ఉత్తరాఖండ్ జోషీమఠ్ కుంగినప్పుడు హిందీ, ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరిగింది. జరగాలి కూడా. కొండా కోనల మధ్య ఒక కొండ మీది ఊరు ఎందుకు కుంగిపోతోందో కారణం తెలియడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమాయకత్వం నటించింది. భూ భౌతిక శాస్త్రవేత్తలు, భూ కంపాలను అధ్యయనం చేసే నిపుణులు, నీటిపారుదల నిపుణులు, అటవీ పర్యావరణ శాస్త్రవేత్తలు మూడు, నాలుగు దశాబ్దాలుగా చేసిన హెచ్చరికలన్నీ జోషీమఠ్ ఇళ్ల పగుళ్లలో, నెర్రెలు చీలిన వీధుల్లో, కూలిన- కూలుతున్న పైకప్పుల్లో మనం తాపీగా వెతుక్కోవచ్చు. అకెడెమిక్ ఇంట్రెస్ట్ కోసం వివరంగా చదువుకోవచ్చు. అనేక కమిటీల నివేదికలు, హెచ్చరికలు ప్రభుత్వ వెబ్ సైట్లలో ఎందుకు మాయం అయ్యాయో అర్థం చేసుకోవచ్చు.
జోషిమఠ్ ఇక ఏమాత్రం నివాసయోగ్యం కాదని ఊరు ఊరంతా ఖాళీ చేయించారు. ఇప్పటికి 5.4 సెంటీమీటర్లు కుంగిన నేల భవిష్యత్తులో ఇంకా ఎంత లోతుకు కుంగుతుందోనని ఆందోళనతో మనం మరింత కుంగిపోవడం తప్ప చేయగలిగింది లేదు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, కేరళలాంటి పర్వత ప్రాంతాల్లో ఇంకెన్ని శాశ్వతంగా ఖాళీ చేయాల్సిన జోషిమఠ్ లు ఉన్నాయన్నదే ఆందోళనపడాల్సిన విషయం. ఒక్క ఉత్తరాఖండ్ లోనే పూర్తయినవి కాక ప్రస్తుతం పనులు జరుగుతున్నవి తొమ్మిది వేల మెగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో సగం పూర్తయ్యే దశలో ఉన్నాయి. నాలుగు పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిపే చార్ ధామ్ హై వే ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇవి కాక టూరిస్టు ప్రాజెక్టులు లెక్కలేనన్ని.
ఇప్పుడు అర్థమయ్యిందా?
జోషీమఠ్ దానికదిగా కుంగుతోందా?
ఎవరిచేతయినా బలవంతంగా కుంగింపబడుతోందా?
జోషీమఠ్ ఊళ్లో ప్రాణనష్టం జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నామని చెప్పుకునే ప్రభుత్వం…గూడు వదిలి నీడలేని నిరాశ్రయులకు ఏ భరోసా ఇచ్చింది?
పర్వత ప్రాంతాలు… ప్రత్యేకించి హిమాలయ సానువులన్నీ టూరిస్టుల తాకిడితో తీవ్రమయిన ఒత్తిడిలో ఉన్నాయి. దీనికి తోడు హైడెల్ పవర్ ప్రాజెక్టులు, అంతులేని ఆధునిక వసతులకోసం నిర్మాణాలు...కలిపి దేవభూములను నిలువునా ముంచుతున్నాయి.
ఏ ప్రాంతం ఎంత బరువును తట్టుకోగలదో, ఏ వసతులకు ఎంతవరకు అనువో ఈరోజుల్లో శాస్త్రీయంగా నిర్ణయించవచ్చు. పునాదుల అవసరమే లేని చెక్క ఇళ్లు, మట్టి గోడల ఇళ్లు ఉత్తరాఖండ్ కు అవసరమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. కానీ ఆచరణలో రాజుగారి కొలువులో పాలకు బదులు అందరూ నీళ్లే పోస్తూ ఉంటారు.
ఉత్తరాఖండ్ గతం. ఇప్పుడు కేరళ వంతు. వాయనాడ్ విషాదం మానవ తప్పిదమేనని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆధారాలతో నిరూపిస్తున్నారు. గుజరాత్ దిగువ భాగంలో మొదలై మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు దిగువవరకు వ్యాపించిన పశ్చిమ కనుమలు దాదాపు 25 కోట్ల మందికి జీవనాధారం. ఒక పక్క పాతాళం లోతులు చూసేలా అంతులేని మైనింగ్, మరోపక్క ఆకాశమే హద్దుగా పర్యాటక కేంద్రాల విస్తరణ పశ్చిమ కనుమల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకున్న పాపాత్ముడు లేడు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నామని 2010లో పశ్చిమ కనుమల స్థితిగతులపై అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించిన ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త, రచయిత మాధవ్ గాడ్గిల్ గుండెలు బాదుకుంటున్నారు. 2011 లో నివేదిక ఇచ్చినప్పుడు మన నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుపట్టారు. బాధపడ్డారు. ఇప్పుడుకూడా బాధపడుతున్నారు. రేపు కూడా బాధపడుతూనే ఉంటారు. ఎల్లుండి కూడా బాధపడాల్సిందే.
ప్రకృతి మాత్రం ఎంతకని భరిస్తుంది?
దాని సహనానికీ ఒక హద్దుంటుంది. కుంగిపోయే ఉత్తరాఖండ్ దేవభూముల కొండల్లో, కొట్టుకుపోయే వయనాడ్ దేవతల సొంతింటి(గాడ్స్ ఓన్ కంట్రీ)కొండ బురదల్లో మాధవ్ గాడ్గిల్ నివేదికలు, హెచ్చరికలు వెతుక్కునే నిర్లక్ష్యం ఇంటిపేరైన జాతి మనది.
కేరళ వయనాడ్ పెను ఉపద్రవం మీద అకడమిక్ డిబేట్లకు ఇక ఆకాశమే హద్దు.
టీ తోటల అంచుల్లో బురదలో బురదగా మిగిలిన తోటివారికోసం ఉన్నవారి కన్నీళ్లకూ ఆకాశమే హద్దు.
వయనాడ్ బురదలో లేచి…శవాలు మాట్లాడలేని వేళ- త్వం శుంఠ అంటే త్వం శుంఠ అంటూ శుంఠత్వంలో పోటీలు పడే రాజకీయ పక్షులు బురదచల్లుకోవడానికి కూడా ఇప్పుడు ఆకాశమే హద్దు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు