The Drought: కర్ణాటక నంది హిల్స్ లో పుట్టే పెన్నా నది 600 కిలోమీటర్లు ప్రవహించి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్న- పెద్ద; ఏరు కలిసి పెన్నేరు. శివుడి ధనస్సు పేరు పినాకం. నంది కొండల్లో శివుడి చెంత నంది కొమ్ముల మధ్య పుట్టిన నది కాబట్టి పినాకిని అని పెన్నకు మరొక పేరు. అంతటి ఆకాశగంగనే నెత్తిన జడలో చుట్టేసుకున్న శివుడి పినాకం పేరుతో ఉన్న నది రెండు, మూడు తరాలకొకసారి నీటి చుక్కను చూడడం కూడా శివుడి లీలే అయి ఉండాలి.
కర్ణాటకలో ప్రవహించే కుముద్వతి; జయమంగళి, చిత్రావతి, పాపాఘ్ని పెన్నకు ఉపనదులు. అనంతపురం జిల్లాలో, కర్ణాటకలో ఈ ఉపనదులన్నీ పెన్నలో కలుస్తాయి. అందుకే పెన్న దారి పొడుగునా అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో కన్నడ సంస్కృతి కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. కన్నడ నేలను దాటిన తరువాత కుందేరు, సగిలేరు, చెయ్యేరు, బహుదా, బొగ్గేరు, బీరాపేరు ఇలా మరికొన్ని ఉపనదులు పెన్నలో కలిసి బంగాళాఖాతం దాకా వెళ్లి వీడ్కోలు చెబుతాయి.
పెన్నార్-కుముద్వతి; పి ఏ బి ఆర్; పెనకచర్ల; చిత్రావతి; మైదుకూరు; యోగివేమన; సోమశిలలాంటి డ్యాములు పెన్న కడుపులో జలభాండాగారాలు. ఇందులో పి ఏ బి ఆర్, పెనకచర్ల డ్యాములకు వచ్చే నీళ్లు తుంగభద్ర హై లెవెల్ కెనాల్ వి. కన్నడ- తెలుగు కలిసినట్లు పెన్న- తుంగ- భద్ర కూడా వియ్యమంది చుట్టాలయ్యాయి.
“నంది పర్వత జాత నవ పినాకినీ జలము నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె”
అన్నాడు అడవి బాపిరాజు. నంది కొండల్లో పుట్టిన పినాకినీ నీళ్లల్లో లేపాక్షి నంది స్నానం చేయడంతో ఆ నది నిలువెల్లా పులకించిందట. పెన్న దారంతా పుణ్య క్షేత్రాలే. పుణ్యతీర్థాలే.
పెన్న గురించి ఎవరు ఏమి చెప్పినా, ఏ సందర్భంలో చెప్పినా విద్వాన్ విశ్వం “పెన్నేటి పాట” గురించి చెప్పి తీరాల్సిందే. విషాద కావ్యమే అయినా…పెన్నేటి పాట పెన్నా నదికి సిగ్నేచర్ ట్యూన్. గొంతు తడారిపోయిన కరువు బరువులో కన్నీరు కూడా కరువయిన పెన్న ఇరుగట్ల బతుకుల్లో పెన్నేటి పాట కోటి గొంతులు చీల్చుకుంటూ…గుండె కంజర కొట్టుకుంటూ పెల్లుబికిన పాట. నీరింకిన పెన్నలో ప్రతి ఇసుక రేణువులో ఇంకిపోయిన పాట. మసకేసిన మబ్బుల కింద శిథిలమై…శూన్యమైపోయిన రైతు పాట. రాయలసీమ కన్నీటి పాట.
కృష్ణా, గోదావరిలాంటిది కాదు పెన్న. పెన్న రాకడ- ప్రాణం పోకడ తెలియదు. వచ్చినప్పుడు రాయలసీమ ప్రేమలా, రాయలసీమ కోపంలా మహోధృతంగా రావడమే తెలుసు పెన్నకు. లేనప్పుడు పీనుగులను కాల్చడానికి పనికివచ్చే వల్లకాడుగా ఏడవడమే తెలుసు పెన్నకు. అందుకే పీనుగుల పెన్న అన్న పేరు వచ్చింది.
చరిత్రకు కావ్యానికి తేడా ఉంటుంది. కావ్యంలో కవిత్వం తప్పనిసరిగా ఉండి తీరాలి. విద్వాన్ విశ్వం పెన్నేటి పాట అక్షరమక్షరం కవిత్వమే అయినా…ఆ కవిత్వ వస్తువు పెన్న వెంబడి పరచుకున్న కరువు. అందులో పాత్రలు కల్పితమే అయినా అవి కోట్ల మంది కరువు బాధితులకు ప్రతిరూపాలు. పెన్నేటి పాట పద్యాల్లో ఉన్నది కరువు మిగిల్చిన శిథిల చిత్రం. కాబట్టే పెన్నేటి పాటలో కరువు చరిత్ర తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత దొరుకుతోంది.
పెన్నేటి పాట చిరు కావ్యం. కానీ అందులో కరువు పెను విషాదం. విద్వాన్ విశ్వం గురించి, ఆయన పెన్నేటి పాట గురించి వ్యాసాల ధారావాహిక ఇది.
రేపు- పెన్నేటి పాట-2
“సాహితీ విరూపాక్షుడు విశ్వం”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018