనిది!”
అయితే ఈ జన్మకు మూర్తి సార్ మూర్తి సారే. నేను నేనే!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్