Wednesday, January 22, 2025
HomeTrending Newsవిశాఖ ఉక్కు కాపాడే బాధ్యత మాది : చంద్రబాబు

విశాఖ ఉక్కు కాపాడే బాధ్యత మాది : చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన ప్లాంట్ ను ఏ విధంగా కాపాడుకోవాలో తాము ఆలోచిస్తుంటే అబద్దాల పార్టీ తామేదో ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎందరో మహానుభావుల  ప్రాణత్యాగాలు, పోరాటాలతో ఏర్పడిన ఈ స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నారని… గతంలో వాజ్ పేయి హయంలో దీన్ని ప్రైవేటీకరించాలని చూస్తే గట్టిగా అడ్డుకుని నిధులు కేటాయించేలా చేసి కాపాడుకున్నామని గుర్తు చేశారు.

చంద్రబాబు నేడు అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం, దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. అంతకముందు కాల్వ పనులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిఎంగా  బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన బాబుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సిఎం ప్రసంగించారు.  భగవంతుడు ఇచ్చిన శక్తితో మీ రుణం తీర్చుకుంటానని, అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించారని… ఇప్పుడు ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలదొక్కుకోవాలని… దీనికోసం తన బాధ్యత నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఉత్రరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. కరడుగట్టిన ఆర్ధిక ఉగ్రవాదులు గత ఐదేళ్లుగా విశాఖను దోచుకున్నారని ధ్వజమెత్తారు.

ప్రజల ఆదాయాన్ని పెంచేలా చేయడం కోసం నైపుణ్యాభివృద్ధి సెన్సెస్ తయారు చేస్తున్నామని బాబు  చెప్పారు. ఉచిత ఇసుకను అందిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నా మన్నారు. వాలంటీర్లు ఉంటేనే పెన్షన్ల పంపిణీ సాధ్యమని చెప్పిన పెద్ద మనుషులకు బుద్ధి చెప్పేలా ఒకేరోజు సచివాలయ ఉద్యోగులతో పెంచిన పెన్షన్లు పంపిణీ చేయించామని పేర్కొన్నారు. పెన్షన్లు ఇస్తూనే అదేరోజు ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్