Investigating: జంగారెడ్డిగూడెం సంఘటనపై ప్రతిపక్షనేత చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న పేర్ని నాని జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలపై జిల్లా కలెక్టర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కొంతకాలంగా గూడెంలో వరుస మరణాలు అక్కడి ప్రజలను కలవర పెడుతున్నాయి. వారు నాటు, కల్తీ సారా తాగడం వల్లే మరణిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుండగా, వివిధ వ్యాధులతోనే మరణిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ మరణాలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు గంజాయి నివారణ, అక్రమ మద్యం అరికట్టేందుకు ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్.ఈ.బి.) అధికారులు జంగారెడ్డి గూడెంలోని ప్రతి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.
జంగారెడ్డి గూడెం ఘటనపై మంత్రి నాని స్పందించారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించామని, ఈరోజు కూడా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారని అయన వెల్లడించారు. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తరువాత వాస్తవాలు తెలిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటైందని, శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.