టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అస్త్ర సన్యాసానికి సిద్ధమయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సారధిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఐసీసీ టి-20 టోర్నీ తరువాత ఇండియా టి-20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన విరాట్ తాజా నిర్ణయంతో క్రికెట్ అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురిచేశాడు.
అక్టోబర్- నవంబర్ లో జరిగే ఐసీసీ టి-20 వరల్డ్ కప్ తరువాత టోర్నీ తరువాత ఇండియా పొట్టి ఫార్మాట్ బాధ్యతల నుంచి విరాట్ వైదొలగనున్నాడు. బిసిసిఐ కూడా కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ప్రకటించి తదుపరి బాధ్యతలు ఎవరికివ్వాలనే అంశంపై సమాలోచనలు మొదలు పెట్టింది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు యాజమాన్యం కూడా కోహ్లీ ప్రకటనను స్వాగతించింది. తమ జట్టుకు కెప్టెన్ గా ఇప్పటివరకూ కోహ్లీ అందించిన సేవలు నిరుపమానమైనవని పేర్కొంది.
టీమిండియా మూడు ఫార్మాట్లతో పాటు ఆర్సీబీ కెప్టెన్ గా కొనసాగుతున్న తాను వర్క్ లోడ్ తో ఒత్తిడికి గురవుతున్నానని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కోహ్లీ వెల్లడించాడు, తనకు ఇప్పటి వరకూ సహకరించిన యాజమాన్యానికి, సిబ్బందికి, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. తాను మరింత మెరుగైన ఆటతీరు ప్రదర్శించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. తాను ఐపీఎల్ లో కొనసాగినంత కాలం బెంగుళూరు జట్టుకే ఆడతానని కోహ్లీ పునరుద్ఘాటించాడు.