Friday, November 22, 2024
Homeసినిమాగానం కోరుకున్న గీతం పేరు వేటూరి

గానం కోరుకున్న గీతం పేరు వేటూరి

Veturi: తాను రాసిన పాటలా.. వేణువై వచ్చాడు భువనానికి.. సరిగ్గా ఇదేరోజు 2010, మే 22న గాలైపోయాడు గగనానికి! తాను గాలిలో కలిసి పోయినా.. ఆయన రాసిన ప్రతీపాట రూపంలో.. పాట బతికున్నంత కాలం.. తెలుగు భాష ఉన్నంతకాలం.. సాహిత్యాభిమానులున్నంత కాలం.. వీనులవిందువైన వేణువల్లే.. పిల్లతెమ్మెర గాలై పలకరిస్తూనే ఉంటాడు.. ప్రభాకరుడై ప్రతీ ఇంటా టీవీలోనో, మోబైల్ లోనో, రేడియోలోనో ఉదయిస్తూనే ఉంటాడు ఆ వేటూరి. ఆ సూర్యుడికి ఉదయాస్తమయాలున్నట్టే.. వేటూరి అనే భౌతిక రూపానికీ.. పుట్టుకగిట్టుకలుండవచ్చేమోగానీ.. ఆ పాట మాత్రం ఏనాటికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కరిగిపోని సూరీడే!

అడవిరాముడులో ఆయనే రాసినట్టు కృషి ఉంటే మనుషులు రుషులవుతారని.. మానసవీణ మీటి తన పాటతో మధుమాసాన్ని సృష్టించిన కృషీవలుడు వేటూరి. ఝుమ్మంది నాదం అంటూ.. ఆయన పాట విన్న ప్రతీ పాదాన్నీ సై అనేలా చేసినా.. కొమ్మకొమ్మకో సన్నాయంటూ కోటిరాగాలను తన పదాల్లో పలికించినా.. ఉరిమే ఉరుములు మెరిసే మెరుపులతో పరవశాన శిరస్సునూగించినా.. వెన్నెల్లో గోదారి అందాలను వర్ణించినా.. కిన్నెరసానికి వెన్నెల పైటేసినా.. ఆకాశాన విహంగమై ఎగిరే ఓ పక్షిలా.. అత్యంత లోతైన సంద్రమంతా తనదేనన్నట్టుగా ఈదే ఓ చేపపిల్లలా.. ఆ కలం స్వేచ్ఛకో పర్యాయపదం.

మర్మస్థానం కాదది నీ జన్మస్థానమంటూ.. దుర్యోధన, దుశ్శాసన దుర్వినీత లోకాన్ని ప్రతిఘటించిన కలమే… కోమలమైన కొరమీనుకు సొరచేపకు శోభనం చేసింది. అబ్బ నీ తీయనీ దెబ్బ అంటూ హోయలు పోయిన శ్రీదేవిని.. యమహో నీ యమా యమా అందం అంటూ ఆటపట్టించిన మెగాస్టార్ స్టెప్పుల మెరుపులకు ఉత్ప్రేరకం ఆ పాట! వింటే కర్పూరవీణలా కరిగిపోయే గీతమైనా.. పావురానికి, పంజరానికి ముళ్ళు పెట్టే మూఢలోకాన్ని పట్టిచూపే గేయమైనా.. ఆకాశాన సంధ్యవేళ సూర్యుడుండడని.. తెల్లవారితే చందమామకు రూపముండదని.. నగ్నసత్యాలను అందంగా ప్రెజెంట్ చేసిన కలం వేటూరి!! రాలిపోయే పువ్వా రాగాలెందుకే తోటమాలిని తోడు లేనులే అంటూ నర్మగర్భంగా వైరాగ్యాన్ని వెల్లడించి.. స్నేహితుడా స్నేహితుడా అంటూ రహస్య స్నేహితుడితో అంతరంగాన్ని విప్పి… మాండురాగాన్ని మదనమోహినీ చూపులో బంధించి.. తోడిరాగంలో శశివదనే అంటూ ప్రేమలోకి దింపే పాట వేటూరి. కంచిపట్టున మధురమధురతర మీనాక్షిని పలకరించి.. గోదారిలా ఉప్పొంగి.. మంగళంపల్లి పరిభాషలో గానం కోరుకున్న గీతం పేరు వేటూరి.

Veturi Songs

పయనీరన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరేనని.. తానాయనకు కేవలం కొనసాగింపు మాత్రమేనని సిరివెన్నెల కురిపించిన సీతారాముణి మాటై.. వేటూరి వారి పాటకు సమవుజ్జీ ఎవరని సరస్వతిని చేరి కోతితే.. తన పాటేశ్వరుడికి వుజ్జీ వేటూరేనని సాక్షాత్తు సరస్వతే నవ్వుతూ చెప్పిందన్న ముళ్లపూడి ప్రశంసైనా.. అర్హత అనే మాటకు మాడల్ గా నిల్చిన పాళీ వేటూరి!!

ఆ కలానికి… ఎన్నో గళాలకు బలమైన ఆ పదానికి… తెలుగు పాటకు సృజనాత్మక రూపుతో వన్నె తెచ్చిన ఆ అక్షరయజ్ఞానికి… సంప్రదాయ పాటలకు పదనిసలనద్దిన ఆ వాక్యనిర్మాణానికీ… మొత్తంగా తెలుగుజాతి కీర్తిపతాకైన వేటూరికి ఆయన దివికెగిసిన రోజున ఓసారి యాజ్జేసుకుంటూ.. నివాళులతో..

రమణ కొంటికర్ల.

Also Read : కన్నీటి జలపాతాల్లో…ఆగకసాగే బతుకుగానం..

RELATED ARTICLES

Most Popular

న్యూస్