ఒకప్పుడు హీరోలు తమకంటూ ఓ స్టార్ డమ్ వచ్చిన తరువాత ప్రయోగాలను గురించి ఆలోచన చేసేవారు. ఇక ప్రయోగాల జోలికి వెళ్లి ఇమేజ్ ను ఇరకాటంలో పడేయడమెందుకని వాటి జోలికి వెళ్లకుండా కెరియర్ ను ముగించిన హీరోలు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది .. తమ కథలు కొత్తగా అనిపించాలి .. తెరపై తాము కొత్తగా కనిపించాలనే ఆరాటం యువ కథానాయకులలో కనిపిస్తోంది. అందువలన వాళ్లు ప్రయోగాల పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.
విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టుగా సమాచారం. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచే ఈ సినిమా విశాఖపట్నంలో మొదలవుతోంది. నెల రోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుపుకోనున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అనగానే పాటలు ఒక రేంజ్ లో ఉంటాయని యూత్ అనుకోవడం సహజం. కానీ ఈ సినిమాలో అసలు పాటలే ఉండవట.
అవును ఈ సినిమా నేపథ్య సంగీతంతోనే సాగిపోతుంది. ఒక్కపాట కూడా ఉండదని అంటున్నారు. పాటలు కథకి అడ్డుపడతాయనే ఉద్దేశంతో వాటి జోలికి వెళ్లడం లేదని చెబుతున్నారు. సాధారణంగా మలయాళ సినిమాలు చాలా వరకూ పాటలు లేకుండా కథతోనే వెళుతూ ఉంటాయి. ఈ మధ్య తమిళంలో కూడా ఈ తరహా సినిమాలు వస్తున్నాయి. కార్తి ‘ఖైదీ’ అలా మెప్పించిన సినిమానే. ఇక ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ కూడా అలాంటి సాహసమే చేస్తున్నాడు. తెలుగులో మాస్ ఆడియన్స్ పాటలు .. డాన్సులు కోరుకుంటారు. మరి వాళ్లను ఈ సినిమా ఎలా మెప్పిస్తుందనేది చూడాలి.