రాజ్యసభలో టిడిపి వర్సెస్ వైసీపీ

TDP-YSRCP:  రాజ్యసభలో వైఎస్సార్సీపీ – తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  చర్చ సందర్భంగా టిడిపికి చెందిన సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించారు.  రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. సామాజికవర్గం ఆధారంగా పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడిదారులను ఇబ్బంది పెడుతోందని  ఆరోపించారు. రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీకి అధినేతగా ఉన్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అయన సినిమా విడుదలకు ముందు కావాలనే సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని సభ దృష్టికి తీసుకు వచ్చారు. గుడివాడ క్యాసినో అంశాన్ని కూడా కనకమేడల ప్రస్తావించారు. రాష్ట్రంలో ఆర్ధిక అరాచకం నెలకొని ఉందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.

కాగా, కనకమేడల ఆరోపణలను వైసీపీ సభ్యులు ఖండించారు. అయన ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. చందబాబు పాలన కంటే జగన్ పరిపాలన వెయ్యిరెట్లు బాగుందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి అన్నారు. అసత్యాలతో, సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. అయితే రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ ఇరు పార్టీలనూ సముదాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *