భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్ పతకం ఆశలకు విఘాతం కలిగింది. మరి కొన్ని గంటల్లో ఆమె ఫైనల్ పోరుకు సిద్ధం అవుతుండగా…. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందంటూ ఆమెపై అనర్హత వేటు వేస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి) నిర్ణయం తీసుకుంది.
మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్ లో ఫోగాట్ 2020 టోక్యో ఒలింపిక్స్ విజేత జపాన్ రెజ్లర్ యు సుసాకీకిని మట్టికరిపించింది. క్వార్టర్స్ లో యూరోపియన్ మాజీ చాంపియన్ ఒక్సానా లివాచ్ ను ఓడించి సెమీస్ కు దూసుకు వెళ్ళింది. నిన్న జరిగిన పోరులో క్యూబా రెజ్లర్ జుమాన్ లోపెజ్ పై ఓడించి స్వర్ణ పతక రేసులో నిలిచింది. నేడు జరగాల్సిన ఫైనల్ లో హిల్దే బ్రండ్ట్ సారాతో తలపడాల్సి ఉండగా ఐఓసి తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు శరాఘాతంగా నిలిచింది. ఈ పరిణామంతో నివ్వెరపోయిన ఫోగాట్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది.
ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఐఓసి నిర్ణయంపై నిరసన తెలపాలని రాజ్యసభ సభ్యురాలు, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ చైర్ పర్సన్, క్రీడాకారిణి పిటి ఉషకు సూచించారు.