Sunday, January 19, 2025

పెన్నేటి పాట-6

నా అన్నవాళ్ళెవరూ లేని రంగన్న బతుకులోకి గంగమ్మ ప్రవేశించింది. గంగమ్మది కూడా నిరుపేద కుటుంబం. ఆమె అక్క-బావ కూలి పనులు చేసుకుంటూ బతికేవారు. బావ ఉన్నన్ని రోజులు ఎలాగో గుట్టుగా బతికారు. ఎద్దు పొడిచి బావ చనిపోగానే వారికి కష్టాలు చెప్పి వచ్చేవి. గడ్డిమోపులు అమ్ముతూ అక్క ఉన్నన్నాళ్ళు ఎలాగో గడిచిపోయేది. తనలా తన చెల్లి కష్టపడకూడదని అక్క చేయని ప్రయత్నం లేదు. భర్త పోయిన దిగులు అక్కను కుంగదీసింది. తను కూడా పోతే గంగమ్మ దిక్కులేనిదవుతుందని… కాయకష్టం చేసుకుని బతికే రంగన్నను వెతికి పట్టుకుని…పెళ్లి చేసి…కన్ను మూసింది అక్క.

రంగువెలిసిన చీర అయినా గంగమ్మ కడితే అందంగా ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా గంగమ్మ పెదవి మీద చిరునవ్వు చెదిరిపోదు. చేతిలో అల్యూమినియం కడియాలే బంగారు కడియాల్లా మెరుస్తూ ఉంటాయి. చెవిలో బెండు కమ్మలు నిగనిగలాడుతూ ఉంటాయి. జడలో చెండు మల్లె, కొండ గోగు పెట్టిందంటే గంగమ్మ అందమే అందం.

ఇంట్లో ఉప్పు డబ్బాలో ఉప్పు అయిపోయి ఉండవచ్చు కానీ…గంగమ్మ మనసులో కర్పూర పరిమళాలు తరిగిపోవు. ఊళ్లో అందరి తలలో నాలుక గంగమ్మ. ఊరందరూ తన సొంత బంధువులే అనుకుని అందరిలో కలిసిపోతూ ఉంటుంది. నిప్పులా బతుకుతుంది. అమ్మానాన్న లేరు. అక్కా బావ ఈమధ్యే పోయారు. గంగమ్మకు రంగన్నే సమస్తం. రంగన్నకు గంగమ్మే సమస్తం.

వారి ప్రేమాభిమానాలు, ఓర్పులను కొలవడానికి కొలమానాలు చాలవు. కష్టాలు బాకులుగా గుండెల్లో గుచ్చుకుంటున్నా వారి ప్రేమైక ప్రయాణంలో వసంతాల వనాల పూల పవనాల విలాస విహారాలు అయ్యేవి.

ఆ ఊళ్లో ఆలుమగల అనురాగానికి రంగన్న- గంగమ్మలే ఆదర్శం. రంగన్నను గంగన్నా! అని; గంగమ్మను రంగమ్మా! అని ఊరి జనం పిలవడంలో తడబాటు మాట ఎలా ఉన్నా…వారి దాంపత్య బలిమిని కూడా తెలియజేస్తోంది.

గంగమ్మ నలనల్ల గాజుల రవళిలో, గంగమ్మ అర నీలి కనుల మగతలో రంగన్నకు రాగుల అంబలే పంచ భక్ష్య పరమాన్నం.

వారి మధ్య చూపులే ఎక్కువ-మాటలుండవు.
వలపులే ఎక్కువ- వాంఛలు ఉండవు.
పని తొందరలే ఎక్కువ- సరసాలు ఉండవు.

తెల్లవారకముందే కొడవలి, పగ్గం పట్టుకుని గడ్డి కోసుకురావడానికి రంగన్న బయలుదేరతాడు. ఊరికి దూరంగా ఉన్న ఆ కొండే ఊరి జనానికి అన్నిరకాలుగా అండా దండ. నాలుగు గడ్డి మోపులు నెత్తిన మోసుకొస్తే ఆ పూటకు మెతుకులకు సరిపడా నాలుగు పైసలు చేతిలో పడతాయి. ఉదయం కూలి పని మొదలు పెట్టేలోపు గడ్డిమోపులతో వచ్చేయాలి. వెయ్యేళ్లకు ఒక్క వాన. కావాల్సినంత పచ్చి గడ్డి ఎక్కడ దొరుకుతుంది? చినుకు పడినప్పుడు మాత్రం కొండ పచ్చని పట్టు చీర కట్టుకుని అందంగా కనపడుతుంది. ఎండు గడ్డి పుల్లను కూడా వదలకుండా తెచ్చుకోవాల్సివస్తోంది.

రేపు- పెన్నేటి పాట-7
“బతుకు చిత్రం”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్