కొంతమందికి కొన్ని సీక్వెల్స్ కలిసి వస్తాయంతే. అందువల్లనే తమకి వరుస ఫ్లాపులు ఎదురవు తున్నప్పుడు వాళ్లు మళ్లీ ఆ సిరీస్ లో మరో సినిమాను చేయడానికి రంగంలోకి దిగుతుంటారు .. తాము ఆశించిన విజయాన్ని అందుకుంటూ ఉంటారు. అలాంటివారి జాబితాలో విజయ్ ఆంటోని కూడా చేరిపోయాడు. విజయ్ ఆంటోనికి ఎడిటింగ్ లోను .. సినిమా సంగీతంలోనూ మంచి అనుభవం ఉంది. అక్కడి నుంచే ఆయన హీరోగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆయన చేసిన ‘బిచ్చగాడు’ ఓ సంచలనం .. ఒక సాహసం.

విషయం ఉంటే తెలుగులో ఇతర భాషా అనువాద చిత్రాలను కూడా ఆదరిస్తుంటారు. అలాంటి తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘బిచ్చగాడు’ వసూళ్ల వర్షాన్ని కురిపించింది. అప్పటి వరకూ వచ్చిన అనువాద చిత్రాల వసూళ్లను దాటేసి కొత్త రికార్డులను తన పేరుతో రాసుకుంది. ఆ సినిమా తరువాత విజయ్ ఆంటోని ఎన్ని సినిమాలు చేసినా, ఆడియన్స్ కి గుర్తున్నది మాత్రం ‘బిచ్చగాడు’ సినిమా మాత్రమే. ఇప్పటికీ ఆ సినిమాకి టీవీల్లో మంచి రేటింగ్ వస్తుంటుంది.

వరుసగా వెంటాడుతున్న ఫ్లాపుల బారి నుంచి తనని తాను కాపాడుకోవడం కోసం విజయ్ ఆంటోని  ‘బిచ్చగాడు 2’ సినిమా చేశాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. 5 రోజుల్లోనే లాభాల దిశగా దూసుకుపోవడం మొదలుపెట్టింది. దాంతో ఇక ‘బిచ్చగాడు 3’ చేయాలనే నిర్ణయానికి విజయ్ ఆంటోని వచ్చాడు. ‘బిచ్చగాడు 2’తో ఎలాంటి సంబంధం లేని కథతో ‘బిచ్చగాడు 3’ ఉంటుందని చెప్పాడు. 2025లో ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని వస్తానని చెప్పాడు. చూస్తుంటే విజయ్ ఆంటోని ఇక ‘బిచ్చగాడు’ సిరీస్ తోనే ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *