అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని, దానికోసం పోరాటం చేస్తున్న రైతులకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర రెండో రోజు కార్యక్రమంలో భాగంగా కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదని, ఒక్క రాజధాని… అది కూడా అమరావతి ఉండాలన్నది తమ విధానమని స్పష్టం చేశారు.
విభజన సందర్భంగా నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని రాహుల్ వ్యాఖ్యానించారు. ఏపీలో కాంగ్రెస్ పునర్ వైభవానికి అవకాశాలు ఉన్నాయని, తన యాత్రకు ప్రజల మద్దతు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పొత్తుల అంశం తన పరిధిలో లేదని రాహూల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడే సుప్రీమ్ అని, తనతో సహా పార్టీ కార్యకర్తలందరూ ఆయన ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. భారత దేశాన్ని కలిపి ఉంచేందుకే ఈ యాత్ర చేపట్టానన్నారు. అనేక అంశాలపై ఎంతో నేర్చుకోవడానికి ఈ యాత్ర దోహదం చేస్తోందని తెలిపారు.
Also Read : శనివారానికి రాహుల్ యాత్ర వెయ్యి కిలోమీటర్లు