దక్షిణాఫ్రికాలో అల్లర్లు శృతి మించుతున్నాయి. దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమ అరెస్టుతో దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. వారం రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనలతో దేశంలో హింసాత్మక ఘటనలు, లూటీలు ఎక్కువయ్యాయి. అల్లర్ల కారణంగా ఇప్పటివరకు రెండు వందల పైచిలుకు అమాయకులు మృత్యువాతపడ్డారు. లూటీలు, దొమ్మీలతో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. క్వజులు-నాటల్, గుటేంగ్ ప్రావిన్స్ లలో ఎక్కువమంది చనిపోయారు.
సౌతాఫ్రికాలో నెలకొన్న అస్థిరతను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. స్థానిక ఆందోళనలు, అల్లర్లతో భారతీయులకు ఇబ్బందులు తలెత్తకుండా విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. డర్బన్, జోహేన్స్ బెర్గ్ , ప్రిటోరియా నగరాల్లో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఇండియన్స్ భద్రతపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలేది పందోర్ తో చర్చించారు. ఆ దేశంలో ఉన్న భారత హై కమిషన్ అధికారులు స్థానిక ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు.
దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమ 200 8 నుంచి 20 18 వరకు పరిపాలన చేశారు. జుమ ఏలుబడిలో అవినీతి జరిగిందని కొత్త ప్రభుత్వం విచారణకు అదేశించటం, అందులో భాగంగా అరెస్టు చేయటం జరిగింది. దీంతో ఒక్కసారిగా దేశంలో నిరసనలు మిన్నుముట్టాయి. ఈ నెల మొదటి వారంలో శాంతియుతంగా మొదలైన ప్రదర్శనలు వారం రోజుల్లోనే హింసాత్మకంగా మారటంతో అనేకమంది చనిపోయారు. అల్లర్లు ఇతర రాష్ట్రాలకు విస్తరించకుండా అదనపు బలగాలు మొహరించినట్టు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఖుంబుజో శవహేని వెల్లడించారు.