Saturday, January 25, 2025

శిథిల హంపి-6

The Demolition: విద్యారణ్యస్వామి సంకల్పంతో 1336లో పురుడుపోసుకున్న విజయనగర సామ్రాజ్యం ఇప్పటి దక్షిణ భారతదేశమంతా విస్తరించి ఉండేది. 1565 లో ఇప్పటి కర్ణాటక రాక్షసి- తంగడి గ్రామాల మధ్య జరిగిన తళ్లికోట యుద్ధంలో విజయనగర ప్రభువు అళియరామరాయలును బందీగా శత్రు సైన్యం పట్టుకుని సుల్తాను హుసేన్ షా ముందు ప్రవేశపెడితే…ఆయనే కత్తి తీసుకుని అళియరామరాయలు తల నరికాడు. అప్పుడే హంపీ తల కూడా తెగి పడింది.

తరువాత బీజాపూర్, అహ్మద్ నగర్, రాయచూరు, గోల్కొండ, బీదర్ సుల్తానుల సైన్యం అయిదు నెలలపాటు హంపీలో సాగించిన విధ్వంసం గురించి రాయడానికి మాటలు చాలవు. రాజ కుటుంబీకులు ఉన్నవారు ఉన్నట్లు పెనుకొండకు పరుగులెత్తారు. దోచుకున్నది దోచుకోగా, కూలగొట్టినది కూలగొట్టగా…తమలో తాము కలహించుకుని సుల్తానులు శ్మశానం చేసిన హంపీని వదిలి వెళ్లారు. పెనుకొండలో తలదాచుకున్న విజయనగర రాజులు మళ్లీ హంపీ వచ్చి రాజధానిని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు కానీ…ఎటు చూసినా బూడిద; కూలిన కోటలు, కాలిన గోడలు, పగిలిన విగ్రహాలు, ఒరిగిన గోపురాలు, తెగిన తలలు, విరిగిన చేతులు కాళ్లు, కొల్లగొట్టిన కోశాగారాలు, నెత్తురు పారిన కాలువలతో…వల్లకాడు మాత్రమే మిగిలి ఉండడంతో…మళ్లీ పెనుకొండకే వెళ్లిపోయారు. ఇక తిరిగిరాలేదు.

ఏడు ప్రాకారాలతో అప్పటికి అయిదు లక్షల జనాభాతో ప్రపంచంలోనే రోమ్ తరువాత అతిపెద్ద వాణిజ్య నగరంగా ఉండిన హంపీ కథ అలా కాలగర్భంలో కలిసిపోయింది.

కొంతకాలం విజయనగరానికి పెనుకొండ రాజధాని. అటు తరువాత చంద్రగిరి రాజధాని. చివర వేలూరు రాజధాని.  1646 నాటికి విజయనగర రాజ్యం పూర్తిగా అంతర్ధానం అయ్యింది. దాదాపు మూడు శతాబ్దాలు వరుసగా సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి రాజులు పాలించారు.

అళియరామరాయలు తరువాత పేరుకు విజయనగర రాజ్యం 1646 దాకా ఉన్నా…ఉందంటే ఉంది. అంతే.

విజయనగర వైభవోన్నతికి కారణాలు ఉన్నట్లే…పతనానికీ కారణాలు ఉంటాయి. రాయచూరును గెలిచిన కృష్ణరాయల ప్రభ ముందు నిలువలేని సుల్తానులు సమయం కోసం వేచి చూస్తున్నారు. కన్నడలో “అళియ” అంటే అల్లుడు. కృష్ణదేవరాయల అల్లుడు కాబట్టి అళియ రామారాయలు అయ్యాడు. అతడేమీ ఆషా మాషీ వ్యక్తి కాదు. అనన్యసామాన్యమయిన పరాక్రమం కలవాడు. అంతకుముందు తమలో తాము కలహించుకుంటున్న సుల్తానులందరూ ఒక్కటయ్యారు. జిలానీ సోదరులు ఇద్దరిని అళియరామరాయలు తన సైన్యంలో కీలక స్థానాల్లో పెట్టుకోవడం, వారు మొదట నమ్మించి, చివరికి తళ్ళికోట యుద్ధ సమయంలో సుల్తానులకు సాయపడడం…ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు…అళియరామరాయలుతో పాటు విజయనగర వైభవం కూడా కొడిగట్టడానికి కూడా అనేక కారణాలు.

చరిత్ర అంతా రాజులు- యుద్ధాలే. అయితే- హంపీ దురదృష్టమేమో కానీ…విజయనగర రాజుల మీద ఉన్న కసిని సుల్తానులు గుళ్లు, గోపురాలు, శిల్పాల మీద కూడా ప్రదర్శించారు. ఇరవై అడుగుల పైన ఉన్న గణపతి విగ్రహాల తొండాలను విరిచారు. నరసింహస్వామి ఒడిలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు చిన్నాదేవి కోసం ముచ్చటపడి కట్టించిన కృష్ణాలయంలో కృష్ణుడి విగ్రహాన్ని ముక్కలు చేశారు. ప్రపంచంలో ఇలాంటి సృష్టి ఒకటి అసాధ్యం అని ఆశ్చర్యపోవాల్సిన విఠోబా ఆలయంలో విఠలుడి విగ్రహంతో పాటు రాగాలు పలికే నాట్యమండపాన్ని ధ్వంసం చేశారు. అందంగా కనిపించిన ప్రతి శిల్పంలో అందాన్ని కోసేశారు. రాతి పునాది మీద చెక్కతో అందం అసూయపడేలా నిర్మించుకున్న సంగీత, సాహిత్య భువనవిజయ భవనం బూడిదయ్యింది. కృష్ణరాయల ఇల్లు ధూళిలో ధూళిగా కలిసిపోయింది.

రామాయణ కథా సారాన్ని అణువణువునా అద్దుకున్న శిల్ప సోయగం హజార రామాలయంలో రాముడి విగ్రహం మాయం. కొన్ని పదుల ఆలయాల్లో పూజలు లేవు. ధూప దీప నైవేద్యాలు లేవు.

గర్భాలయంలో విగ్రహం దెబ్బ తింటే ఆగమశాస్త్ర ప్రకారం పూజార్హం కాదు కాబట్టి…పూజలు చేయడం లేదన్న వాదన నాకెందుకో జీర్ణం కావడం లేదు. పునః ప్రతిష్ఠకు అదే ఆగమ శాస్త్రంలో మార్గం ఉంది కదా?

అళియరామరాయలు తళ్లికోటలో ఓడిపోకుండా ఉండి ఉంటే…అని ఇప్పటికీ చాలా మంది కవులు, రచయితలు అనుకుంటూ ఉంటారు. కాలం చాలా విచిత్రమయినది. దేన్నయినా మింగి కూర్చుంటుంది.

ఇప్పటి శిథిల హంపిలో అప్పటి వైభవ దీప్తులను వెతుక్కోవడం తప్ప మనం చేయగలిగింది లేదు.

“ఈ జీర్ణ కుగ్రామమేమి చూపించును
తెనుగు రారాజు పండిన యశస్సు?”

అని కొడాలి వేంకట సుబ్బారావు హంపీ క్షేత్రంలో ప్రశ్నించారు.

నిజమే…
ఎంత ఊహిస్తే మాత్రం ఇప్పటి హంపీలో అప్పటి వైభవాన్ని చూడగలమా?

రేపు:-
“హంపీ రామాయణం-7”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :  హంపీ వైభవం-1

హంపీ వైభవం-2

హంపీ వైభవం-3

హంపీ వైభవం-4

హంపీ వైభవం-5

RELATED ARTICLES

Most Popular

న్యూస్