విజయ బ్రాండ్ ఉత్పత్తులను ఆదరించండని, శుద్ధమయిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పంటల ఉత్పత్తులలో రసాయనాలు, ఎరువులను తగ్గించేందుకు రైతులను చైతన్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. టూరిస్ట్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్‌లోకి 23 విజయ ఉత్పత్తులు విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి. కల్తీ లేని ఉత్పత్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్విరామంగా కృషిచేస్తుందని, తెలంగాణ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ టర్నోవర్ రూ.200 కోట్లు ఉన్నా ఒక్క రూపాయి కూడా లాభాల్లో లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఆయిల్ ఫెడ్ టర్నోవర్ రూ.700 కోట్లు, నికరలాభం రూ.57 కోట్లు ఉందన్న మంత్రి విభిన్నరకాల నూనెగింజల ఉత్పత్తులు, పంటల సాగుకు ఆయిల్ ఫెడ్ కృషిచేయాలన్నారు. 22 మిలియన్ టన్నుల నూనె దేశంలో వినియోగిస్తుంటే కేవలం 7 మిలియన్ టన్నులే ఉత్పత్తి అవుతుందని, 15 మిలియన్ టన్నులు విదేశాల నుండే దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. దాదాపు రూ.80 వేల కోట్లు వంటనూనెల దిగుమతికి వెచ్చిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ కృషితో నూనెగింజల సాగు పెరిగింది .. కేంద్రం కూడా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు.