Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఏపీని బిహార్‌గా మార్చేశారన్న మాటలతో తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ బిహారీలతోపాటు ఆంధ్రులనూ అవమానించారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆరు కోట్ల ఆంధ్రులను, దాదాపు 12 కోట్ల మంది బిహారీలను కించపరిచే రీతిలో లోకేష్ వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. బుధవారం విజయవాడలో వర్తకులతో జరిగిన సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ , ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణ భారత బిహార్‌గా మార్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని విమర్శించారు. దీనిపై విజయసాయి సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు.

“ఈ మాటలు అతని అవగాహనారాహిత్యానికి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసూయా ద్వేషాలకు అద్దంపడుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి తాము ఆశించిన రీతిలో లేదనో, ప్రగతి ఇంకా వేగం పుంజుకుకోలేదనో చెప్పే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు ఉందిగాని లోకేష్‌ మాదిరిగా దేశ సమైక్యతకు, అభివృద్ధికి నిర్వారామ కృషి చేస్తున్న రెండు రాష్ట్రాల ప్రజలను అవమానించే రీతిలో మాట్లాడడం ఒక్క తెలుగుదేశం పార్టీకే చెల్లింది” అంటూ  వ్యాఖ్యానించారు.  అరాచకం తాండవమాడుతోందని, వర్తకులకు తగిన భద్రత లేదన్నట్లుగా లోకేష్ మాట్లాడారని ఈ రెండు విషయాల్లోనూ చంద్రబాబు ‘పుత్రరత్నం’ పచ్చి అబద్ధాలే చెప్పారని  బీహార్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం చట్టబద్ధ పాలన సాగిస్తోందని, ఏపీలోనూ పాలన సజావుగా నడుస్తోందని విజయసాయి బదులిచ్చారు.

లోకేష్ విమర్శలపై విజయ సాయి కౌంటర్ ఇస్తూ…

“1990 నుంచి బిహార్‌లో ముఖ్యమంత్రులుగా ఉన్నది తన తండ్రి మాజీ మిత్రులే కాబట్టి తాను ఇప్పుడు ఆ రాష్ట్రం గురించి ఏమైనా మాట్లాడొచ్చనే అహంభావం చినబాబులో హద్దులు దాటుతోంది. బిహారీ నేతలు ఏనాడూ ఆంధ్రులను కించపరిచే విధంగా మాట్లాడలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ తొలి సీఎంగా– కొన్నాళ్లు హైదరాబాద్‌లో, మరి కొన్నాళ్లు కృష్ణా నది కరకట్టపై నివాసముంటూ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎంత ఇష్టారాజ్యంగా పరిపాలించారో ప్రజలకు ఇంకా గుర్తుంది. పాలకపక్షానికి తప్ప, ప్రతిపక్షానికి ఎలాంటి ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేసిన టీడీపీ సర్కారు తన ఐదేళ్ల పాపానికి 2019లో భారీ మూల్యమే చెల్లించింది. తనతో సహా అనేక మంది మంత్రులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా చినబాబుకు జ్ఞానోదయం కాలేదు. దాని వల్ల ప్రజలకు నష్టం లేదు. కాని, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించే తొందరలో సాటి ఆంధ్రులను, తెలుగునేలను అభిమానించే బిహారీ సోదరులను లోకేష్‌ అవమానించిన విధానం అత్యంత జుగుప్సాకరం. అనాగరికం కూడా. ఇకనైనా ఏపీ ప్రభుత్వంపై నిందలు మోపే సమయంలో చినబాబు కాస్త బుర్రపెట్టి ఆలోచించడం నేర్చుకోవాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది” అంటూ ప్రతిస్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com