Monday, January 20, 2025

పెన్నేటి పాట-2

Multitalented: విద్వాన్ విశ్వం (1915-1987) జీవితంలో ఉద్యమం, రాజకీయం, సాహిత్యం, జర్నలిజం పాయలు కలగలిసి ఉంటాయి. పుట్టింది అనంతపురం జిల్లా తరిమెలలో. ఆయన అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. తొలిదశలో విశ్వరూపశాస్త్రి పేరుతో కొన్ని రచనలు అచ్చయ్యాయి. అయితే పేరులో కుల ప్రస్తావన ఉండకూడదని విశ్వం అని మార్చుకున్నారు.  తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్ రెడ్డి సహచర్యంలో కమ్యూనిస్టుగా జీవితం ప్రారంభించి…సమరయోధుడిగా జైలు జీవితం గడిపినవాడు. బాల్యం నుండే సంప్రదాయ పద్ధతిలో సంస్కృతం నేర్చుకున్నవాడు. కర్నూలు, ప్రొద్దుటూరు, మద్రాసుల్లో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, తర్కశాస్త్రాలు అభ్యసించినవాడు. దత్తమండలం(సీడెడ్) అన్న అవమానకరమైన పేరును తొలగించి “రాయలసీమ” అని సముచితమైన నామకరణం చేసిన అనేక భాషల్లో పండితుడు, అప్పుటి అనంతపురం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చిలుకూరి నారాయణరావు దగ్గర శిష్యుడిగా తనను తాను మలచుకున్నవాడు. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేసినవాడు. ప్రాచీన సంస్కృత కావ్యాలను ఆధునిక తరానికి అందజేయడానికి వీలుగా అద్భుతమైన అనువాదాలు చేసినవాడు. జర్నలిస్టుగా రాసిన ప్రతి అక్షరంలో విద్యుత్తును, విద్వత్తును ప్రసరింపచేసినవాడు.

విశ్వం రచనలు:
విరికన్నె (కావ్యం); ఆత్మసాక్షి (కవిత్వం); ప్రేమించేను (నవల); పెన్నేటిపాట (కావ్యం); ఒకనాడు (కావ్యం); నాహృదయం (కావ్యం); పాపం; రాతలూ గీతలూ; సమీక్ష; లెనిన్; స్టాలిన్; స్వతంత్రం; మహాశిల్పి; మహాసంకల్పం; అదీ రష్యా; స్వతంత్రం ఏం చేయటం; ఫాసిజం దాని ధ్వంసం; రష్యా యుద్ధకవులు; రానున్న సంక్షోభం; సత్యభామ; ప్రథమ ప్రేమ; ధర్మదుర్గం; పొద్దుతిరిగింది; స్వస్తిశ్రీ; కచదేవయాని; ద్వేషం; దురాక్రమణ; ఇరాన్; ఇండియా; ఇండోనేషియా; వియత్నాం; నీడలు – జాడలు; విక్రమోర్వశీయము (రేడియో నాటకం); నాగానందము (రేడియో నాటకం); యుద్ధం మాకొద్దు (రేడియో నాటకం); ఏమి చెయ్యడం?

సంస్కృతం, ఇంగ్లీషు నుండి తెలుగు అనువాదాలు:-
కథాసరిత్సాగరం కథాలహరిని 12 సంపుటాల్లో ఆంధ్రీకరణం; కాదంబరి (బాణుడు); కిరాతార్జునీయం (భారవి); దశకుమారచరిత్ర (దండి); మేఘసందేశం (కాళిదాసు); రఘువంశము (కాళిదాసు); కుమార సంభవము (కాళిదాసు); శిశుపాలవధ (మాఘుడు); రాజతరంగిణి (కల్హణుడు); మానవుడు (రోమారోలా నవల); నేటి భారతదేశం (రజనీ పామీదత్); ఫాసిజం; భూమి (ఓప్లే హార్డీ నవల); వీడ్కోలు; కర్ణకుంతి; ముక్తకములు; చేకోవ్ కథలు; గోర్కీ కథలు; శిశు హృదయము; శిశు రహస్యము; యుద్ధానంతర ఆర్థిక పరిణామాలు; బిల్హణీయము; తెలుగు అధర్వ వేదసంహిత[1]; పూలచెట్లు[2]; రష్యా యుద్ధకథలు; పేదరాలు (కథాసంకలనం); విలాసిని (కథల సంపుటి); ప్రజావిరోధి (నాటకం)

జర్నలిస్టుగా ఆయన రాసిన కాలమ్స్:-

* విశ్వభావన – శ్రీసాధన పత్రిక 1938-1939
* తెలుపు-నలుపు – ఆంధ్రప్రభ వారపత్రిక 1952-1959
* అవీ-ఇవీ – ఆంధ్రపత్రిక దినపత్రిక 1958-1959
* ఇవ్వాళ – ఆంధ్రజ్యోతి దినపత్రిక 1960-1962
* టీకా-టిప్పణి – ఆంధ్రజ్యోతి దినపత్రిక
* మాణిక్యవీణ – ఆంధ్రప్రభ దినపత్రిక 1962-1966, ఆంధ్రప్రభ వారపత్రిక 1967-1987

ఒక మనిషి జీవితకాలంలో ఇన్ని చదవగలడా? చదివినా ఇన్ని రాయగలడా? అని ఆశ్చర్యపోవాల్సిన ఒకానొక అద్భుతం విద్వాన్ విశ్వం. ప్రఖ్యాత స్వతంత్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు విద్వాన్ విశ్వంను చిలుకూరి వారి దగ్గరికి (1932లో) తీసుకెళ్లి “మీకో బంగారు ముద్దను తెచ్చాను…ఏమి చేసుకుంటారో చేసుకోండి” అని శిష్యుడిగా కూర్చోబెట్టారు. అప్పటికి విశ్వం వయసు 17 ఏళ్లు. నిజంగానే బంగారు ముద్దను చిలుకూరి వారు కరిగించి, ఆభరణాలు చేసి, నగిషీలు దిద్ది…లోకానికి మణిహారంగా ఇచ్చారు.

పాశ్చాత్యపు వామపక్ష ఆలోచనలను- భారతీయ సాహిత్యపు లోచనాన్నీ కలిపి చూసిన సమన్వయవాది. ఛాందసమెరుగని సంప్రదాయవాది. ఆవేశం లేని ఆధునికవాది. మనసున్న మానవతావాది. జీవిత చిత్రణలో, భాషలో, భావ వ్యక్తీకరణలో రాయలసీమకు ప్రాతినిథ్య కావ్యం అనదగ్గ “పెన్నేటి పాట” విశ్వం గారి విశేష కావ్యం”- అని కేంద్ర సాహిత్య అకాడెమీ విద్వాన్ విశ్వం గురించి పరిచయవాక్యాల్లో పేర్కొంది.

విద్వాన్ విశ్వం గొంతు కిన్నెర మీటుకుంటూ…గుండె కంజరి కొట్టుకుంటూ…
“అదే పెన్న!
అదే పెన్న!”
అని పదే పదే అదే పాట ఎందుకు పాడుతున్నాడో చూద్దాం…పదండి!

రేపు- పెన్నేటి పాట-3
“అదే పెన్న!”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్