Saturday, May 17, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకట్టెదుట వైకుంఠము

కట్టెదుట వైకుంఠము

ఎవరయినా ఒక విషయం మీద రెండో సారి చెబితే విషయం చర్విత చర్వణంగా మనకు చప్పగా ఉంటుంది. అవే పడికట్టు పదాలు, అవే భావనలు. ఆ విషయం మీద వారెలా మాట్లాడతారో మనమే చెప్పేయగలుగుతాం. అలాంటిది జీవితకాలంలో పదహారో ఏట మెదలు పెట్టి 94 ఏట తుది శ్వాస వదిలేవరకు అన్నమయ్య రాసి…పాడిన కీర్తనలు అక్షరాలా ముప్పయ్ రెండు వేలు. పోయినవి పోగా మనకు దొరికినవి 14,800. ఇవి కాక సంకీర్తన లక్షణ శాస్త్రం, ఇతర శతకాలు కూడా రాసినట్లు అన్నమయ్య మనవడు చినతిరుమలాచార్యులు స్పష్టంగా చెప్పాడు.

ప్రతి కీర్తనలో వెంకటేశ్వర స్వామే వర్ణనీయ వస్తువు. అలా రోజుకొక కీర్తన, కొన్ని సార్లు రోజుకు రెండు, మూడు కీర్తనలు రాస్తూ 32,000 కీర్తనలు దేనికది ప్రత్యేకం. ఎత్తుగడ భిన్నం. ముగింపు భిన్నం. భావన వైవిధ్యం. మాటల పొందిక ప్రత్యేకం. మనం ఈరోజుల్లో పంచ్ డైలాగులు అని చెప్పుకున్నట్లుగా తెలుగు భాషకు అన్నమయ్య పల్లవులన్నీ శాశ్వతమయిన పంచ్ డైలాగులే.

ఒక్క అన్నమయ్య వల్ల తెలుగు భాష ఎంత సుసంపన్నమయ్యిందో చెబితే దానికదిగా ఒక సాహిత్య చరిత్రే అవుతుంది. నీ వలన నాకు పుణ్యము- నా వలన నీకు కీర్తి అని సాక్షాత్తూ వెంకన్నతోనే అన్నమయ్య చనువుగా అన్నాడు. వెంకన్న కాదనలేదు. అన్నమయ్య లాంటివారు ప్రపంచ సాహిత్య చరిత్రలో అన్నమయ్యకు ముందు లేరు, ఇక ముందు ఉండరు.

“శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై
యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై
కృతులై వెంకట శైల వల్లభ రాత్రిక్రీడా రహస్యంబులై
నుతులై తాళులపాక అన్నయ వచో నూత్న క్రియల్ చెన్నగున్”

అని అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు చెప్పినట్లు అన్నమయ్య ఒక్కో కీర్తన ఒక్కో కావ్యంతో సమానం. ఇంతటి సంకీర్తనాచార్యుడిని తన కోసం వెంకన్నే పుట్టించి తెలుగు భాషను మంత్రమయం చేశాడు.

ఇప్పుడంటే మనం అన్నమయ్య కీర్తలను పరవశించి గానం చేస్తున్నాం. అందులో సాహితీ వైభవాన్ని విశ్లేశిస్తున్నాం. మంత్రార్థాలను వ్యాఖ్యానిస్తున్నాం. జానపద శైలుల జాజరలకు మురిసిపోతున్నాం. మాండలికపు మాధుర్యానికి పొంగిపోతున్నాం. అదివో అల్లదివో అంటూ అన్నమయ్య చూపిన తిరుమలనే కనులారా చూస్తున్నాం. వినరో భాగ్యము విష్ణుకథ అని అన్నమయ్య వినిపించిన విష్ణు కథనే చెవులారా వింటున్నాం. అన్నమయ్య సాహిత్యానికి కొత్త కొత్త బాణీలు కూడా కడుతున్నాం. కానీ, ఇంతటి గొప్ప సాహిత్యం కనీసం మూడువందల యాభై ఏళ్ళకు పైబడి తిరుమల గోపురం గూట్లో మట్టి కప్పుకొని మౌనంగా ఉండిపోయింది. 1922 నుండి ఈ కీర్తనలు వెలుగులోకి రావడం మొదలయ్యింది. తొలి రోజుల్లో సాధు సుబ్రమణ్య శాస్త్రి ఆపై వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ ఆ రాగి రేగులను అధ్యయనం చేసి కీర్తన ప్రతులను లోకానికి అందించారు.

Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

తిరుమలలో తిరుగుతున్న ప్రతిసారీ…నా కళ్ళముందు కనిపించేవి కాకుండా అన్నమయ్య చెప్పినవి మననం చేసుకుంటూ ఉంటాను. అన్నమయ్య పదవీధుల్లో తిరిగితే కనిపించే తిరుమలను చూడడానికి రెండు కళ్ళు చాలవు. వినడానికి రెండు చెవులు చాలవు. మొక్కడానికి రెండు చేతులు చాలవు. ఆ అనుభూతిని నింపుకోవడానికి గుప్పెడు మనసు చాలదు. కానీ…ఒద్దికై మనల్ను రక్షించడానికి ఒక్క కీర్తనే చాలు.

అన్నమయ్య కీర్తన మాటనుకుంటే మాట. పాటనుకుంటే పాట. మంత్రమనుకుంటే మంత్రం. పదాలతో పోతపోసిన కదలని వర్ణ చిత్రం- కదిలే దృశ్యం. అన్నమయ్య మాత్రమే ఆవిష్కరించగల ఒకానొక భావనా ప్రపంచం. ఒక సన్నివేశానికి ప్రత్యక్షప్రసారం.

అది-
అదివో అల్లదివో! అని కొండ ఎక్కడానికి ముందే కొండను చూపుతుంది. మహిమలను తెట్టెలుగా పైకి తేలుస్తుంది. తెప్పల కోనేటి ముందు కనురెప్పలు వేయనీకుండా నిలుచోబెడుతుంది. వేదాలను శిలలుగా చేసుకుని వెలిసిన కొండమీద వినరో భాగ్యము విష్ణుకథ అని చిందులు తొక్కుతుంది. పిడికిట తలంబ్రాలతో కొంత పెడమరలి పద్మావతి నవ్వుతున్న వేళ అన్నమయ్య మనల్ను తీసుకెళ్ళి శ్రీనివాస కల్యాణం పందిట్లో కూర్చోబెడతాడు. లాలనుచు ఊచేరు లలనలిరుగడలా అని పాడే వేళ మెల్లగా ఉయ్యాలను ఊపడానికి మనల్ను ముందు వరుసలో నిలుచోబెడతాడు. పలుకు తేనెల తల్లి పవళించెనుగాన…అంటూ దేవాదిదేవుడి శయనమందిరం తలుపులు కూడా తీసి మనల్ను లోపలికి తీసుకెళతాడు. చివర…దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం ఇమ్మని అడుగు అని అన్నమయ్య మన వెంటపడతాడు.

అలా అన్నమయ్య పదాలను వెంటబెట్టుకుని తిరుమలలో తిరిగి చూడండి. అప్పుడు వెంకన్నే మీ వెంటపడతాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఆ పదాలను స్మరించి…భావించి…చుడండి. అప్పుడు వెంకన్నే మీ నాలుకలపై నర్తిస్తాడు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్