Pallavi Mania: సాయిపల్లవి – రానా కాంబినేషన్లో దర్శకుడు వేణు ఊడుగుల ‘విరాటపర్వం‘ సినిమాను రూపొందించాడు. సురేశ్ బాబు –  సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో సాయిపల్లవి .. ‘వెన్నెల’ అనే గ్రామీణ యువతి పాత్రను పోషించింది. దర్శకుడు ఈ కథపై .. ఈ పాత్రపై ఎంతగా కసరత్తు చేశాడనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. వెన్నెల చిన్నప్పటి నుంచి యుక్తవయసుకి వచ్చేయడాన్ని ఆయా దశలలోని ముఖ్యమైన ఘట్టాలతో వేణు ఒక్క పాటలోనే ఆవిష్కరించిన తీరు బాగుంది.

ఇక వెన్నెల స్వభావం ఎలాంటిదనే విషయాన్ని ఆమె బాల్యంలోనే దర్శకుడు చెప్పేశాడు. తాను అనుకున్నది సాధించేవరకూ ఆమె నిద్రపోదు. తాను చేయదలచుకున్న పని విషయంలో ఎలాంటి ఆటంకాలు .. అవమానాలు ఎదురైనా ఆగిపోదు అనే విషయం, తాను ప్రేమించిన కామ్రేడ్ ను కలుసుకోవడానికి ఆమె చేసే జర్నీ అద్దం పడుతుంది. ఎండా .. వానా .. చీకటి ఇవేవీ ఆమె ప్రయాణాన్ని అడ్డుకోలేకపోతాయి. దీపాలు వెలిగించడం మాత్రమే తెలిసిన ఆమె, తన ప్రేమ కోసం బాంబులు అంటించడానికి సిద్ధపడుతుంది.

తాను మనసిచ్చినవాడు ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్నాడని తెలిసి .. అక్కడ సుఖశాంతులు ఉండవని తెలిసి .. రాత్రివేళనే పట్టపగలుగా భావించి తిరగవలసి వస్తుందని తెలిసి కూడా వెన్నెల ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ  విషయంలో ఎవరెన్ని చెప్పినా ఆమె తన మనసు మార్చుకోదు. చివరికి ఆమె ప్రేమించిన కథానాయకుడు చెప్పినా వెనక్కి తగ్గదు. అవమానాలు .. అనుమానాలు .. అపార్థాలు దాటుకుని ఆమె తన ప్రేమను నిజం చేసుకోవడానికే చివరి వరకూ నిలబడుతుంది. మొదటి నుంచి  చివరి వరకూ వెన్నెల పాత్ర వ్యక్తిత్వాన్ని కాపాడటానికి దర్శకుడు చేసిన ప్రయత్నాన్నీ .. ఆ పాత్రలో ఇష్టంగా ఇమిడిపోయిన సాయిపల్లవిని అభినందించకుండా ఉండలేం.

Also Read : సాయిపల్లవి అభినయ విన్యాసమే ‘విరాటపర్వం’ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *